Suryaa.co.in

Andhra Pradesh

జగన్ జనం తింగరోళ్లేమి కాదు.. రిషికొండ గుట్టు నేను ఎప్పుడో విప్పా

-ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నాన్ని ఇకనైనా జగన్మోహన్ రెడ్డి మానుకోవాలి
-ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు

జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ప్రజలను మభ్య పెట్టాలనే ప్రయత్నాలను మానుకోవాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. గత రెండు రోజులుగా విశాఖపట్నంలో ప్రజాధనంతో జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ప్యాలెస్ గురించే చర్చ జరుగుతోందన్నారు. ఒక గొప్ప కట్టడం కోసమే కట్టాము తప్ప… వ్యక్తిగత అవసరాల కోసం కాదని వైకాపా నాయకత్వం వివరణ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఎవరో ఒక అధికారి చెబితే, అతడేదో మంచి సలహా ఇచ్చాడని రిషి కొండకు గుండు కొట్టి నిర్మించిన ప్యాలెస్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి, తనకేదో ఎక్కడా ఇల్లు లేదన్నట్టుగా ఇక్కడే ఉండాలని భావించినట్లు గా జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం ఆయన భావ దారిద్ర్యానికి నిదర్శనమని రఘురామకృష్ణంరాజు విమర్శించారు.

మంగళవారం నాడు వివిధ అంశాలపై రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విశాఖపట్నంలో ఐకానిక్ కట్టడాన్ని కట్టాలనుకున్నాం. విశాఖను రాజధానిగా అనుకున్నప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి కి ఓ చిన్న ఇల్లు, కార్యాలయం ఉంటే బాగుంటుందని అధికారులు సూచనలు మేరకు , రిషికొండ ప్యాలెస్ లో స్వల్ప మార్పులు చేశామనడం విడ్డూరంగా ఉందన్నారు.

ఏదో సింపుల్ గా కేవలం 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి రిషి కొండపై ప్యాలెస్ నిర్మిస్తే తప్పేముందన్నట్లుగా వైకాపా నేతలు మాట్లాడడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం అని మండిపడ్డారు . జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో తిన్న వేల, లక్షల కోట్ల రూపాయలతో పోలిస్తే, రిషికొండపై ప్యాలెస్ నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు వెచ్చించడం పెద్ద సొమ్మేమీ కాదని ఆయన భావించి ఉంటారు.

జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఇంకా అజ్ఞానులుగా, వారికి ఇంగిత జ్ఞానం లేదన్నట్లుగా భావించడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఐదు నుంచి ఏడు నెలల క్రితమే రిషి కొండపై నిర్మించిన భవనాన్ని అధికారులు గుర్తించి చెబితే, ఆయన ఓకే చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం మరింత విడ్డూరంగా ఉందన్నారు. మూడు సంవత్సరాల క్రితమే కొండకు గుండు కొట్టి నిర్మాణాలను ప్రారంభించారని, రెండేళ్ల క్రితమే జగన్మోహన్ రెడ్డి నివాసం కోసమే ఒక బ్లాకును నిర్మిస్తున్నారని నేను చెప్పానని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు.

జగన్మోహన్ రెడ్డి నివాసం కోసం ఒక బ్లాక్ తో పాటు, ఆయన 15 మంది కార్యదర్శులు ఉండడానికి వీలుగా మరొక బ్లాక్ నిర్మించారన్నారు. ఏ బ్లాక్ దేనికోసం కట్టారో నేను గతంలోనే స్పష్టంగా రికార్డెడ్ గా వివరించాను. విజయనగరం, గజపతినగరం, కళింగ బ్లాక్ అంటూ పనికిమాలిన కబుర్లు చెబుతున్నారని విమర్శించారు.

రిషికొండపై పెద్ద ఇల్లు , అదే స్థాయిలో ఆఫీసుకు అవసరమైన భవనాన్ని నిర్మించారని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, తాడేపల్లి ప్యాలెస్ లో మాదిరిగానే ఇంట్లోనే ఆఫీస్ పెట్టుకొని సెక్రటేరియట్ కు వెళ్లకుండా కాలక్షేపం చేస్తున్నట్లుగానే, విశాఖపట్నంలోనూ అదే విధంగా చేయాలనుకున్నారని తెలిపారు. నాకు ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే ప్రజలకు చెప్పానని గుర్తు చేశారు.

