Suryaa.co.in

Andhra Pradesh

జగనన్నా.. మీకు సెంటిమెంట్ లేదా? ఎమోషన్ లేదా ?

– సొంత కొడుకు తల్లిని కోర్టుకి ఈడ్చాడు
– నీ లబ్ధి కోసం తల్లిని వాడుకుంటావా?
– వైఎస్ఆర్ చనిపోయాక సీబీఐ ఛార్జ్ షీట్ లో పేరు పెట్టించింది ఈ జగన్ కాదా ?
– ఛార్జ్ షీట్ లో పెట్టక పోతే… బెయిల్ రాదని చేర్చిన మాట నిజం కాదా ?
– నీ లబ్ధికి అమ్మా నాన్నలను వాడుకుంటారా?
– జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం చేసి చెప్పాలి
– సుబ్బారెడ్డి జగన్ మోచేతి నీళ్ళు తాగేవాడు
– చిన్నాన్న…నా బిడ్డలు నీ ముందు పెరగలేదా ?
– వైవీ సుబ్బారెడ్డి తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాలి
– ఇది చూడటానికి నేను ఇంకా బ్రతికి ఉన్నానా అని విజయమ్మ ఏడుస్తుంది – అన్న జగన్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సెంటిమెంట్ అస్త్రం

విజయవాడ: వైసీపీ అధినేత జగన్- ఆయన చెల్లి, ఏపీసీసీ చీఫ్ షర్మిల పోరు తారా స్థాయికి చేరింది. తాజాగా మీడియాతో మాట్లాడిన షర్మిల, తన అన్న జగన్ తల్లితండ్రులను అడ్డుపెట్టుకుని ఎదిగిన స్వార్ధపరుడు. ఎలాంటి ఎమోషన్స్ లేని మనిషి. సొంత తల్లినే కోర్టుకు ఈడ్చాడంటూ శివాలెత్తారు. ఇక అన్నకు భజన చేస్తున్న బాబాయ్ సుబ్బారెడ్డికీ సవాళ్లు విసిరారు. చిత్తశుద్ధి ఉంటే ప్రమాణం చేయమని సవాల్ చేశారు. చివరాఖరకు తన అన్న జగన్‌ను కూడా ప్రమాణానికి సిద్ధపడాలని సవాల్ చేశారు. షర్మిల వేదనాభరిత వ్యాఖ్యలివి..

సుబ్బారెడ్డి నాగురించి ఎందుకు మాట్లాడుతున్నారు ? ఆయన ఎవరు? సుబ్బారెడ్డి జగన్ మోచేతి నీళ్ళు తాగేవాడు. జగన్ పదవులు ఇస్తే అనుభవిస్తున్నారు. ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారు? రేపు సాయి రెడ్డి గారు కూడా మాట్లాడుతారు.

సాయి రెడ్డి గారు కూడా ఆయన చేతిలోనే ఉన్నాడు. జగన్ మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు అని తెలిసి కూడా నిన్న రాసిన లేఖలో రాశాను. వాళ్ళ దగ్గర ఇంకా నిజాయితీ ఏమైనా ఉందా చూద్దాం అనుకున్నాను. వీళ్ళందరికీ వైఎస్ఆర్ తెలుసు. ఆయన మనోభావాలు కూడా తెలుసు. అమ్మకు అర్థం కావాలి.

నా వరకు నేను చెబుతున్నది నిజమని నేను ప్రమాణం చేయగలను. సుబ్బారెడ్డి కూడా ప్రమాణం చేయాలి. వైఎస్ఆర్ బిడ్డ తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తుంది. వైఎస్ఆర్ ఉన్నప్పుడు భారతి,సాక్షి సిమెంట్స్ లో నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉండాలన్నారు. ఇది ప్రమాణంగా చెప్తున్న. ఇచ్చిన మాట ఏమైంది అని జగన్ అన్నను అడిగా.

జగన్ నాన్నకు మాట ఇచ్చారు. ఈ లోకంలో నీ తరువాత పాప మేలుకోరేది నేనే అని జగన్ చెప్పాడు. డోంట్ వర్రీ డాడ్ అన్నాడు. ఇది నిజం అని నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తా. వైవీ సుబ్బారెడ్డి తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాలి. లేదా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం చేసి చెప్పాలి.

సుబ్బారెడ్డి అంటున్నాడు…సాక్షి కి, భారతి సిమెంట్స్ కి వాళ్ల పేర్లు పెట్టుకున్నారట. అందుకే ఆ ఆస్తులు వాళ్లవే నట. అందులో నాకు హక్కు లేదట. జగన్ సొంతగా సంపాదించాడట. ఆరోజు వాళ్ళ పేర్లు పెట్టుకుంటే నేను అభ్యంతరం చెప్పలేదు.పేర్లతో ఏముంది అనుకున్నాను. అన్న ముచ్చట పడ్డాడు అనుకున్నాను.

వాళ్ళ పేర్లతో ఆస్తులు ఉంటే…నిజంగా వాళ్లవి అవుతాయా ? నా పేరు మీద ఆస్తులు రాసి ఉంటే నేను ఎందుకు జైలుకి వెళ్ళలేదు అంటున్నారు. ఏ అన్న అయినా…చెల్లెలు గిఫ్ట్ అంటే…ఏ బంగారమో… చీరనో… గిఫ్ట్ ఇస్తారు. అంతేకాని ఆస్తుల్లో 40 శాతం వాటా ఇస్తారా ?

