-మరోసారి బట్టబయలైన జె-గ్యాంగ్ అవకాశవాదం
-టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకట్రావు
సజ్జల సలహాలు, జగన్ పాలనతో రాష్ట్రంలో పీకల్లోతున ఊబిలో కూరుకుపోతోంది. రాష్ట్రవిభజనకు సంబంధించి సుప్రీంకోర్టులో వైసిపి ప్రభుత్వ అఫిడవిట్ తో జగన్ రెడ్డి ప్రభుత్వం మరోమారు తీరని ద్రోహం చేసింది. విభజన కేసులు మూసివేయాలన్న తాజా అఫిడవిట్ తో రాష్ట్రానికి రావాల్సిన సుమారు లక్షకోట్ల ఆస్తులు చేజేతులా వదులుకోవడమే.
షెడ్యూలు 9,10 ప్రకారం రాష్ట్రానికి సుమారు లక్షకోట్లరూపాయల ఆస్తులు రావాల్సిన అంశం కోర్టులో పెండింగ్ లో ఉండగా, విభజన అంశం ముగిసిందని సుప్రీంకోర్టులో ఏవిధంగా అఫిడవిట్ సమర్పిస్తారు? ప్రభుత్వ అనాలోచిత చర్యతో రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులను వదులుకున్నట్లు కాదా? రాష్ట్రంలో ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకు వైసిపి నేతలు కొత్తనాటకానికి తెరలేపారు. విభజన సమయంలో కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రజలు ఆకాంక్షలకు విరుద్దంగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కలిసి ఉండటమే తమ విధానమంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజనలో కీలకపాత్ర పోషించింది వైసిపినే. ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రాన్ని విభజించవచ్చని చెప్పింది జగన్ రెడ్డి కాదా? ఆంధ్రప్రదేశ్ ను విభజించవద్దంటూ పార్లమెంటులో టిడిపి ఎంపిలు పోరాటం చేస్తే ఆ సమయంలో లోక్ సభలో ఉన్న జగన్మోహన్ రెడ్డి విభజనకు మద్దతు తెలపలేదా? రాష్ట్ర విభజన అడ్డుకున్నందుకు టిడిపి ఎంపిలపై భౌతికదాడులకు దిగితే జగన్ రెడ్డి మౌనంగా వారికి మద్దతు తెలపలేదా? బెంచికింద దాక్కుని విభజనవాదులకు మద్దతు తెలిపిన చరిత్ర జగన్ రెడ్డిది కాదా? పూటకో మాట, ప్రాంతానికో విధానమే వైసిపి ఎజెండా. ఇటీవల కర్నూలులో హైకోర్టు అంటూ ఆ ప్రాంత ప్రజలను నమ్మబలికి సుప్రీంకోర్టులో మాత్రం అమరావతిలోనే హైకోర్టు ఉండాలని ప్రభుత్వ అడ్వకేట్లతో చెప్పించిన మాట వాస్తవం కాదా?
ఇంకా ఎంతకాలం వంచనతో రాష్ట్రప్రజలను మోసగించాలనుకుంటున్నారు. విభజన కేసులు మూసేయాలని సుప్రీంకోర్టులో వైసిపి ప్రభుత్వం అఫిడవిట్ వేసిన విషయం వాస్తవం కాదా? విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన సుమారు లక్ష కోట్లరూపాయలు జగన్ రెడ్డి అనాలోచిత చర్యల కారణంగా నీళ్లొదిలినట్లు కాదా? వైసిపి ప్రభుత్వ అవకాశవాద రాజకీయాన్ని రాష్ట్రప్రజలంతా గమనించి బుద్దిచెప్పాల్సిందిగా తెలుగుదేశం పార్టీ విజ్జప్తిచేస్తోంది.