– ఎట్టకేలకు నాంపల్లి కోర్టుకు వైఎస్ జగన్ – కోర్టు ఆదేశాలతో తప్పనిసరి హాజరు
– 20న ఉదయం పదిగంటలకు
– ఆరున్నరేళ్ల తర్వాత నాంపల్లి కోర్టుకు జగన్
( సుబ్బు)
తన ప్రతి సభలో ప్రజలనుద్దేశించి ‘జగనన్న వస్తున్నాడని చెప్పండి’ అని పిలుపునిచ్చే వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఇప్పుడు ‘‘జగనొస్తున్నాడని జడ్జిగారికి చెప్పండి’’ అని లాయర్లకు పిలుపునివ్వాల్సిన వైచిత్రి సీఎంగా ఉన్న ఐదేళ్లు కోర్టు ముఖం చూడని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎట్టకేలకు సుదీర్ఘ విరామానంతరం మళ్లీ నాంపల్లిలోని సీబీఐ కోర్టు బోనెక్కనున్నారు. ఇప్పటివరకూ రకరకాల సాకులు చూపి, కోర్టు హాజరు నుంచి మినహాయిపు తీసుకున్న జగన్కు, ఈసారి కోర్టు మెట్లెక్కడం అనివార్యంగా మారింది.
ఆ మేరకు కోర్టు తీర్పు ఇవ్వడంతో, 20న ఉదయం పదిగంటలకు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. తాను సీఎంగా ఉన్నందున కోర్టు విచారణకు హాజరయితే భద్రతా సమస్యలతోపాటు, ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడుతుందని వాదించిన జగన్.. ఆ మేరకు తాను హాజరుకాకుండా, తన తరఫున తన న్యాయవాది హాజరయ్యేలా మినహాయింపు తెచ్చుకున్నారు. అటు కోర్టు కూడా ఆయనకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లు, కేంద్రంలోని ఎన్డీఏతో సన్నిహితంగా మెలిగేవారన్నది తెలిసిందే.
చివరకు కోడికత్తి కేసులో బెజవాడలోని ఎన్ఐఏ కోర్టుకూ హాజరుకాని విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం ఆయన కోర్టు హాజరునుంచి తప్పించుకోలేని పరిస్థితి. విదేశాలకు వెళ్లే ముందే కోర్టు ఆ మేరకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తప్పుడు ఫోన్నెంబరుపై కేసేదీ? కాగా ఇటీవల కోర్టు అనుమతితో లండన్ వెళ్లేముందు.. జగన్కు, కోర్టు కొన్ని షరతులు విధించింది. ఆయన తన వెంట ఉన్న ‘పనిచేసే’ ఫోన్ నెంబరును సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. అందుకాయన అంగీకరించారు. అయితే తీరా లండన్ వెళ్లిన తర్వాత, ఆయన ఇచ్చిన నెంబరు పనిచేయలేదు. అసలు అది జగన్ నెంబరు కూడా కాదని తేలింది. తనకు ఫోనే లేదని జగన్ గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరి తప్పుడు నెంబరు ఇచ్చి కోర్టును తప్పుదోవపట్టించిన జగన్పై.. సీబీఐ ఇప్పటివరకూ కోర్టుకు ఫిర్యాదు చేసి, ఆ మేరకు ఆయనపై కేసు నమోదు చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.