Suryaa.co.in

Andhra Pradesh

మా పార్టీ శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కాదు

– పార్టీ పేరు మార్చలేదని చెప్పిన మా పార్టీ నాయకత్వం
– మార్గదర్శి కంపెనీ పట్ల సిఐడి చీఫ్ సంజయ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితం
– ఒకప్పుడు ఏ పీ అంటే అమరావతి, పోలవరం అనే వారు…
-ఆ దిశగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేశారు
– పొత్తులపై స్పష్టతనిచ్చిన పవన్ కళ్యాణ్
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం అనేవారు. ఆ దిశగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేశారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పైశాచికత్వం, అరాచకాలను ఆపాలి. రాష్ట్రంలో ఒక ఎంపీ ని ఎత్తుకు వెళ్లి ఆస్తులు రాయించుకున్నారు. ఆస్తులు రాయించుకున్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకపోవచ్చు. నన్ను ఎత్తుకెళ్లి లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారు. ఇప్పుడేమో ఈనాడు దినపత్రికల అధినేత, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావును వేధిస్తున్నారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మార్గదర్శి సంస్థ, ఆ సంస్థ చందాదారుల గురించి సిఐడి చీఫ్ సంజయ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితం.. మార్గదర్శిపై ఎవరు ఫిర్యాదు చేయలేదు కదా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆడపిల్ల తనపై అత్యాచారం జరిగిన తరువాత ఫిర్యాదు చేయకపోతే, మేము మా బాధ్యతలను విస్మరిస్తామా? అని సంజయ్ ఎదురు ప్రశ్నించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

మార్గదర్శి సంస్థలో ప్రముఖ రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చందాదారులుగా ఉన్నారని ప్రస్తావించగా… పిల్లలకు చాక్లెట్ ఇచ్చి ఎత్తుకెళ్లే బ్యాచ్ తో ఓ ప్రతిష్టాత్మక సంస్థను పోల్చడం దారుణమని మండిపడ్డారు. విచారణ అధికారిగా సంజయ్ పత్రికా, మీడియా ప్రతినిధుల సమావేశాలను నిర్వహించి, తన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యమంత్రి ఆడిస్తున్న తోలుబొమ్మలాటలో కొంతమంది ఐపీఎస్ అధికారులు, సలహాదారుల సూచనల మేరకు సంజయ్, మార్గదర్శి సంస్థపై జగుస్సాకరమైన వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

1982 చట్టం అమలును రామోజీరావు అడ్డుకున్నారని పేర్కొనడం చూస్తే, సంజయ్ ఇంతగా తన పదవిని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉందా? అనిపించింది. ఇంత దారుణంగా మాట్లాడే హక్కు సంజయ్ కి ఎవరు ఇచ్చారు. సిఐడి చీఫ్ గా కొనసాగే అర్హత ఆయన కు లేదు. నాలుగు రాష్ట్రాలలో ఉన్న మార్గదర్శి సంస్థలను, రాష్ట్రంలోని 37 బ్రాంచ్ లను మూసి వేయిస్తామని చెప్పడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సిఐడి అధికారులు చార్జిషీట్ దాఖలు చేయలేదు . అయినా సంజయ్ ఇష్టారాజ్యంగా ఎలా మాట్లాడుతారు.

ఐపీఎస్ అధికారిగా విధుల్లో చేరేటప్పుడు హిందువునని పేర్కొన్న సంజయ్, ఇప్పుడు క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్నారు. ఈ విషయమై ఆయన సమాచారం ఇచ్చారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. అధికారులకు ఒక లక్ష్మణ రేఖ అంటూ ఉంటుంది. దాన్ని సంజయ్ అధిగమించినట్లు స్పష్టమవుతుంది. ఫ్రీ జ్యూడిస్ మైండ్ తోనే ఆయన మాట్లాడారని, మార్గదర్శి సంస్థపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలను చేశారని స్పష్టమవుతోంది. నేను కనుక రామోజీరావు స్థానంలో ఉంటే సంజయ్ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగులను జత చేసి న్యాయస్థానానికి అందజేసి, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతాను.

సంజయ్ అధికారాల గురించి ఒక ఎంపీగా ప్రశ్నించే అర్హత నాకు ఉంది. ఫ్రీ జుడీస్ మైండ్ తో ఉన్న వ్యక్తి సిఐడి చీప్ గా ఉన్నారు. సంబంధం లేని ప్రకటన ఇచ్చి నాలుగు రాష్ట్రాలలో మార్గదర్శి సంస్థ కార్యకలాపాలను ఆపుతామని పేర్కొన్నారు. సుప్రీం కోర్టుకు ఈ కేసు వెళితే సంజయ్ ను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉంది. సంజయ్ మాట్లాడింది పూర్తిగా తప్పు. ముఖ్యమంత్రితో పాటు కొంతమంది జూనియర్, సీనియర్ అధికారుల ప్రభావంతో ఆయన మాట్లాడి ఉంటారు. తెల్ల కాగితంపై రాసి పంపించాలంటూ, పత్రికల్లో వార్తా కథనాలను ప్రచురించకూడదని పేర్కొనడానికి సంజయ్ కి ఉన్న అధికారాలేమిటి. సిఐడి దర్యాప్తు గురించి మరి సాక్షి దినపత్రికలో, చానల్లో వార్తా కథనాలను ఎందుకు రాశారు… ప్రసారం చేశారని ప్రశ్నించారు.

రామోజీరావును సిఐడి అధికారులు విచారిస్తున్న ఫోటోలను సాక్షి దినపత్రిక చేతికి ఎలా చేరింది. సిఐడి అధికారులు విచారణ చేస్తున్నది సాక్షి దినపత్రిక తరఫుననా?, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరఫుననా?? అని నిలదీశారు. రాష్ట్రంలో రోజుకొక అఘాయిత్యం వెలుగు చూస్తోంది. ఫ్రాన్సిస్కో అనే అమ్మాయి పై యాసిడ్ పోసి చంపారు. పులివెందులలో ఒక దళిత యువకుడిని పట్టణ బహిష్కరణ చేసి, ఆ యువకుడు పట్టణంలో అడుగుపెట్టినందుకు అకారణంగా మట్టుబెట్టారు. లారీ తో తొక్కించి ఒకరిని, ట్రాక్టర్ తో తొక్కించి మరొకరిని హత్య చేశారు.

ఇవేమీ పట్టని సిఐడి అధికారులు, ఎటువంటి ఫిర్యాదు లేని మార్గదర్శి సంస్థ పై మాత్రం కేసులు నమోదు చేసి విచారణ పేరిట వేధిస్తున్నారు. డిపాజిట్ కు, సెక్యూరిటీ డిపాజిట్ కు తేడా తెలియని దుస్థితిలో సిఐడి అధికారులు ఉన్నారని రఘు రామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు.

ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనని మరోసారి స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల ఓట్లను చీలనివ్వనని మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో పాటు, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తుపై క్లారిటీని ఇచ్చారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. గత రెండు మూడు రోజులుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తు ఉండదని మా పార్టీ నాయకులు ఆనందపడ్డారు. కొన్ని చానల్లో డిబేట్లు కూడా నిర్వహించారు. అయినా తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపిల మధ్య రానున్న ఎన్నికల్లో పొత్తు ఉంటుందని నేను చెబుతూనే వస్తున్నాను.

రాష్ట్రంలో ఇదే పాలన కొనసాగితే ప్రజలు బ్రతికే పరిస్థితి లేదు. ప్రజల కోసం పోరాడే పార్టీలు ఏకమై, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. రాష్ట్రంలో సొంత బలాన్ని పెంచుకునే పనిలో పవన్ కళ్యాణ్ తో పాటు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉన్నారు. తన బలాన్ని మరింత పెంచుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఎవరి బలాన్ని బట్టి వారు సీట్లను పంచుకునే అవకాశం ఉంది. పొత్తులపై పవన్ కళ్యాణ్ స్పష్టతతో ఉండగా, జగన్మోహన్ రెడ్డి మాత్రం తీవ్ర అయోమయం, గందరగోళంలో ఉన్నారు.

పవన్ కళ్యాణ్ పై మా పార్టీలోని కాపు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను కూడా కాపు నేతలతో తిప్పి కొట్టించే బదులు, రెడ్డి నాయకుల చేత ఎందుకని ఖండించడం లేదో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఒకే కులం నేతల మధ్య చిచ్చు పెట్టి చలి మంటలు కాచుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే. పవన్ కళ్యాణ్ పై మా పార్టీ కాపు నాయకుడు విమర్శలు చేసినప్పుడు మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మాట్లాడి ఉంటే బాగుండేదని నేను అన్నాను.

ముద్రగడ పద్మనాభం నాకు ప్రాణ స్నేహితుడు. ఆయన గతంలో ఉద్యమాలు చేసినప్పుడు పద్మనాభం వెన్నంటే నేను ఉన్నాను. మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం పేరిట ఆణిముత్యాలు అనే పథకాన్ని గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వంలో మహనీయుల పేరిట ప్రభుత్వ పథకాలను అమలు చేసేవారు. ఏదో ఒకటి రెండు పథకాలకు మాత్రమే చంద్రబాబు నాయుడు తన పేరును పెట్టుకున్నారు.

కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలకు తన పేరునే పెట్టుకుంటున్నారు. మూడవ తరగతి నుంచి ఇంటర్నేషనల్ సిలబస్ ను ప్రవేశపెడతామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ముందు జగన్మోహన్ రెడ్డి తెలుగు భాషలో చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి. భాషా దుర్గంధాన్ని వెదజల్లడం ఆపాలి. ఇంటర్నేషనల్ సిలబస్ లో టీచర్, స్టూడెంట్ మధ్య ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది.

కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి దానికి బైజూస్ కంటెంట్ అని చెబుతూ ఉంటారు. ఇప్పటికే సీబీఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టామని చెబుతున్న ముఖ్యమంత్రి, దానికి తగ్గట్లుగా ఉపాధ్యాయ నియామకాలను చేపట్టడం లేదని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

మా పార్టీ వారికి బుద్ధి జ్ఞానం ఉన్నదా అన్నది గతంలో డౌటు… ఇప్పుడు లేదన్నది స్పష్టం
గత ఏడాది విజయవాడలో నిర్వహించిన ప్లీనరీలో మా పార్టీ నాయకత్వం కొన్ని సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత, జీవితకాల అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నట్లు ప్రకటించి మంత్రులు, ఎమ్మెల్యేలు, మా పార్టీ నాయకులు చప్పట్లను కొట్టారు. అలాగే యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ పేరును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీగా మార్చుతున్నట్లు తీర్మానించారు.

దీనితో అప్పట్లో మా పార్టీ వారికి బుద్ధి జ్ఞానం ఉన్నదా అన్న అనుమానం వచ్చింది. ఇప్పుడు లేదని అర్థమయింది.. పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికపై నేను కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాను. ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఎన్నికల నియమావళిలో జీవితకాలం అధ్యక్షుడు అనే పదానికి తావు లేదు. పార్టీ జీవితకాల అధ్యక్షుడిని అంగీకరిస్తే… రేపు జీవితకాల ప్రధాని, జీవితకాల రాష్ట్రపతి అంటారు.

గతంలో వైఎస్ఆర్ పార్టీ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల సంఘం తిరస్కరించింది. మరి ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీగా యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ పేరును ఆమోదిస్తున్నారా? అని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించడం జరిగింది. విజయవాడలో జరిగిన ప్లీనరీ సమావేశంలో మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి మాట్లాడిన వీడియో ఫుటేజ్ పాటు, పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులను జత చేసి ఎన్నికల సంఘానికి నివేదించాను.

ఇదే విషయమై ఎన్నికల సంఘం మా పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించింది. జీవితకాల అధ్యక్షుడి నియామకంపై ఎన్నికల సంఘం ప్రశ్నించగా, అటువంటిది ఏమీ లేదని, పత్రికల్లో వచ్చిన వార్తలపై అంతర్గతంగా విచారణ జరిపి నివేదిస్తామని మా పార్టీ రాష్ట్ర నాయకత్వం గత ఏడాది సెప్టెంబర్ 21వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. గత ఏడాది నవంబర్ 4వ తేదీన మా పార్టీ శాశ్వత, జీవితకాల అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కాదని పేర్కొంటూ, ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

అలాగే పార్టీ పేరు మార్పుపై కూడా ఈ ఏడాది మార్చి రెండవ తేదీన తమకు అటువంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది. మా పార్టీ నాయకులు జ్ఞాన శూన్యులని, నిరంకుశత్వంతో మేము చెప్పింది రైట్ అనే భావనకు రెండు తీర్మానాలు చేయగా… అవి హుష్ కాకి అయ్యాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

LEAVE A RESPONSE