Suryaa.co.in

Editorial

జగన్‌కు ‘కామన్’ జంజాటం!

– కామన్ సివిల్ కోడ్‌ను వ్యతిరేకించిన కేసీఆర్
– వ్యతిరేకిస్తామని మజ్లిస్‌కు కేసీఆర్ హామీ
– ఇప్పటివరకూ తేలని వైసీపీ వైఖరి
– యుసిసిని వ్యతిరేకిస్తారా? సమర్ధిస్తారా?
– కేసీఆర్ బాటలోనా? సొంత దారిలోనా?
– కామన్‌సివిల్‌కోడ్‌ను వ్యతిరేకిస్తున్న క్రైస్తవులు, ముస్లిములు
– వైసీపీకి ఆ రెండు మతాలే మూలస్తంభాలు
– యుసిసిని సమర్థిస్తే వారికి దూరం
– వ్యతిరేకిస్తే బీజేపీతో పెను ప్రమాదం
– జగన్ మద్దతు కోరిన మోదీ, అమిత్‌షా
– మరి ‘కామన్’కు వైసీపీ వై నా? ఎస్సా?
– అంతర్మథనంలో వైసీపీ నాయకత్వం
( మార్తి సుబ్రహ్మణ్యం)

కరవమంటే కప్పకు, విడవమంటే పాముకూ కోపం అన్న పితలాటంలో ఉంది వైసీపీ నాయకత్వం. ఒకే దేశం-ఒకే చట్టం పేరుతో బిల్లు తీసుకురానున్న బీజేపీ సర్కారుకు ఇప్పుడు అవసరార్ధం మిత్రులెవరో, అసలు శత్రులెవరో తేలిపోయే సన్నివేశం సాక్షాత్కరించనుంది.

పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కామన్ సివిల్ కోడ్‌ను ఇప్పటివరకూ బీజేపీ సాయం పొందిన పార్టీలు, రంగస్ధలంలోకి దిగిన తర్వాత ఎన్ని దన్నుగా నిలుస్తాయన్న ప్రశ్న రాజకీయవర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. ఇతర పార్టీల సాయం లేకపోయినా, బీజేపీ పెట్టే బిల్లు పాసవుతున్నప్పటికీ, ఆ పార్టీ చేస్తున్న ఏకాభిప్రాయసాధన ఎంతవరకూ ఫలిస్తుందన్నదే సందేహం.

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కామన్‌ సివిల్‌ కోడ్‌ బిల్లు తీసుకువచ్చేంందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్ణయించింది. నిజానికి లోక్‌సభలో ఎన్డీఏకు సరిపడా మెజారిటీ ఉంది. రాజ్యసభలో ఎలాగూ ‘రహస్య మిత్రుల’ సాయంతో బిల్లు గట్టెక్కుతుంది. కానీ బీజేపీ నాయకత్వం, ఆ బిల్లు కోసం ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేస్తోంది. బిల్లును బలవంతంగా రుద్దారన్న భావన తొలగించి, ఏకాభిప్రాయంతోనే యుసిసిని తీసుకువచ్చామన్న సంకేతాలివ్వడమే కేంద్ర లక్ష్యంగా స్పష్టమవుతోంది.

అందులో భాగంగా ఇటీవల కేంద్రహోంమంత్రి అమిత్‌షాను, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కలిసిన నేపథ్యంలో యుసిసికి మద్దతునివ్వాలని అమిత్‌షా కోరినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రధాని, హోంమంత్రి, ఆర్ధికమంత్రిని కలిసిన సమయంలో.. వారు కూడా సీఎం జగన్‌ మద్దతు కోరినట్లు తెలుస్తోంది. తర్వాత కొందరు కేంద్రమంత్రులను రాష్ర్టాలకు పంపి.. ఆయా రాష్ర్టాల్లోని అధికార-ప్రతిపక్ష నేతలతో సంప్రదింపుల ద్వారా, యుసిసి బిల్లు ఆమోదం కోసం ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తోంది.

అయితే తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాత్రం, యుసిసికి మద్దతునిచ్చేది లేదని.. తనను కలిసిన మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, ముస్లిం మత సంస్థల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. దానితో బీఆర్‌ఎస్‌పై ఆశలు వదులువలసిందే. ఇప్పటికే బీజేపీ-బీఆర్‌ఎస్‌ రహస్య మిత్రులంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే యుసిసి బిల్లును.. బీఆర్‌ఎస్‌ సమర్ధిస్తే, ఆ ఆరోపణలు నిజమయ్యే ప్రమాదం లేకపోలేదు.

ఇక బీజేపీతో అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ, అనుకున్న పనులు చేసుకుంటున్న ఏపీ సీఎం జగన్‌ నాయకత్వంలోని వైసీపీ.. యుసిసి బిల్లుపై ఎటు వైపు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకూ.. బీజేపీ సర్కారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లునూ, వైసీపీ అడక్కుండానే ఆమోదించింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, స్పీకర్‌ ఎన్నికల్లోనూ వైసీపీ బేషరతుగానే ఎన్డీఏ అభ్యర్ధులకు మద్దతునిచ్చింది.

అందుకు ప్రతిఫలంగా.. రాష్ట్రం ఆర్ధికపరమైన కష్టాల్లో ఉన్నప్పుడల్లా , కేంద్రం ఆపద్బాంధవుడి అవతారమెత్తి, కష్టాల నుంచి గట్టెక్కిస్తూనే ఉంది. అప్పుడప్పుడూ రాష్ట్రానికి వచ్చే అమిత్‌షా, ఇతర కేంద్రమంత్రులు వైసీపీ పాలనను తూర్పారపడుతున్నారు. ఇంత అవినీతి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని ధ్వజమెత్తుతున్నారు. అయినప్పటికీ వైసీపీ సర్కారుకు.. కేంద్రం నుంచి వచ్చే, ఎలాంటి ప్రయోజనాలూ ఆగకపోవడం ప్రస్తావనార్హం.

పైగా వైఎస్‌ హత్య వెనుక అంబానీ ఉన్నారంటూ, గతంలో జగన్‌ సహా కుటుంబసభ్యులంతా ఆరోపించారు. అభిమానులు అనేక చోట్ల రిలయన్స్‌ ఆస్తులు ధ్వంసం చేశారు. అయితే అదే అంబానీ కంపెనీ ఉపాధ్యక్షుడైన పరిమళ నత్వానీకి, వైసీపీ రాజ్యసభ సీటు కేటాయించింది. అదానీ కంపెనీలకు జగన్‌ సర్కారు భూములు కేటాయించింది. గుజరాత్‌ కంపెనీ అమూల్‌ను, జగన్‌ సర్కారు దాదాపు దత్తత తీసుకుంది. ఈ అంశాలపై విపక్షాలు ఇప్పటికే జగన్‌ సర్కారును దుమ్మెత్తిపోస్తున్నాయి.

ఈవిధంగా పైకి రాజకీయంగా వైసీపీని విమర్శిస్తున్న బీజేపీ, ఏపీలో జగన్‌ ద్వారా తన ప్రయోజనాలు నెరవేర్చుకుంటోంది. అటు జగన్‌ కూడా.. బీజేపీతో తన రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ… ‘కనపడకుండానే కలిసి అడుగులేస్తున్నార’ని స్పష్టమవుతోంది.

ఈవిధంగా ఇప్పటివరకూ బీజేపీ-వైసీపీ మధ్య.. రాజకీయ-ఆర్ధిక సంబంధాలు సజావుగా సాగుతోంది. అయితే కీలకమైన కామన్‌ సివిల్‌ కోడ్‌పై.. వైసీపీ వైఖరేమిటన్న అంశ ఆసక్తిగామారింది. ఆ పార్టీ నాయకత్వం కూడా, ఇప్పటివరకూ కామన్‌సివిల్‌కోడ్‌పై తన వైఖరేమిటన్నది స్పష్టం చేయలేదు.

