-సెంట్రల్ నియోజకవర్గంలో 25,416 మందికి రూ. 6 కోట్ల 35 లక్షల 40 వేల మేర లబ్ధి
-సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
అవ్వాతాతలు, వితంతువులకు ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అధికమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ నూతన సంవత్సర కానుకగా వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుకను రూ. 2,250 నుంచి రూ. 2,500 కు పెంచి అందించబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం అందిస్తున్న 24,444 పెన్షన్లతో పాటుగా కొత్తగా మంజూరైన 972 పెన్షన్లను కలుపుకుని మొత్తం 25,416 మందికి జనవరి 1 నుంచి 5 వ తేదీ మధ్యలో 2,500 రూపాయలు అందజేయబోతున్నట్లు వివరించారు. దీని ద్వారా పింఛన్ దారులకు ప్రతినెలా రూ. 6 కోట్ల 35 లక్షల 40 వేలు లబ్ధి చేకూరనుందని తెలిపారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు.