Suryaa.co.in

Andhra Pradesh

చుక్కల భూములపై నాడు జగన్ రెడ్డికి కన్ను!

• వైసీపీ నేతలకు కట్టబెట్టేందుకు సెటిల్ మెంట్లకు దిగిన కలెక్టర్లు
• పేదల భూములపై భారీ స్కెచ్
• తక్కువ ధరకే బేరసారాలు.. వినకుంటే నాడు బెదిరింపులు
• ‘గ్రీవెన్స్‌’లో బాధితుల మొర

మంగళగిరి: జగన్ రెడ్డికి రాష్ట్రంలో ఉండే చుక్కల భూములపై కన్ను పడిందని.. దాదాపు రెండు లక్షల ఎకరాలకు పైగా ఉన్న భూములను కొట్టేయాలని ఆయన, ఆయన పార్టీ నేతలు చూశారని.. అందుకే ఆ భూములపై సర్వాధికారాలను నాడు కలెక్టర్లకు ఇచ్చి.. పేదల అనుభవంలో ఉన్న చుక్కల భూములపై పలువురు కలెక్టర్లు స్వయంగా సెటిల్ మెంట్ కు దిగి.. వైసీపీ నేతలకు అమ్మాలని ఒత్తిడి చేశారని.. తక్కువ ధరకే భూములను కొట్టేసే ప్లాన్ చేశారని పలువురు బాధితులు ఆరోపించారు.

పేదల అనుభవంలో ఉన్న భూములకు సంబంధించి అన్ని ఆధారాలు వారి వద్ద ఉన్నా తప్పులు సరిచేయకుండా.. పేదలకు చెందాల్సిన భూములు వారికి దక్కుండా ఆఫీసుల చుట్టూ తిప్పారని.. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం పెద్దగంజాం గ్రామానికి చెందిన పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి తెలుగుదేశం(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో వాన్ పిక్ భూముల విషయమై నేతలు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఎమ్మెల్సీ అనురాధ, రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తిలకు అర్జీ ఇచ్చి తమ గోడును విన్నవించారు. ఆరేళ్ళ నుంచి తిరుగుతున్నా అధికారులు పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని.. వాస్తవం పరిశీలించి న్యాయం చేయాలని వేడుకున్నారు.

• టీడీపీకి ఓట్లు వేశామన్న కోపంతో వేణుగోపాల్ అనే వ్యక్తి అర్ధరాత్రి తమ ఇంటిపై దాడి చేసి తన భార్య తల పగలకొట్టాడని.. తీవ్రమైన గాయాలతో మార్టూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే అధికారులు వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని బాపట్ల జిల్లా మార్టూరు మండలం రాజుపాలెంకు చెందిన బాధితులు గ్రీవెన్స్ లో ఆవేదన వ్యక్తం చేశారు.
• అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం గానుగలగొంది గ్రామానికి చెందిన పలువురు గిరిజనులు విజ్ఞప్తి చేస్తూ.. ఆదివాసీలకు చెందాల్సిన పోలవరం ముంపు పరిహారాన్ని కొట్టేసేందుకు వైసీపీ నేతలు తప్పుడు పత్రాలు, నకిలీ రికార్డులతో మోసం చేసి డబ్బులు దండుకున్నారని.. దీనిపై విచారించి చర్యలు తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
• గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా గన్నవరం మండలం అజ్జంపురం గ్రామంలో 54.74 ఎకరాలు రైతుల నుండి తీసుకుని వారికి అమరావతిలో ఫ్లాట్లు కేటాయిస్తామని చెప్పి కేటాయించకపోవడంతో వారు న్యాయం కోసం గ్రీవెన్స్ లో నేతలను అభ్యర్థించారు.
• అధికారుల తప్పుతో నిరుద్యోగులు నష్టపోతున్నారని.. ప్రకాశం జిల్లాలో 167 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా.. 72 పోస్టులను పూరించుటకు మాత్రమే అధికారులు వివరాలు ఇవ్వడంతో నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని.. అన్ని పోస్టులను భర్తీ చేసి ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగ వ్యాయామ విద్యా పోరాట సమితి సభ్యులు కోరారు.
• తాము కొనుగోలు చేసి ఎమ్మిగనూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రర్ చేయించుకున్న భూమి ఆన్ లైన్ లో ప్రభుత్వ భూమిగా పడిందని.. తప్పును సరిచేయాలని సంవత్సరం నుండి తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని.. విచారించి ప్రభుత్వ భూమి నుండి తమ భూమిని వ్యవసాయ భూమిగా మార్చాలని కర్నూలు జిల్లా నందవరం గ్రామానికి చెందిన వి. గోవింద రాజులు విజ్ఞప్తి చేశారు.
• ఏపీ ప్రభుత్వం 2022 నవంబర్‌ 28న కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కొరకు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా ప్రిలిమనరీ పరీక్ష 2023 జనవరి 22న నిర్వహించగా ప్రశ్నాపత్రంలో తప్పులు ఉండటంతో తమకు మార్కులు తగ్గాయని.. తగ్గిన మార్కులు యాడ్ చేయకుండా దాన్నే ఫైనల్ చేయడంతో తాం నష్టపోతున్నామని.. మార్కులు యాడ్ చేసి క్వాలిఫై అయిన వారిని కూడా ఫిజికల్ టెస్ట్, ఫైనల్ రాత పరీక్షకు పిలిచి ఉద్యోగాలు కల్పించాలని పలువురు అభ్యర్థులు వేడుకున్నారు.
• గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన ఓ మహిళ విజ్ఞప్తి చేస్తూ.. తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోగా పోలీస్టేన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళితే.. అక్కడ సీఐ ముందే స్టేషన్ రైటర్ అన్యాయంగా తనను కొట్టారని.. అతన్ని సస్పెండ్ చేయాలని బాధిత మహిళ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.

LEAVE A RESPONSE