Suryaa.co.in

Editorial

జగన్ సాబ్.. జర దేఖో

– తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కూతురు
– కుమార్తె తరఫున తానే సంతకం చేసిన పవన్
– తన కుమార్తెలు బాప్టిజం తీసుకున్నారని గతంలోనే ధైర్యంగా చెప్పిన పవన్
– తిరుమలలో కూతుర్లతో సాంప్రదాయం పాటించి మెప్పించిన పవన్ కల్యాణ్
– ఎన్నోసార్లు తిరుమలకు వెళ్లినా ఇప్పటిదాకా డిక్లరేషన్ ఇవ్వని జగన్
– తాను హిందువా? క్రైస్తవుడా అన్న దానిపై స్పష్టత ఇవ్వలేని జగన్
– పైగా ఇదేం దేశం? ఇదేం సెక్యురిజం అంటూ ఎదురుదాడి
– పవన్ ను చూసి నేర్చుకోమంటూ జగన్‌పై నెటిజన్ల జంగ్
– సెక్యులరిజం అంటే ఇదీ అంటూ పవన్ బిడ్డ ఫొటోలు పెట్టి మరీ ర్యాగింగ్
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇదేం దేశం? ఇదేం సెక్యులరిజం?.. అంటూ తనను తిరుమల డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలని కోరిన వారిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసిన ఎదురుదాడి ఇది.

కానీ పరాయి దేశానికి చెందిన ఓ మైనర్ బిడ్డ.. క్రైస్తవమతం తీసుకున్న ఆ ఆడపిల్ల.. తనకు టీటీడీ అధికారులు ఇచ్చిన డిక్లరేషన్ ఫారంపై, భక్తిశ్రద్ధలతో సంతకం పెట్టింది. తనకు హిందూమతం, వెంకన్నపై సంపూర్ణ భక్తివిశ్వాసాలున్నాయని నిండుమనుసుతో సంతకం పెట్టింది.

తన తండ్రితో కలసి స్వామివారిని దర్శించుకుంది. ఇది జరిగింది ఎక్కడో కాదు.. జగన్ ప్రశ్నించిన ‘ఇదేం దేశం‘ అన్న ఈ దేశంలోనే! ఆ కొండపైనే!!ఇదే అసలైన సెక్యులరిజం!!! ఆలయ సాంప్రదాయాలు పాటిస్తూ, డిక్లరేషన్‌పై సంతకం చేసిన ఆ మైనారిటీ తీరని ఆడబిడ్డ ఎవరో కాదు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూతురు కొణిదెల పలీనా అంజలి.

శ్రీవారి లడ్డులో జరిగిన అపచారానికి చింతిస్తూ, పవన్ కల్యాణ్ తిరుమలలో చేసిన కాలినడక ప్రాయశ్చిత్తదీక్ష విరమణలో.. వైసీపీ అధినేత జగన్ తలదించుకునే ఓ ఘటన చోటుచేసుకుంది. కాలినడకన తిరుమల చేరుకున్న పవన్ కల్యాణ్.. తన ఇద్దరు కుమార్తెలతో కలసి మహాద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. అందులో పెద్ద ప్రత్యేకత లేకపోవచ్చు.

కానీ పవన్ తన చిన్న కుమార్తె కొణిదెల పలీనా అంజలిని మీడియాముందుకు తెచ్చారు. ఆమె తిరుమల స్వామి వారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చింది. పవన్ స్వయంగా డిక్లరేషన్ ఫారంపై, తన బిడ్డతో సంతకం చేయించడం విశేషం. అయితే పలీనా మైనర్ అయినందున, ఆమె తరఫున పవన్, తండ్రిగా సంతకం చేయడమే విశేషం. తొలుత డిక్లరేషన్ బుక్ తీసుకువచ్చిన టీటీడీ అధికారులను పవన్ స్వాగతించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే పవన్ కుటుంబం స్వామివారిని దర్శించుకుంది.

తన కుమార్తెలు బాప్టిజం తీసుకున్నారని పవన్ గతంలోనే ప్రకటించారు. దానితో తిరుమలకు ఆయనతో వెళ్లిన కుమార్తెలు, డిక్లరేషన్‌పై సంతకం చేస్తారా? చేయరా? అన్న ఉత్కంఠకు తెరలేచింది. అయితే వాటిని పటాపంచలు చేస్తూ.. పవన్ కుమార్తె డిక్లరేషన్‌పై సంతకం చేసి, తాను నిజమైన సెక్యులరిస్టునని చాటుకుంది.

తాను క్రైస్తవురాలినయినా, హిందూమత విశ్వాసాలు, వెంకటేశ్వరస్వామిపై భక్తి ఉందని ప్రపంచానికి చాటింది. కానీ జగన్ వైఖరి అందుకు పూర్తి భిన్నం. అందుకే ఇప్పుడు జగన్ వ్యవహారం మళ్లీ తెఎరపైకి వచ్చేందుకు కారణమయింది.

ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. ఈ వ్యవహారం జగన్‌కు, అటు నైతికంగా ఇటు రాజకీయంగా ఇరకాటంగా పరిణమించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వకుండా..ఆ సాంప్రదాయాలు గుర్తుచేసిన వారిపె..ై ఇదేం దేశం? ఇదేం సెక్యులరిజం అంటూ ఎదురుదాడి చేసిన జగన్ వైఖరి.. తాజా పవన్ బిడ్డల డిక్లరేషన్ వ్యవహారం, నైతికంగా-రాజకీయంగా ఇరుకునపెట్టినట్టయింది.

ముఖ్యమంత్రిగా పనిచేసి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా అయిన జగన్‌కు, పవన్ బిడ్డలు పాఠాలు నేర్పారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ అంత వయసు లేకపోయినా, జీరో రాజకీయ అవగాహన ఉన్న పవన్ బిడ్డ ఇంకా మైనర్ అయినప్పటికీ.. హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ డిక్లరేషన్ ఇవ్వడం, జగన్‌కు సిగ్గుచేటు వ్యవహారమేనంటున్నారు.

తన బిడ్డలు క్రైస్తవులని ధైర్యంగా చెప్పడమే కాకుండా, వారితో తిరుమలలో డిక్లరేషన్ ఇప్పించిన పవన్‌ను చూసి, జగన్ సిగ్గుతో తలదించుకోవాలంటున్నారు. పవన్ ధైర్యాన్ని అటు క్రైస్తవ సమాజం కూడా మెచ్చుకుంటోంది.

నిజానికి జగన్ తాను హిందువా? క్రైస్తవుడా అన్నది ఇప్పటికీ చెప్పలేదు. కానీ ఆయన పెళ్లి, తండ్రి వైఎస్ అంత్యక్రియలన్నీ క్రైస్తవ పద్ధతుల్లోనే జరిగాయని ప్రపంచానికి తెలుసు. తాజాగా తాను నాలుగుగోడల మధ్య బైబిల్ చదువుతానని జగనే స్వయంగా వె ల్లడించారు.

ఇప్పటివరకూ ఒక్కసారి కూడా భార్యతో కలసి తిరుమల వెళ్లలేదు. అయినా తిరుమల వెళ్లినప్పుడు, హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ.. డిక్లరేషన్ ఇవ్వాలన్న కనీసస్పృహ కూడా లేకపోవవడంపై, ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

పైగా డిక్లరేషన్‌పై ప్రశ్నించిన వారిని ఇదేం దేశం? ఇదేం సెక్యులరిజం అంటూ విరుచుకుడిన కొద్దిరోజుల తర్వాత.. మైనర్ అయిన పవన్ కల్యాణ్ బిడ్డ, క్రైస్తవురాలయి ఉండి కూడా హిందూ ధర్మంపై గౌరవంతో డిక్లరేషన్ ఇవ్వడంతో, జగన్ పరువుపోయినట్లయింది.ఫలితంగా అందరూ జగన్-పవన్‌బిడ్డ జ్ఞానాన్ని పోల్చే పరిస్థితి ఏర్పడింది.

దీనితో సోషల్‌మీడియాలో నె టిజన్లు.. జగన్.. ఆ చిన్నపిల్లను చూసి నేర్చుకో.. నీ చదువు-సంస్కారం ఎందుకు? గాడిదలు కాయడానికా?.. చిన్నపిల్లయిన పవ న్ బిడ్డకు ఉన్న జ్ఞానం కూడా నీకు లేకపోతే ఎలా?.. పెంపకం అంటే అలా ఉండాలి. పవన్ చెప్పిన వెంటనే ఆ చిన్నపిల్ల చూడు? ఎంత శ్రద్ధగా డిక్లరేషన్‌పై సంతకం పెట్టిందో? నువ్వూ ఉన్నావు ఎందుకు?.. నువ్వు చేసిందే తప్పు. పైగా దేశాన్ని-సెక్యులరిజాన్ని విమర్శిస్తావా? అంటూ సోషల్‌మీడియా సైనికులు చెడుగుడు ఆడుకుంటున్నారు.

కాగా డిక్లరేషన్ అంశంపై ఇటీవల జగన్‌పై, పవన్ విమర్శనాస్త్రాలు సంధించారు. దానితో రంగంలోకి దిగిన వైసీపీ సోషల్‌మీడియా.. పవన్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ ప్రారంభించింది. క్రైస్తవులతో పవన్ గతంలో నిర్వహించిన సమావేశాలకు సంబంధించిన వీడియోలు విడుదల చేసింది. అయితే.. తాజాగా తన తిరుమల పర్యటనలో, తన బిడ్డతో డిక్లరేషన్‌పై సంతకం చేయించడం ద్వారా, వైసీపీ సోషల్‌మీడియా నోళ్లు మూయించగలిగారు.

ఏదేమైనా క్రైస్తవురాలయిన పవన్ బిడ్డ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం.. సీఎంగా పనిచేసిన జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోగా, అది అడిగిన వారిపై ఇదేం దేశం అంటూ ఎదురుదాడి చేయడం మరోసారి చర్చనీయాంశమయింది.

LEAVE A RESPONSE