ఇవ్వాలని అనుకున్నది గిఫ్ట్ కాదు… నా హక్కు. నా హక్కు కాబట్టే నాకు ఇస్తామని అన్నారు. ఇవ్వాల్సిన భాధ్యత వాళ్లకు ఉంది కాబట్టి ఎంఓయు రాశారు. ఎంఓయు రాయమని నేను అడగలేదు. సరస్వతి సిమెంట్స్ ఈడీ అటాచ్ లో లేదు. అందుకే సరస్వతి సిమెంట్స్ వెంటనే ట్రాన్స్ ఫర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ఎందుకు నిలబెట్టుకోలేదు?

జగన్ మోహన్ రెడ్డి అంటున్నాడు…ప్రతి ఇంట్లో ఉండే కహాని అంట. ఇంత సునాయాసంగా ఎలా మాట్లాడుతున్నారు. మీకు సెంటిమెంట్ లేదా ఎమోషన్ లేదా ? ఈ మాటలు ఎవరో అంటే పట్టించుకొనే దాన్ని కాదు. నా సొంత చిన్నాన్నా అంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. చిన్నాన్న…నా బిడ్డలు నీ ముందు పెరగలేదా ? నా బిడ్డలను మీరు తాకలేదా ? దేవుడు అంతా చూస్తున్నాడు. అంతా గమనిస్తున్నాడు.

వైసిపి క్యాడర్ కి నేను ఒక మాట చెప్పాలని అనుకుంటున్న. 2019 లో వైసిపి ప్రభుత్వం 151 స్థానాలు గెలిచి ఏర్పడింది. ఇది అప్పుడు అఖండ విజయం. ఇది అప్పుడు ఎలా సాధ్యం అయింది. ఎంతో మంది వైఎస్ఆర్ అభిమానులు అనుకుంటే వచ్చింది. ఎంతో కష్ట పడితే…త్యాగాలు చేస్తే ఈ విజయం సాధ్యం అయింది.

నేనే కాదు…అమ్మే కాదు..ఎంతో మంది త్యాగాలు చేశారు. నేను అమ్మ ఇద్దరం మా శక్తి కి మించి పని చేశాం. అమ్మకు మోకాళ్ళ నొప్పులు ఉండేవి. బాధలు భరించి ఏడ్చుకుంటూ పార్టీ కోసం కష్టం చేసింది. నేను కూడా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. నన్ను పాదయాత్ర చేయమని అడిగితే చేశా.

నన్ను ఆరోజుల్లో సూర్యుడు వరకు వెళ్ళమని అన్నా కూడా వెళ్ళే దాన్ని. ప్రాణాలను సైతం నేను లెక్క చేయలేదు. నాకు జగన్ అన్న అంటే ప్రాణం. వైసిపి నీ అడుగుతున్న ..నేను మీకు ఏం అన్యాయం చేశా? ఒక్క కారణం చెప్పండి. మీకు ఏం అవసరం వస్తే అవసరానికి మించి తిరిగా.

సమైక్యాంధ్ర ఉద్యమం చేయమని అడిగితే చేశా.ఓదార్పు యాత్ర చేశా. బై బై బాబు అంటూ చేసిన క్యాంపెయిన్ దేశంలో పెద్దది. మీకు ఇన్ని చేస్తే… మీరు నాకు ఏం చేశారు ? మీరు నాకు,నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు. ఇది అమ్మకు తెలుసు ..అందరికీ తెలుసు.

5 ఏళ్లు మీరు రాసి ఇచ్చిన ఎంఓయు నా చేతుల్లో ఉంది. నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా… నాకు అవసరం వచ్చినా… నేను బయట పెట్టలేదు. బయటకు పోతే వైఎస్ఆర్ గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతారు. నాన్న పేరు చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. నాకు వేరే స్వార్థం ఉంటే నేను ఏదో ఒక మీడియా హౌజ్ కి ఇచ్చే దాని కదా? ఇవ్వాళ అందరి చేతుల్లో ఎంఓయు ఉంది. దీనికి కారణం నువ్వు కాదా ?

సొంత కొడుకు తల్లిని కోర్టుకి ఈడ్చాడు. ఇది చూడటానికి నేను ఇంకా బ్రతికి ఉన్నానా అని విజయమ్మ ఏడుస్తుంది. బెయిల్ రద్దు చేసేందుకు…నేను ఈ కుట్ర పన్నాను అంటున్నాడు. అందుకే కోర్టుకి తల్లిని ఈడ్చాడట. నీ లబ్ధి కోసం తల్లిని వాడుకుంటావా? వైఎస్ఆర్ చనిపోయాక.. సీబీఐ ఛార్జ్ షీట్ లో పేరు పెట్టించింది ఈ జగన్ కాదా ? ఛార్జ్ షీట్ లో పెట్టక పోతే… బెయిల్ రాదని చేర్చిన మాట నిజం కాదా ? నీ లబ్ధికి అమ్మా నాన్నలను వాడుకుంటారా? కార్యకర్తలు మీరే ఆలోచన చేసుకోవాలి.

ఆస్తులు తనవైతే తాను కూడా జైలుకు వెళ్లాలని వైవీ సుబ్బారెడ్డి అన్నారని, మరి ఆస్తులు భారతివైతే ఆమె కూడా జైలుకు వెళ్లాలిగా అని పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. కన్నతల్లిపై కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.

LEAVE A RESPONSE