– జగన్ .. నెల్లూరు.. మధ్యలో.. బంగారుపాళెం కామెడీ స్కిట్!
– నెల్లూరు పర్యటనలో చిత్తూరు జిల్లా వీడియో క్లిప్పింగులతో సాక్షి హాస్యగుళిక
– నెల్లూరులో కూడా బంగారుపాళ్యం ఉందట అంటూ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు
దానిదుంపతెగ.. కామెడీకీ ఒక హద్దు ఉంటుంది. కానీ జగనన్న నెల్లూరు జిల్లా పర్యటనలో ఆ కామెడీకే నవ్వొచ్చేంత కామెడీ చూసి.. జనం కడుపు పట్టుకుని, కిందపడి మరీ గిలగిల కొట్టుకునే పరిస్థితి. ఈ కామెడీ సృష్టికర్త నవ్వుల రాజు ఏ రాజేంద్రప్రసాదో, ఏ బ్రహ్మానందమో, చివరకు చార్జీచాప్లినో అనుకుంటే మళ్లీ కామెడీలో కాలేసినట్లేనండోయ్! ఇది వైసీపీ గెజిట్ సాక్షి చానెల్ సృష్టించిన నెల్లూరు కామెడీ.
మామూలుగా నెల్లూరోళ్ల మాటలు- యాసనే యమా కామెడీగా ఉంటుంది. కానీ మన జగన్ సాక్షిది.. ‘అంతకుమించిన’ కామెడీ! జగనన్న తాజా నెల్లూరు పర్యటనలో జనం పోటెత్తారని.. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని.. భూమి బద్దలయిందని.. ఆకాశానికి చిల్లుపడిందనేంత రేంజ్లో ‘సాచ్చీ’కం బాబాయిలు ఓ వీడియో వదిలారు.. కామెడీగా!
అంతవరకూ ఓకే. కానీ ఆ వీడియోలో మొన్నామధ్య జగనన్న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు వెళ్లినప్పటి జనాలను కూడా కలిపేసి.. వాళ్లను కూడా ‘నెల్లూరు పెజానీకం ఖాతాలో’ కలిపేయడం కామెడీన్నర కామెడీ కదూ?! మరి జగన్ ‘సాచ్చీ’కం ఆడిన ఈ కామెడీ అబద్ధాలపై, నెటిజన్లు గమ్మునుంటారేటి? బట్టలూడదీయరూ?!
ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. నెల్లూరు కూడా బంగారుపాళ్యం ఉందేటి జగనా.. మీ ‘సాచ్చీ’కం తెలివి తెల్లారినట్లే ఉంది.. వాళ్లనలా వదిలేయకండి. ఎవరన్నా చూపించండ్రా.. అబద్ధాలాడినా అతికినట్లుండాలప్పా అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు.. కామెడీగా! మొత్తానికి.. సిగ్గుకే సిగ్గేసినట్లు.. జగనన్న ‘సాచ్చీ’కం వీడియో క్లిప్పింగు చూసి, కామెడీకే కామెడీ వేసిందన్నమాట!
సాక్షి లైవ్లో ఏదో చూశారు… అంతే! “నెల్లూరులో బంగారుపాళ్యం మార్కెట్ ఎక్కడ ఉందిరా నాయనా?” అని గూగుల్ని పీడించి, తమ జుట్టుని పీక్కుంటున్నారు ప్రేక్షకులు. ఆ మార్కెట్ అసలు నెల్లూరులో ఉందా? అక్కడ జనం ఉన్నారా? అని గ్రహాంతరవాసులు ఉన్నారా.. అన్నదానికంటే పెద్ద మిస్టరీ లెక్కన నవ్వుకొంటున్నారు.
మధ్యలో హెలిప్యాడ్ దగ్గర పోలీసులు పహారా! వాళ్ళు జనాన్ని అదుపు చేయడానికా? కాదు! జగన్ రెడ్డి గారి హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నప్పుడు, “ఎక్కడ విండ్షీల్డ్ పగలగొట్టేస్తారో.. లేక వాళ్లలో వాళ్లు తోసుకొని ల్యాండ్ అయ్యే హెలికాప్టర్ చక్రాల కింద పడి తలకాయలు పెట్టుకుంటారో” అని భద్రత కల్పించడానికి! ఆ పోలీసుల టెన్షన్ మామూలుగా లేదు బాబోయ్!
నెల్లూరు వైసీపీ నాయకులు కూడా పాపం, పగలూ రాత్రి కష్టపడ్డారు. షాపుల పైన, మిద్దెల పైన, రోడ్డు డివైడర్ల పైన కూడా జనాన్ని నింపి, నెల్లూరు పట్టణాన్ని జనసంద్రం చేయాలని ఆశించారు. కానీ, వాళ్ళ ప్రయత్నాలు వృథా! నెల్లూరు పట్టణం మాత్రం బోసిపోయి వెలవెలబోయింది. బహుశా జనం అంతా, సాక్షి న్యూస్ చూసి, “అక్కడెక్కడో బంగారుపాళ్యం ఉందట! అక్కడికి వెళ్తే జనాన్ని చూపిస్తారట!” అని బయలుదేరి ఉంటారేమో!
ఇక సాక్షి మీడియా… జనాల లేని లోపాన్ని కవర్ చేయడానికి, “వేలమంది పోలీసులతో నెల్లూరు పట్టణం నిర్బంధం!” అంటూ రకరకాల ఆగడాల స్క్రోలింగులు వేసి, వింతవింత కవరింగులు చేసింది. “నిర్బంధం” వుంటే “జనం రారు” అనే తంటాలుపడ్డారు. ఒక పట్టణాన్ని నిర్బంధించడం సాధ్యమా?
కానీ, అసలు సిసలు నవ్వుల షో స్టార్ట్ అయ్యింది జగన్ రెడ్డి గారి VFX బ్యాచ్ దయవల్ల! మళ్ళీ అడ్డంగా దొరికిపోయారు! జనాన్ని చూపించే ఆత్రంలో, పాత వీడియోలని తెచ్చి కొత్త వీడియోలలో మిక్సింగ్ చేశారు. నెల్లూరులో జనం లేకపోయినా, “జనం మస్తుగా వున్నారు” అని చూపించుకోవడానికి, అదరాబాదరాగా చిత్తూరు జిల్లాలో ఇటీవల చేసిన బంగారుపాళ్యం పర్యటన విజువల్స్ ని నెల్లూరు పర్యటన మధ్యలో గుమ్మరించారు!
సాక్షి ప్రేక్షకులు మాత్రం “ఒక్క నిమిషం క్రితం ఖాళీగా ఉన్న రోడ్లు, ఇప్పుడే నిండిపోయాయేంటి?” అని తల గోక్కున్నారు! టైం ట్రావెల్ ఏమైనా కనిపెట్టారా ఏంటి అని కన్ఫ్యూజ్ అయ్యారు.
“జనాలు వస్తున్నారు” అని ఎలా గ్రాఫిక్స్ చేస్తారో, అప్పుడప్పుడూ ఇలా ఈ వైసీపీ గ్రాఫిక్స్ టీంకు గ్రహచారం బాగోక, అడ్డంగా ఎలా దొరికిపోతారో చెప్పడానికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ! ఈ కామెడీ షోని అస్సలు మిస్ చేయకండి!