-
తన మాట వినని బాబాయ్ సుబ్బారెడ్డికి జగన్ షాక్
-
పరుచూరు ఇన్చార్జిగా ఎట్టకేలకు గాదె మధుసూదన్‌రెడ్డి నియామకం
-
తొలుత గాదె మధుసూదన్‌రెడ్డికి ఇన్చార్జి ఇవ్వాలని జగన్ ఆదేశం
-
దానితో జగన్‌ను మభ్యపెట్టి బాలాజీని ఇన్చార్జిగా చక్రం తిప్పిన వైవి సుబ్బారెడ్డి
-
అమెరికా నుంచి బాలాజీని హుటాహుటిన పిలిపించిన సుబ్బారెడ్డి
-
బాబాయ్ మాటలు నమ్మి మండల కమిటీలు వేయమని బాలాజీని ఆదేశించిన జగన్
-
జగన్ ఆదేశాలు బేఖాతరు చేసి అమెరికాకు చెక్కేసిన బాలాజీ
-
దానితో జగన్‌కు సొంత పార్టీలో పట్టులేదన్న ప్రచారం
-
కోటరీ చేతిలో జగన్ బందీ అంటూ విమర్శలు
-
దిద్దుబాటుకు దిగి గాదెకు ఇన్చార్జి ఇస్తున్నట్లు ప్రకటన
-
సంచలనం సృష్టించిన ‘సూర్య’ కథనం
-
‘జగన్‌కు సుబ్బారెడ్డి ఝలక్’ పేరుతో ‘సూర్య’లో వార్తా కథనం
-
దానితో హడావిడిగా గాదెకు ఇన్చార్జి ఇస్తున్నట్లు ప్రకటన
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘వైసీపీలో తనకూ పట్టు ఉందని’.. ఆ పార్టీ అధినేత జగన్ ఎట్టకేలకూ నిరూపించుకున్నారు. తాను కోటరీ చేతిలో బందీ కాదని, కోటరీ పంజరంలో చిలకను కాదని చాటుకునేందుకు, ఉమ్మడి ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం పార్టీ ఇన్చార్జిని, ‘తాను చెప్పిన నాయకుడికే’ ఇచ్చి.. ‘పార్టీలో తాను చెప్పింది కూడా జరుగుతుంద’న్న సంకేతాలు పంపించిన వైనం ఇది.
జగన్‌కు సొంత పార్టీపై పట్టులేదంటూ.. పరుచూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి నియామక వ్యవహారంలో ఎదురైన భంగపాటును, ‘సూర్య’ సవివరంగా వెల్లడించిన వైనం, ఆ పార్టీని ఉలిక్కిపడేలా చేసింది. ఆ పార్టీ జిల్లా నేత గాదె మధుసూదన్ రెడ్డి విషయంలో ‘రెండోసారి అమలుకాని’ జగన్ ఆదేశంపై, ‘సూర్య’ రాసిన కథనంతో జగన్ దిద్దుబాటుకు దిగారు.
చివరాఖరకు అదే గాదె మధుసూదన్‌రెడ్డిని నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించి, మూడురోజుల క్రిత ం తనకు ఝలక్ ఇచ్చిన బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి, ఇప్పుడు అబ్బాయ్ ఝలక్ ఇవ్వడం ప్రకాశం జిల్లా పార్టీ వర్గాలను నివ్వెరపరిచింది. ఫలితంగా ఇప్పుడు బాబాయ్ సుబ్బారెడ్డికి అబ్బాయ్ దగ్గర పలుకుబడి లేదని తేలిపోయింది. అంటే తనకు బాబాయ్ ఝలక్ ఇస్తే.. ఇప్పుడు అబ్బాయ్ బాబాయ్‌కి ఝలక్ ఇచ్చారన్నమాట.
తన సొంత జిల్లాలో పట్టుసాధించిన వైసీపీ ఎంపి వైవి సుబ్బారెడ్డి.. చివరకు అబ్బాయ్ జగన్‌కే ఝలక్ ఇచ్చి, తన మాట చెల్లుబాటయ్యేలా చూసుకున్నారు. దానికి కోటరీ సహకారం కూడా లేకపోలేదు. పరుచూరు నియోజకవర్గ ఇన్చార్జిగా, గతంలో శాసనసభకు పోటీ చేసి ఓడిపోయిన ఎడం బాలాజీని నియమించడంలో సుబ్బారెడ్డి-కోటరీ చక్రం తిప్పారు. నిజానికి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తనయుడు గాదె మధుసూదన్‌రెడ్డికి, నియోజకవర్గ ఇన్చార్జి ఇవ్వాలని స్వయంగా జగన్ ఆదేశించారు. ఎందుకంటే గాదె వెంకటరెడ్డి ఆ నియోజకవర్గానికి సుదీర్ఘకాలం మంత్రి, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ కోణంలోనే జగనఇ ఆయన తనయుడికి ఇన్చార్జిగా ఎంపిక చేసినట్లు కనిపించింది.
దానితో అమెరికాలో ఉన్న బాలాజీని ఆగమేఘాలపై రప్పించి, కోటరీ సహకారంతో ఆయనకు నియోజకవర్గ ఇన్చార్జి ఇప్పించి, సుబ్బారెడ్డి ఆ నియోజకవర్గంపై తన పట్టు కొనసాగించారు. జిల్లాలో మరొక రెడ్డినేత తనకు పోటీ లేకుండా చూడటంలో, సుబ్బారెడ్డి అప్పటివరకూ సక్సెస్ అయ్యారు. నియోకవర్గంలో మండల కమిటీలు త్వరగా నియమించాలని, జగన్ ఇచ్చిన ఆదేశాలకు తలూపిన బాలాజీ.. తర్వాత అమెరికాకు చెక్కేయడంతో సుబ్బారెడ్డి ఇరుకునపడ్డారు. తన బదులు తన తమ్ముడు నియోజకవర్గ వ్యవహారాలు చూసుకుంటాడని చల్లగా చెప్పారట.
దీనితో పార్టీలో జగన్‌కు ఏ మాత్రం పట్టులేదని, కోటరీతోపాటు సుబ్బారెడ్డిదే హవా అన్న ప్రచారం మొదలయింది. దానికి తగినట్లుగానే గతంలో గాదె మధుసూదన్‌రెడ్డికి, జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలన్న జగన్ ఆదేశాలకు భిన్నంగా.. కోటరీ చక్రం తిప్పి, మాజీ మంత్రి నాగార్జునకు ఆ పదవి ఇచ్చింది. నిజానికి అప్పుడే జగన్‌కు పార్టీలో పట్టులేదని.. ఆయనను చూపించి కోటరీనే పెత్తనం చేస్తోందని.. జగన్ చెప్పిన వారికే దిక్కులేదన్న వ్యాఖ్యలు వినిపించాయి. మళ్లీ రెండోసారి అదే గాదె నియమాకంలో కూడా జగన్‌కు ఝలక్ ఇవ్వడంతో, జగన్‌కు ఏపార్టీలో పట్టులేదన్నది నిజమని తేలిపోయినట్లయింది.
వైసీపీలో జరుగుతున్న ఈ పరిణామాలపై ‘సూర్య’లో వెలువడిన కథనం, ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. తనకు పార్టీపై పట్టులేదన్న వాస్తవం జనంలోకి, ప్రధానంగా కిందిస్థాయి కార్యకర్తలకు వెళితే ప్రమాదమని గ్రహించిన జగన్ దిద్దుబాటకు దిగారు. ఆ మేరకు పరుచూరు నియోజవర్గ ఇన్చార్జిగా గాదె మధుసూదన్‌రెడ్డిని నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. సో.. కోటరీకే కాదు.. ‘జగన్‌కు కూడా’ పార్టీపై పట్టుందన్నమాట!