ఇదంతా ప్రజలకు తెలియదని అనుకుని, ప్రవీణ్ ప్రకాష్ అనే అధికారి సూచించగానే అప్పటికప్పుడు మార్పులు చేశామని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 26 లక్షల రూపాయలతో కమోడ్, 50 లక్షల రూపాయల వ్యయంతో టబ్, విశాలమైన బాత్రూం… ఆ బాత్రూం ఎంతంటే పేదల పక్షాన పెత్తందారులతో రోజు పోరాడే జగన్మోహన్ రెడ్డికి రెండు పేద కుటుంబాలు నివసించే వైశాల్యమంతా అని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

12 మంది పేదవారి ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును పెట్టి జగన్మోహన్ రెడ్డి తన బాత్రూం నిర్మించుకున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డికి కావలసినంత డబ్బు ఉంది. బీచ్ సైట్ లో స్థలం కొనుక్కొని 500 కోట్లు వెచ్చించి ఆయన మరొక ప్యాలెస్ నిర్మించుకొని ఉంటే ప్రజలెవరూ బాధపడి ఉండేవారు కాదు. కానీ పాపం ఆయన ఏమనుకున్నారంటే మరో 20 ఏళ్ల పాటు తానే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటానని, ఆ మాత్రం ఖర్చు మనకెందుకు అనుకొని ప్రభుత్వ ఖర్చుతో రిషికొండపై ప్యాలెస్ నిర్మించారని తెలిపారు.

ప్రజలేమి తింగరోళ్లు కాదు… వారు విషయాన్ని గ్రహించారు. నేను ఈ విషయాన్ని కాస్త ముందే గ్రహించి చెప్పాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నేను ప్రతిరోజు మాట్లాడే క్రమంలో రిషికొండ పై నిర్మిస్తున్న అక్రమ ప్యాలెస్ గురించి అనేకసార్లు చర్చించడం జరిగిందన్నారు.

లక్షల సంఖ్యలో ఉండే ఈవీఎంలను మేనేజ్ చేయడం ఎవరివల్లా సాధ్యం కాదు
జగన్మోహన్ రెడ్డి ఇంకా తన ఓటమిని అంగీకరించలేక, ప్రజలు తనని దారుణంగా తిరస్కరించారన్న పచ్చి నిజాన్ని జీర్ణించుకోలేక మరొక భావ దారిద్ర్యానికి పాల్పడడం దురదృష్టకరమని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఓటమిని అంగీకరించడంలోనే గౌరవం ఉందని, ఓటమిని ఇప్పటికైనా హుందాగా అంగీకరించాలని సూచించారు. గతంలో తెలిసో తెలియకో తప్పులు చేశామని మన్నించాలని ప్రజలను కోరి ఉంటే, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం పెరిగి ఉండేది అన్నారు.

జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన వ్యక్తిత్వాన్ని ఆయనే ఆదపాతాళానికి దిగజార్చుకుంటున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అవస్థను చూస్తుంటే నవ్వాలో, ఏడువాలో
అర్థం కావడం లేదన్నారు. పడిపోయిన వ్యక్తిని మరింతగా పడదోసే దిశగా కావాలని మాట్లాడడం లేదన్నారు. ప్రజలు తెలివైన వారిని ఇప్పటికైనా అంగీకరించాలి.

ప్రజలను పనికిరాని మూర్ఖులుగా భావించడం సరికాదన్నారు. ఈవీఎంలను మేనేజ్ చేయవచ్చునని ఎలన్ మాస్క్ అన్నట్టుగానే గతంలో ఎంతోమంది పేర్కొన్నారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఎన్నికల ప్రక్రియ ఈవీఎంలను తొలగించాలని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పేర్కొన్నారన్న రఘురామకృష్ణం రాజు, అభివృద్ధి చెందిన దేశాలలో ఈవీఎం లను ఉపయోగించరని పేర్కొన్నారు.

అమెరికా వంటి దేశ జనాభా కేవలం పాతిక కోట్లు మాత్రమేనని, మన దేశ జనాభా 140 కోట్ల అని పేర్కొన్నారు. నేను పార్లమెంట్ కమిటీలో సభ్యుడుగా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిటీ కూడా తమ పరిధిలోనే ఉండేదని పేర్కొన్న ఆయన, ఈవీఎంలపై అన్ని విషయాలను కనుగొన్నామని తెలిపారు. ఒకటి రెండు ఈవీఎంలను అయితే ఎవరైనా మేనేజ్ చేస్తారేమో తెలియదు కానీ లక్షలాది ఈవీఎంలను మేనేజ్ చేయడం అన్నది ఎవరి వల్ల సాధ్యం కాదని చెప్పారు.

ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం వైకాపా
రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షంగా వైకాపా కొనసాగుతుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 11 మంది సభ్యులు ఉన్న వైకాపా నిర్మాణాత్మకంగా, హుందాగా అసెంబ్లీలో వ్యవహరించాలని సూచించారు. ప్రజలను డి గ్రేడ్ చేసే విధంగా మాట్లాడితే ప్రజలు సహించరని గుర్తు చేశారు. ఇప్పటికైనా వైకాపా నాయకత్వం తమ వ్యవహార శైలిని మార్చుకోవాలని సూచించారు.

ప్రభుత్వం మారినప్పటికీ హామీల భారమే అధికం
రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, హామీల భారం అధికంగా ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 50 ఏళ్లకే పింఛన్లు, సూపర్ సిక్స్ వంటి హామీల అమలుకే అధిక భారం ప్రభుత్వం పై పడనుందని చెప్పారు. ప్రభుత్వంపై ఎక్కువ భారం పడకుండా, ఉండి నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీతో ప్రత్యేకంగా చర్చించినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం, డ్రైనేజీ, ఇరిగేషన్ కాలువల పూడికతీత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లుగా రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో డ్రైనేజీ కాలువల పూడికతీత కోసం ఒక్క పార కూడా పెట్టలేదన్నారు. అక్కడక్కడ గ్రామస్తులే సొంతంగా డ్రైనేజీ కాలువలలో పూడికతీత పనులను చేయించుకున్నారని తెలిపారు.

పూడికతీత పనుల కోసం టెండర్లను ఆహ్వానిస్తే, ఎవరైనా కాంట్రాక్టర్లు ముందుకు వస్తే వారిపై జిఎస్టి భారంతో పాటు కమీషన్ల భారం కూడా పడేది అన్నారు. రూపాయ పని కోసం ప్రభుత్వం రెండున్నర రూపాయలు ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొనేదని చెప్పారు. వీటన్నింటినీ అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు, ప్రజల్లో తలెత్తుకొని తిరగాలన్న దృక్పథంతో ఉండి ఇరిగేషన్ డెవలప్మెంట్ ఫండ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

ఉండి ఇరిగేషన్ డెవలప్మెంట్ ఫండ్ కోసం ఒక ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచి నేను నా స్నేహితులు కలిసి 50 లక్షల రూపాయలను జమ చేసినట్లుగా రఘురామకృష్ణంరాజు వివరించారు. ప్రస్తుతం అగ్రికల్చర్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, రైతులకు డబ్బులు రావాల్సి ఉందని పేర్కొన్న ఆయన, ఆక్వా రైతులు ముందుకు వచ్చి ఎకరాకు 1000 రూపాయల చొప్పున ఉండి ఇరిగేషన్ డెవలప్మెంట్ ఫండ్ కోసం విరాళంగా అందజేయాలని కోరారు.

ఆక్వా రైతులందరూ ముందుకు వస్తే, అన్ని కెనాల్స్ లలో పెరిగిన గుర్రపు డెక్కతో పాటు, పూడికతీత పనులను చేపట్టడం పెద్ద కష్టమేమీ కాదన్నారు . ఎక్కడా నీళ్ల ప్రవాహానికి అడ్డంకి లేకుండా చివరి గ్రామం వరకు మంచినీరు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు. ఆక్వా రైతులు తమ చెరువులను నింపుకోవచ్చునని సూచించారు. గంటల ప్రాతిపదికనే ఒక ప్రోక్లైనర్ అద్దెకు తీసుకొని, అధికారుల, గ్రామస్తుల పర్యవేక్షణలోనే కాలువలలో పూడిక తీత పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

ప్రతి గ్రామంలో కాలువల పూడికతీత పనుల కోసం ఎవరైతే దాత ముందుకు వస్తారో వారి పర్యవేక్షణలో, గ్రామస్తులు అందరి సమక్షంలోనే ఈ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు.. గ్రామస్తులు సూచించిన చోటనే పనులను చేపట్టి, ఒక గ్రామంలో పూర్తయిన తర్వాత మరొక గ్రామంలో ఇలా కాలువల పూడికతీత పనులను చేయడం జరుగుతుందని వెల్లడించారు. ప్రస్తుత సీజన్లో 40 రోజుల పాటు, రానున్న సీజన్లో కూడా ఇదేవిధంగా చేసుకోగలిగితే, కాలువల పూడిక తీత పనులకు మళ్లీ అవసరమే ఏర్పడదని చెప్పారు. ఒక్కసారి నీటి పారుదల వ్యవస్థ గాడిలో పడితే, మిగిలిన అభివృద్ధి పనులపై దృష్టి సారించవచ్చునని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

