– ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించకుండా విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్న జగన్
– పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు
పేదవారి చదువుకు అయ్యే ఖర్చునంతా భరిస్తామని జగన్ 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీనిచ్చి మాట తప్పారు మడమ తిప్పారు. గత 4 ఏళ్లల్లో 4 విడతల ఫీజ్ రీయంబర్స్ మెంట్ చెల్లించకపోవడం విద్యార్ధులు, తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. బీటెక్ 4వ ఏడాది విద్యార్ధులకు 8వ సెమిస్టర్ ఏప్రిల్ 24తో ముగుస్తోంది.
ప్రభుత్వం వీరికి ఒక్క విడత ఫీజు చెల్లించలేదు. చదువును పూర్తి చేసుకున్న యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వకపోవడంతో విద్యార్ధులు ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. ఫీజులు చెల్లించమని విద్యార్ధులకు నోటీసులు పంపుతున్నారు. అంతేకాకుండా పరీక్షలు రాసేందుకు హాల్ టిక్కెట్లు ఇవ్వని పరిస్థితి. అమ్మా పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్న విధంగా 2.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మీరు భర్తీ చేయకుండా, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోనివ్వకుండా విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్నారు.
చంద్రన్న ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ అందిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 11 లక్షల మందికి అదీ విడతల వారీగా అందిస్తుంది. అంటే దాదాపు 5 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్ధులకు విద్యను దూరం చేశారు. ఇది దగా దీవెన కాకుండా విద్యా దీవెన ఎలా అవుతుంది. 2023-24కి సంబంధించి ఇంత వరకు మొదటి త్రైమాసికం ఫీజులను జగన్ చెల్లించలేదు.
ఫిబ్రవరి 28న చెల్లిస్తామని ప్రకటించి మరో మార్చి 7కి వాయిదా వేసింది. ఇప్పుడు మళ్లీ ఎప్పటికి వాయిదా వేస్తుందో తెలియని పరిస్థితి. పీజీ విద్యార్థులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ ను రద్దు చేశారు. విడతల వారీగా అమలు చేసే విద్యా దీవెనకు 4 విడతలకు రూ.20 కోట్లు చొప్పున 4 ఏళ్లల్లో దాదాపు రూ.80 కోట్లు జగన్ అవినీతి పత్రికకు ప్రజాధనం దోచిపెట్టారు.