Suryaa.co.in

Andhra Pradesh

మహిళలకు భద్రత కల్పించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలం

-ఎన్సీఆర్బీ డేటాతో ఖంగుతిన్న జగన్ సర్కార్
-వరుస ప్రెస్ మీట్లతో మండిపడ్డ 14 మంది తెలుగు మహిళలు
-వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఇంటికి పంపుదాం
-మాజీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి

ఆంధ్రప్రదేశ్‌ లో మహిళలకు భద్రత కల్పించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు విమర్శించారు. ఇటీవల వెలుబడిన ఎన్సీఆర్బీ-2022 కు సంబంధించిన వివరాలపై మంగళవారం వారు పత్రికా సమావేశం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, పిల్లలపై నేరాలు పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) తాజా డేటాను సూచిస్తుందని తెలుగు మహిళలు పేర్కొన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు.

మాజీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, తెలుగు మహిళా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేఘాల దేవి, తెలుగు మహిళా నరసాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు డా. రాజ్యలక్ష్మి, తెలుగు మహిళా అనకాపల్లి అధ్యక్షురాలు ఆడారి మంజు, తెలుగు మహిళా కాకినాడ పార్లమెంట్ అధ్యక్షురాలు సుంకర పావని, తెలుగు మహిళా అమలాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు పచ్చెట్టి విజయలక్ష్మి, తెలుగు మహిళా విజయనగరం పార్లమెంట్ అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి, తెలుగు మహిళా నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాకలక్ష్మి, తెలుగు మహిళా కడప పార్లమెంట్ అధ్యక్షురాలు సుధ, తెలుగు మహిళా విజయవాడ పార్లమెంట్ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి తదితరులు మీడియా సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల భద్రతపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని చెప్పారు.

ఈ ఏడాది విడుదల అయిన ఎన్‌సిఆర్‌బి డేటా ప్రకారం 2022లో లైంగిక దాడి వ్యభిచారం కోసం మహిళల అక్రమ రవాణా అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. 2022లో మహిళలపై నేరాల కేసుల సంఖ్యలో 25,503 కేసులను నమోదుతో దేశంలో ఆరవ స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 2022లో 3,308 పిల్లలపై నేరాల కేసులు నమోదయ్యాయని చెప్పిన వారు 2021 తో పోల్చితే 24 శాతం ఎక్కువ పెరిగాయని స్పష్టం చేశారు. సైబర్ నేరాలకు సంబంధించి ఏపీ ఐదో స్థానానికి తీసుకొచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వాని దని మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళల భద్రతకు పెద్దపీట వేసిందని నన్నపనేని రాజకుమారి గుర్తు చేశారు. మహిళ భద్రతకు భరోసా ఇవ్వడంలో వైఎస్సార్‌సీ ప్రభుత్వం విఫలమైనందని పేర్కొన్నారు. సైకో ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉంటాయి అనడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం మచ్చుతునక అని స్పష్టం చేశారు. జగన్ పాలనలో మహిళలకు కనీస భద్రత లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ తమ ఓటు హక్కు ద్వారా వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని తరిమి కొట్టాని హితవుపలికారు.

LEAVE A RESPONSE