గ్రామాల స్వయం అభివృద్ధి, రోడ్ల నిర్మాణానికి మన్ రేగా నిధుల వినియోగం
గ్రామాల స్వయం అభివృద్ధి కోసం కృషి చేయడమే కాకుండా, రోడ్ల అభివృద్ధి కోసం మన్ రేగా నిధులను ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గ నిర్దేశాల స్ఫూర్తితో పని చేస్తామని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. మన్ రేగా నిధుల వినియోగంపై చంద్రబాబు నాయుడు దాదాపు పీహెచ్డీ చేసినంత పని చేశారని, ఆయన మార్గ దర్శకాల స్ఫూర్తితో పని చేస్తే మన్ రేగా నిధులను సద్వినియోగం చేసుకోవచ్చునని తెలిపారు .

రాష్ట్రం ఆర్థికంగా ప్రగతి పథంలో పయనించే వరకు, గ్రామాలలో గతుకులు లేని రోడ్లు ఉండాలంటే ఒక ప్రణాళిక ప్రకారం మన్ రేగా నిధులతో రోడ్లను అభివృద్ధి చేసుకోవాలన్నారు. తాగునీటి సరఫరా కోసం గతంలో చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ, గత వైకాపా ప్రభుత్వ హయాంలో దాన్ని ధ్వంసం చేశారన్నారు. ఆ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించగలిగితే తాగునీటి సరఫరా సమస్య సగం వరకు పరిష్కారం అవుతుందన్నారు.

గ్రామాలలో నీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నప్పటికీ, అవి చాలా వరకు చెడిపోయి ఉన్నాయని, వాటిని బాగు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. పరిమళ అనే ప్రాంతం నుంచి తాగునీటి వ్యవస్థను సక్రమంగా డిజైన్ చేయకుండా, తప్పుడు విధానంతో డిజైన్ చేశారన్నారు. దాన్ని కూడా గ్రామస్తులు, ప్రభుత్వ సహకారంతో యుద్ధ ప్రాతిపదికన సరి చేసుకుని ఉండి నియోజకవర్గ పరిధిలోని అరవై శాతం గ్రామాలకు తాగునీటి వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని చేయనున్నట్లు తెలిపారు.

ఇరిగేషన్, తాగునీటి వ్యవస్థ పై ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో కలిసి చక్కటి రూట్ మ్యాప్ రూపొందించినట్లు, ప్రభుత్వం సహకారం, ముఖ్యమంత్రి ఆశీస్సులతో త్వరలోనే అమలు చేయనున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. నాకు మంత్రి పదవి రాలేదు కాబట్టి, ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి నా నియోజకవర్గానికి ఇది చేయమని కోరితే, ఆయన తప్పకుండా చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఎన్నికల ముందు నేను ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని నేను కూడా నన్ను ఎన్నుకున్న ప్రజలకు చెప్పవచ్చు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిత్వం చాలా పూర్. వ్యక్తులు మాత్రం రిచ్. ప్రపంచంలో ఎక్కడా లేని బంగారం మనదేశంలోనే ఉంది.

అమెరికాలో కంటే పది రెట్లు బంగారం ఎక్కువగా భారతదేశంలోనే ఉంటుంది. వ్యక్తులకు ఎవరికైనా సముచిత గౌరవం ఇస్తే వారే ముందుకు వచ్చి సమాజ హితం కోసం పనిచేస్తారు. ప్రతి దానికి జగనన్న, వైయస్సార్ పేర్లు పెడితే ఎవరైనా తమకు తోచిన సహాయం చేయడానికి కూడా ముందుకు రారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

గ్రామాలలో దాతలు ముందుకు వచ్చిమంచి కార్యక్రమాన్ని చేస్తే, ఆ దాతలను గౌరవించుకునే విధంగా వారి సౌజన్యంతో అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా బోర్డును ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. స్థానికంగా ఒక పాఠశాలకు వెళ్తే మైదానంలో చెత్తాచెదారం నిండిపోయి ఉందన్నారు. ఎంపీగా ఎన్నికైన తొలి ఆరు నెలల వ్యవధిలోనే నేను అదే ప్రాంతంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని భావించాను.

