– పరిటాల హత్యమాదిరిగానే వివేకా హత్య కేసు నిందితుల అనుమానాస్పద మృతి
– గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తు జరగాలి
– బాబాయ్ హత్యకేసులో అనుమానితులైన ముగ్గురు మరణం వెనుక మిస్టరీ ఛేదించాలి
– వివేకా హత్యకేసులో మిగిలిన నిందితులు, అప్రూవర్ల ప్రాణాలకు సీబీఐ రక్షణ కల్పించాలి
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్
బాబాయ్‌ని వేసేసిన అబ్బాయ్ పనే గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతి అని, ఇదంతా జగనాసుర రక్తచరిత్ర పార్ట్ 2 అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితుడైన గంగాధర్‌రెడ్డి మృతి వెనుక అనుమానాలు వ్యక్తం చేస్తూ బుధవారం మీడియాకి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగి మూడేళ్లు అయిపోయిందనీ, గొడ్డలివేటు వేసిన వారు ఇప్పటివరకూ చట్టానికి దొరకలేదని, చూసిన వారు..డెడ్‌బాడీకి కుట్లేసిన అనుమానితులు ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందటం వెనుక చాలా పెద్ద మిస్టరీయే ఉందన్నారు.
వివేకానందరెడ్డిని దారుణంగా చంపేసిన గ్యాంగ్ ముందుగా గుండెపోటు అనీ, ఆ తరువాత చంద్రబాబు చంపించేశారని ఆరోపణలు చేశారని…తీరా అది ఇంటి గొడ్డలే అని తేలడంతో కేసులో కీలకమైన వారిని ఒక్కొక్కరినీ అంతమొందిస్తున్నారన్నారు. హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్య, వివేకానందరెడ్డి గుండెపోటు వస్తే తలకి కట్టు కట్టిన జగన్‌రెడ్డి మామ గంగిరెడ్డి అనుమానాస్పద మరణం, మరో కీలక అనుమానితుడు కువైట్ గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మృతి వెనుక వున్న పెద్దల గుట్టు సీబీఐ రట్టు చేయాలని డిమాండ్ చేశారు. దేవిరెడ్డి శంకర్‌రెడ్డి ఒక రోజు పెరోల్ పై వచ్చి వెళ్లిన తరువాతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద రీతిలో మృతిచెందడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
వివేకా హత్యకేసుని గంగాధర్‌రెడ్డిపై వేసుకుంటే పది కోట్లు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి ఇస్తామన్నారని గత ఏడాది సీఆర్పీసీ 161 కింద సీబీఐకి గంగాధర్‌రెడ్డి వాంగ్మూలం ఇవ్వడం, మళ్లీ ప్లేటు ఫిరాయించి సీబీఐపైనే ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం నేపథ్యంలో ఆయన మృతి వెనుక ఎవరి హస్తం ఉందో అర్థం అవుతోందని, దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు జగన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారని, ఆ హత్యకేసులో నిందితులూ ఇలాగే అనుమానాస్పదంగా చనిపోవడం రెండు హత్యల వెనుకా ఒకడే మాస్టర్ మైండ్ వుండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మొద్దుశీనుని చంపినట్టే, ఇప్పుడూ ఒక్కో నిందితుడినీ చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఐపైనే రివర్స్ కేసులు, దాడులు, బెదిరింపుల నేపథ్యంలో ఈ హత్యకేసులో చాలా `ముఖ్య`వ్యక్తే ఉన్నారని స్పష్టం అవుతోందన్నారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి, వాచ్‌మన్ రంగయ్యల ప్రాణాలకు ప్రమాదం పొంచి వుందని, సీబీఐ వారిద్దరినీ ఢిల్లీలో సురక్షితంగా ఉంచకపోతే మరిన్ని అనుమానాస్పద మరణాలు ఖాయమని హెచ్చరించారు.
జగనాసుర రక్తచరిత్ర-2లో ఇంకెంతమందిని బలి తీసుకుంటారోనని ఆందోళన వ్యక్తం చేశారు. గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతి, దాని వెనుక కారణాలు బయటపడకుండా వుండేందుకే నేను టెన్త్ విద్యార్థులతో జరిపిన ఆన్‌లైన్ ముఖాముఖికి ఏనాడో పది పరీక్షలు తప్పి, పద్ధతి తప్పిన కొడాలి, వంశీ కుక్కల్ని ఉసిగొల్పారని ఆరోపించారు. మీ హత్యారాజకీయాలకు భయపడేది లేదని, సొంత బాబాయ్‌ని చంపేసి, కేసులో అరెస్టు కాకుండా నిందితుల్నీ చంపేస్తున్న జగనాసుర ఫ్యాక్షన్ రాక్షస రాజకీయాలని తెలుగుదేశం సమర్థవంతంగా తిప్పికొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. వివేకా హత్యకేసులో కీలక నిందితులని వేర్వేరు జైళ్లలో ఉంచి నిఘా పెంచాలని, అనుమానితులకి జగన్ రెడ్డి పోలీసులతో కాకుండా కేంద్ర భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో రక్షణ కల్పించాలని, సీబీఐ అధికారులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ సూచించారు. వీలైనంత త్వరగా బాబాయ్‌ని చంపిన అబ్బాయ్‌లని పట్టుకున్నప్పుడే జగనాసుర రక్తచరిత్ర-2కి అడ్డుకట్ట వేయొచ్చని, లేదంటే చాలా మంది ప్రాణాలు అనుమానాస్పదంగా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.