ఏపీ బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్
మంగళగిరి: అమరావతి నిర్మాణంపై అబద్ధపు లెక్కలు ప్రచారం చేస్తున్నారని ఏపీ బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి బిల్లుపై పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు. అమరావతి పేరుతో భారీ స్కాం జరుగుతోందంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. అయినప్పటికీ విషప్రచారం ఆగడం లేదని వ్యాఖ్యానించారు. మీడియా ముందు వచ్చినప్పుడల్లా జగన్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తుంటారని, ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. అమరావతిని అవినీతి రాజధానిగా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. చదరపు అడుగుకు రూ.14 వేల వరకు ఖర్చు చేస్తున్నారని జగన్ చెబుతున్నారని, వాస్తవానికి అంతలో సగం కూడా ఖర్చు చేయడం లేదని తెలిపారు. ప్రజలను మోసం చేసేందుకు కుట్రపూరితంగా తప్పుడు లెక్కలు చెబుతున్నారని విమర్శించారు.
దేశ పార్లమెంట్ నిర్మాణ ఖర్చుల విషయమై కూడా జగన్ తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేశారని అన్నారు. రూ.1200 కోట్ల అంచనాతో నిర్మించిన పార్లమెంట్ భవనంపై రూ.970 కోట్లే ఖర్చు అయ్యిందంటూ చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతూ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. అమరావతిలో నిర్మాణాలు రూ.4,890 కోట్ల వ్యయంతో 70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జరుగుతున్నాయని తెలిపారు. చదరపు అడుగుకు సుమారు రూ.6,985 మాత్రమే ఖర్చు అవుతుందని వివరించారు. అయితే జగన్ మాత్రం ఒకసారి రూ.12 వేలు, మరోసారి రూ.14 వేలు అని చెప్పడం ద్వారా ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని అన్నారు.
అమరావతి సచివాలయం నిర్మాణం అత్యాధునికంగా, బహుళ అంతస్తులతో రూపొందుతోందని తెలిపారు. ఐదు టవర్లతో నిర్మాణం జరుగుతుండగా, నాలుగు టవర్లు జీ+40, ఒకటి జీ+46 అంతస్తులతో ఉంటాయని, అందులో ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఉంటుందని వివరించారు.
అమరావతిపై ద్వేషంతోనే జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడమే ఆయన లక్ష్యమని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల విజన్ లేకపోవడంతో ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే నాయకత్వం నారా చంద్రబాబు నాయుడుదేనని పేర్కొన్నారు. ఆయన దూరదృష్టితో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.
వైజాగ్‌లో రుషికొండ నిర్మాణంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. చదరపు అడుగుకు రూ.35 వేల వరకు ఖర్చు చేసి నిర్మాణం చేపట్టారని, అయితే ఖర్చు వివరాలపై భిన్న ప్రకటనలు చేశారని విమర్శించారు. కాగ్ నివేదికలో రూ.500 కోట్లకు పైగా ఖర్చు చూపించారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి పనులు చేయకపోయి, ఇప్పుడు విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు. అమరావతి రైతులకు క్షమాపణలు చెప్పాలని జగన్‌ను డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు అమరావతికి మద్దతు ఇస్తే, వైసీపీ మాత్రం వ్యతిరేకించడం గమనార్హమని పేర్కొన్నారు.