– ప్రెస్‌మీట్‌లో జాగ్రత్త పడ్డ జగన్
– ఇటీవలి వాచ్‌లో టైమ్‌కు, వీడియో విడుదల సమయానికి తేడా
– దానితో జగన్ రికార్డింగ్ ప్రెస్‌మీట్ అంటూ షషోల్‌మీడియాలో ర్యాగింగ్
– ఇప్పుడు వాచీని కిందికి తిప్పేసిన వైనం
(మార్తి సుబ్రహ్మణ్యం)
మాట తప్పడం.. మడమ తిప్పడం తెలియదని చెప్పుకునే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. వాచ్ మాత్రం తిప్పేశారు. జగన్ వాచ్‌కు, ప్రెస్‌మీట్లకు సంబంధం ఏమిటంటే.. ఆయన ప్రెస్‌మీట్ అంటూ వీడియో విడుదల చేసే సమయం.. జగన్ చేతికి ఉన్న వాచ్ చూపించే సమయానికి సంబంధం ఉండదు. అంటే ఆయన ప్రసంగాన్ని ముందుగా రికార్డు చేసి, ఎడిట్ చేసిన తర్వాత దానిని మీడియాకు విడుదల చేస్తున్నారన్న నిజం చాలాసార్లు బయటపడింది.
జగన్ చేతికి ఉన్న వాచ్, ఆయన ప్రెస్‌మీట్ సమయాన్ని రౌండ్ చేసి చూపించి మరీ, సోషల్‌మీడియా సైనికులు ట్రోల్ చేస్తుంటారు. అయినా జాగ్రత్తలు తీసుకోవాలన్న స్పృహ ఆయన మీడియా దళానికి లేకపోవడమే ఆశ్చర్యం.
తాజాగా చంద్రబాబునాయుడు సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జగన్ మీడియా ద్వారా స్పందించారు. ఎందుకంటే ఆయన సభకు వెళ్లరు కాబట్టి. తనకు ప్రతిపక్షనేత హోదా ఇస్తేనే సభకు వస్తానని మారాం చేయడంతోపాటు, కోర్టులోనూ అదే వాదిస్తున్నారు. తనకు 40 శాతం ఓటు శాతం వచ్చింది కాబట్టి.. తన పార్టీకి వచ్చిన 11 సీట్లు కాకుండా, తనకు వచ్చిన 40 శాతం ఓటు శాతాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నది ఆయన వాదన.
అందుకే అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన జగన్.. బయట మీడియా వద్ద అసెంబ్లీకి సంబంధించిన అంశాలపైనే స్పందిస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే ప్రెస్‌మీట్ పెట్టిన జగన్.. ఈసారి తన చేతి వాచీ బయటకు కనిపించకుండా, కిందకు దించడం కనిపించింది. సో.. జగన్ ఆ రకంగా ముందుకు వెళ్లారన్నమాట!