ఎందుకంటే రాష్ట్రంలో క్రైస్తవులు, దళిత క్రైస్తవులు, ముస్లింలు గత ఎన్నికల్లో వైసీపీకి గంపగుత్తగా ఓట్లేశారు. ప్రధానంగా రాష్ట్రంలోని ఎస్సీలలో, క్రైస్తవ మతం మారిన వారి సంఖ్య ఎక్కువ. వైఎస్‌ తమకు రిజర్వేషన్లు ఇచ్చారన్న విశ్వాసంతో అటు ముస్లింలు, ఆయన తనయుడు జగన్‌ పార్టీకి ఓట్లేశారు.

వైసీపీకి 27 ఎస్సీ, ఎస్టీఎమ్మెల్యేలున్నారు. ఈ నియోజకవర్గాల్లో దాదాపు 80 శాతం ఎస్సీలు క్రైస్తవమతంలోకి మారారన్నది బహిరంగ రహస్యం. వైసీపీలోని ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలలో మెజారిటీ శాతం.. క్రైస్తవ మత సంప్రదాయాలే పాటిస్తున్నారన్న విషయం రహస్యమేమీ కాదు.

మోదీ ప్రధాని అయిన తర్వాత.. తమపై దాడులు జరుగుతున్నాయన్న భావన.. అటు ముస్లింలు, ఇటు క్రైస్తవులలో బలంగా నాటుకుపోయింది. యుసిసిని వ్యతిరేకిస్తూ.. ఇటీవల విజయవాడకు చెందిన కొందరు ముస్లిం మత పెద్దలు చేసిన హెచ్చరికలు, సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉన్న కర్నూలు, నంద్యాల, కడప, గుంటూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో.. యుసిసిని మైనారిటీలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, ఒంగోలు, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో.. క్రైస్తవమతం మారిన ఎస్సీలు కూడా, కామన్‌ సివల్‌ కోడ్‌ను వ్యతిరేి స్తున్నారు. వీరంతా ఇప్పటిదాకా మానసికంగా జగన్‌కు మద్దతెదారుగానే కొనసాగుతున్నారు.

ఒకవేళ వైసీపీ నాయకత్వం.. కాపమన్‌సివిల్‌ కోడ్‌కు మద్దతునిస్తే, ఆయా వర్గాలను వైసీపీ దూరం చేసుకోవటం అనివార్యమవుతుంది. ఆ భయంతో కామన్‌సివిల్‌ కోడ్‌ బిల్లును వ్యతిరేకిస్తే, ఆటు కేంద్రం నుంచి రాజకీయ-ఆర్ధిక ప్రయోజనాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. నిజానికి జగన్‌ సర్కారు, ఇప్పుడు రాష్ట్రంలో అందిస్తున్న ఉచిత పథకాల నిధులలో సింహభాగం కేంద్రానివే. కాబట్టి యుసిసిని వ్యతిరేకిస్తే, జగన్‌ సర్కారు ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోక తప్పదు. కీలకమైన ఎన్నికల సంవత్సరంలో పథకాలు దూరమైతే, ప్రజల్లో వచ్చే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.

అందువల్ల కామన్‌సివిల్‌ కోడ్‌ బిల్లుకు మద్దతు వ్యవహారం, జగన్‌కు ప్రాణసంకటంలా మారింది. ఒకరకంగా ఇది, జగన్‌ రాజకీయ భవిష్యత్తుతో ముడిపడిన అంశంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కామన్‌సివిల్‌ కోడ్‌ బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తుందా? సమర్ధిస్తుందా అన్న ప్రశ్నలు తెరపైకి తెచ్చాయి.

LEAVE A RESPONSE