Suryaa.co.in

Andhra Pradesh

కిలారు రాజేష్‌ను పోలీసులతో చంపించేందుకు జగన్ రెడ్డి కుట్ర

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ప్రతిపక్ష పార్టీ నాయకులను భౌతికంగా ఇబ్బందులు పెట్టటం లేదా భౌతికంగా లేకుండా చేయాలని పోలీసుల సహకారంతో జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న కిలారు రాజేష్‌పై కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు రెక్కీ నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు.

టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను పోలీసుల సహకారంతో అడ్డు తొలగించుకొని రాబోయే ఎన్నికల్లో గెలవాలని జగన్ రెడ్డి కుట్ర పన్నుతున్నాడు.

అందులో భాగంగానే మా పార్టీ ముఖ్య నాయకుడు కిలారు రాజేష్‌పై ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో రెక్కీ చేపట్టారు. రెక్కీ చేపట్టిన వారిలో కౌంటర్ ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులును హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. అతనితో పాటు ఉన్న మరో ముగ్గురు ఎవరు? పులివెందుల రౌడీ బ్యాచ్చా? లేక కిరాయి హంతకులా? వాళ్లు ఎవరో డీజీపీ సమాధానం చెప్పాలి. మా పార్టీ నాయకుడు కిలారు రాజేష్‌ను వెంబడించి ఫోటోలు తీయాల్సిన అవసరం ఏంటి? ముఖ్య నాయకులను అందరినీ చంపేసి ఎన్నికలు చేసుకుంటారా?

తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కొందరు హైదరాబాద్‌లో ఉన్నారు. తరచూ వెళ్ళి వచ్చే వారి కదలికలను గమనించటానికి ఎన్ని షాడో పార్టీలు వెంటాడుతున్నాయో ఏపీ డీజీపీ, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మీకు ఏం హక్కు ఉందని మా నాయకుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు? ఇది రాజ్యాంగ విరుద్ధం. కిలారు రాజేష్‌ను చంపేయటానికే రెక్కీ నిర్వహించటం, కదలికలను గమనించటం వంటివి చేస్తున్నారా?

షాడో పార్టీలో ఉన్న వారు పోలీసులేనా లేదా పులివెందులకు చెందిన జగన్ రెడ్డి రౌడీ బ్యాచ్చా? కిరాయి హంతకులా? జగన్ రెడ్డి ఈ రోజు ఉంటాడు రేపు పోతాడు. కానీ అధికారులు శాశ్వతం. జగన్ రెడ్డికి భజన చేయటం డీజీపీ ఆపాలి. జగన్ రెడ్డికి సేవ చేయటానికే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు. కేవలం జగన్ మోహన్ రెడ్డి సేవలోనే తరిస్తారా లేదా రాష్ట్ర ప్రజలకు కూడా సేవ చేస్తారో సమాధానం చెప్పాలన్నారు.

జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పోలీసులు వారి విధివిధానాలను మరిచిపోయారు. పోలీసు వ్యవస్థ క్రైమ్ మీటింగ్ లు కానీ, డ్యూటీ మీట్ లు కానీ వార్షిక తనిఖీలు కానీ చేయకుండా.. కేవలం జగన్ సేవలో తరించటం క్షంతవ్యం కాదు. ప్రజలకు న్యాయం చేయాలి, శాంతి భద్రతలను కాపాడాలని పోలీసులకు లేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన వందలాది మందిపై కేసులు పెట్టారు. అరెస్టు చేశారు.

కానీ ఒక్క కేసులో పూర్తిస్థాయి ఛార్జ్‌షీట్‌లు లేవు. పోలీస్ స్టేషన్‌లో ఏం జరుగుతుందో ఇన్స్ పెక్షన్ చేయటమే లేదు. పోలీసింగ్‌ను మర్చిపోయి జగన్ జిందాబాద్ అనటంలో పోలీసు శాఖ నిమఘ్నమైనందుకు బాధగా ఉంది. సోషల్ మీడియా పోస్టింగ్స్‌పై నేను 45 కంప్లైంట్‌లు ఇచ్చాను. కానీ అవి ఏం అయినవో తెలియదు, పోలీసుల వద్ద నుంచి స్పందన లేదు.

కిలారు రాజేష్‌తో పాటు మా నాయకులపై ఎన్ని షాడో పార్టీలు పనిచేస్తున్నాయో డీజీపీ శ్వేత ప్రతాన్ని విడుదల చేసే దమ్ము ఉందా?

హైదరాబాద్ పోలీసులు కేసును నమోదు చేసి, కేసును తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు. టెర్రరిస్టులు, నక్సలైట్లు, జాతీయ-అంతర్జాతీయ విద్రోహ శక్తుల కదలికలను గమనించవలసిన కౌంటర్ ఇంటెలిజెన్స్‌లను తెలుగుదేశం నాయకులపై ప్రయోగించటం చట్ట వ్యతిరేకం. కిలారు రాజేష్‌ను వెంబడించిన ఆ నలుగురిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కిలారు రాజేష్‌పై రెక్కి నిర్వహించడం పౌరహక్కులకు భంగం కలిగించడమేనని వర్ల రామయ్య అన్నారు.

 

LEAVE A RESPONSE