– ఉప ముఖ్యమంత్రి , మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. బి. అంజాద్ బాషా
ఆంధ్రప్రదేశ్ నుండి పవిత్ర హజ్ యాత్ర చేయు ప్రత్యేకించి గన్నవరం, విజయవాడ
ఎంబార్కెషన్ పాయింట్ నుండి బయలుదేరు 1813 మంది యాత్రికులకు, విమాన టికెట్టు పై, ప్రతి యాత్రికునిపై రూ.80,000/- అదనపు భారం పడుతుందని ఆందోళన చెందుచుండగా, రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు మైనారిటీ వ్యవహారాల శాఖా మాత్యులతో సంప్రదింపులు జరిపి, హైదరాబాద్ మరియు బెంగళూరు ఎంబార్కెషన్ పాయింట్ ల టికెట్ ధరలతో సమానంగా విజయవాడ ఎంబార్కెషన్ పాయింట్ కు టికెట్ ధర నిర్ణయించాలని కోరడమైనది.
అయితే, సాంకేతిక కారణాల వలన ఆయా మంత్రిత్వ శాఖలు తమ నిస్సహాయతను ప్రకటించిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందిస్తూ, ఆ అదనపు భారం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఎట్టి పరిస్థితులలో కూడా యాత్రికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇవ్వడం జరిగింది.
తానిచ్చిన మాటకు కట్టుబడి, ప్రభుత్వ ఉత్తర్వులు జి. ఓ. ఆర్. టి. నెం.114, మైనార్టీస్ వెల్ఫేర్ (ఓ. పి. &బడ్జెట్) డిపార్ట్మెంట్, తేది:15.05.2023న రూ.14.51 కోట్లు ఆర్థిక సహాయం విడుదల చేసి, మరొక్క సారి తాను ముస్లిం మైనార్టీల పక్షపాతి అని నిరూపించుకున్నారు. ఈ మొత్తాన్ని, గన్నవరం విజయవాడ ఎంబార్కెషన్ పాయింట్ నుండి హజ్ యాత్రకు బయలుదేరు 1813 మంది యాత్రికులకు సంబంధించి, సెంట్రల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియాకు వారు చెల్లించాల్సిన మిగతా మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా సెంట్రల్ హజ్ కమిటీకి ఈ రోజే చెల్లించడం జరుగుతుంది.
దేశంలో ఎంబార్కెషన్ పాయింట్ ల వారీగా, పది రాష్ట్రాలలో టికెట్ ధరల విషయంలో ఆయా రాష్ట్రాల హజ్ యాత్రికులపై ఆర్థిక భారం పడుతున్నది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు నిర్ణయించిన ధరల మేరకు, యాత్రికులపై పడిన అదనపు ఆర్థిక భారాన్ని, దేశంలో, కేవలం, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే భరిస్తున్నదన్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరుచున్నాను.