తాడేపల్లి: రాష్ట్రంలో వరుసగా నాలుగో ఏడాది కూడా వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి జమచేశారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇవాళ్ల రైతులకు సంబంధించి రెండు మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. 50 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వరుసగా నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్నాం.
తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా ఏటా రూ.13,500 భరోసా అందిస్తున్నాము. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో 50.92 లక్షల మందికి రూ.5,853.74 కోట్లు లబ్ధిచేకూరింది. మూడో విడత కింద 51.12 లక్షల మందికి రూ. 1.090.76 కోట్లు జమ చేస్తున్నాం.