నేను ఇచ్చిన పిలుపుకు స్పందించి ఒక వ్యక్తి ముందుకు వచ్చి పాఠశాల ఆవరణాన్ని మొత్తం వారం రోజుల వ్యవధిలో పరిశుభ్రం చేసి కడియం నుంచి మొక్కలు తెప్పించి ఉద్యానవనంగా తీర్చిదిద్దుతానని చెప్పారన్నారు. అలాగే పాఠశాల మైదానం పెద్దదిగా ఉండడంతో వాలీబాల్, కబడ్డీ కోర్టులను కూడా ఏర్పాటు చేయాలని సూచించగా, పలువురు ముందుకు వచ్చి తమ వంతుగా ఆ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారన్నారు.

ప్రభుత్వానికి దమ్మిడీ ఖర్చు లేకుండా ఉద్యానవనం, క్రీడా ప్రాంగణాలను నిర్మించుకోవచ్చునని తెలిపారు. ఎవరైతే ఉద్యానవనం, క్రీడా ప్రాంగణ నిర్మాణానికి సహకరించారు వారిని గౌరవిస్తూ వారి పేర్లను తెలియజేసే విధంగా బోర్డులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీనితో, ఉద్యానవనం, క్రీడా ప్రాంగణాలను నిర్మించిన వారికి ఆత్మసంతృప్తి తో పాటు సమాజంలో గౌరవం లభిస్తుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

ప్రభుత్వంపై ఎక్కువగా ఆశలు పెట్టుకోకుండా మన గ్రామంలో ఉండే ప్రజల్లోని ధనవంతులను వారి వ్యక్తిత్వానికి గౌరవం, విలువ ఇస్తూ ముందుకు వెళితే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టవచ్చునని తెలిపారు. ఇటీవల నన్ను ఒక డయాలసిస్ పేషెంట్ కలిశారు. డయాలసిస్ చేయించుకోవడానికి భీమవరంలో సరైన సౌకర్యాలు లేవని ఏలూరు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఉద్దానంలో అది చేశాము ఇది చేశామని చెప్పారని, రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్ పేషెంట్లకు కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఇటీవల ఆకివీడులో ఒక కొత్త భవనాన్ని ప్రారంభించామని, అందులో ఖాళీగా ఉన్న రూములలో డయాలసిస్ ఎక్విప్మెంట్లను నేను నా మిత్రులు సత్యనారాయణ రాజు సహకారంతో ఏర్పాటు చేస్తానని, వైద్యులను ఇవ్వాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ను కోరగానే ఆయన వెంటనే సానుకూలంగా స్పందించారన్నారు.

స్థానికంగా ఉండే వ్యక్తులే కాకుండా విదేశాలలో స్థిరపడిన వారి నుంచి కూడా ప్రభుత్వ సహకారంతో నిధులను సమీకరించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు . ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ తో ముందుకు వెళుతూ ప్రభుత్వ పరిపాలన యంత్రాంగ సహకారంతో, సమాజంలో ధనవంతులైన వారిని మోటివేట్ చేసి వారి సహకారంతో పారిశ్రామికవేత్తలు, ఆక్వా రైతుల అండదండలతో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు.

అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. టోఫెల్ బ్రిడ్జి నిర్మాణం జరగాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ప్రభుత్వం టెండర్లను పిలిచిన తర్వాత కాంట్రాక్టర్ కు ఒకవేళ ప్రభుత్వం మొబలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వలేకపోతే, బిల్లులు వచ్చిన తర్వాత తీసుకునే విధంగా ఎవరైనా ముందుకు వచ్చి సహకరించాలన్నారు.

ఉండి నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో తీసుకు వెళ్లడానికి స్నేహితులు, శ్రేయోభిలాషులతోపాటు ప్రజలందరి సహకారం కోరుతున్నట్లుగా రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఉండి లో రెండు అండర్ పాస్ బ్రిడ్జిలు రావలసిన అవసరం ఉందని, త్వరలోనే రైల్వే శాఖ మంత్రి ని కలిసి ఈ బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులతో పాటు నిధులను తీసుకువస్తానని చెప్పారు.

ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన పనులను ఆరు నెలల వ్యవధిలో ప్రారంభించి వారు తిరిగి అడిగే పరిస్థితి తీసుకొచ్చుకోనని తెలిపారు . ఉండి నియోజకవర్గ అభివృద్ధిలో మీడియా ప్రతినిధులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని, ఉండి ఇరిగేషన్ డెవలప్మెంట్ ఫండ్ అకౌంటు డీటెయిల్స్ ను విస్తృతంగా తమ మీడియాలో ప్రచారం చేయాలని కోరారు.

LEAVE A RESPONSE