Suryaa.co.in

Editorial

తల్లి- చెల్లిపై కోర్టుకెక్కిన జగన్

  • నా షేర్లు నాకు ఇచ్చేయాలంటూ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్

  • తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు జగన్, భారతీరెడ్డి ఇచ్చిన షేర్లు రద్దు చేయాలని వినతి

  • సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, షర్మిల, విజయమ్మను పార్టీగా చేసిన జగన్, భారతీరెడ్డి

  • తల్లి,చెల్లికి ప్రేమతో షేర్లు ఇస్తే వారు తనను విమర్శించారని పిటిషన్

  • చెల్లి తనను ఎన్నికల్లో తిట్టిందని, రాజకీయంగా అప్రతిష్టపాలు చేసిందని ఆవేదన

  • అందుకే తల్లి విజయమ్మ,చెల్లి షర్మిలకి ఇచ్చిన షేర్లు రద్దు చేసి, తమకు ఇవ్వాలంటూ కోర్టుకెక్కిన భార్యాభర్తలు

  • 8న హైదరాబాద్ ఎన్‌సీఎల్‌టీలో విచారణకు రానున్న జగన్-భారతీరెడ్డి పిటిషన్

  • బయటపడిన ‘పులివెందుల’ ఎదుగూరి సందింటి కుటుంబ పంచాయతీ

  • షర్మిలతో రాయబారం వార్తలు ఉత్తిదేనని తేలిన వైనం

  • తల్లి, చెల్లితో జగడానికే జగన్ దంపతులు జై

  •  ‘సూర్య’ ప్రత్యేక కథనం

( మార్తి సుబ్రహ్మణ్యం)

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఆయన అభిమానులు.. మిత్రులు.. సహచరులు.. అనుచరులు.. ‘షేర్’ అని సగర్వంగా పిలుచుకుంటారు. ఎందుకంటే ఆయన తత్వం అలాంటిది. అయనకు తన పిల్లలంటే వల్లమాలిన ప్రేమ. కుమార్తె పాప.. అంటే షర్మిల.. వల్లమాలిన ప్రాణం.జగన్ కంటే షర్మిలంటేనే ఎక్కువ ఇష్టం. ఆయన బతికుండగనే వారసుల కోసం, పరాయి రాష్ట్రాల్లో పవర్ ప్రాజెక్టులు పెట్టించారు. టీడీపీని సమర్ధించి, తనను వ్యతిరేకించే ఈనాడు-ఆంధ్రజ్యోతిని ఎదుర్కొనేందుకు, సాక్షి పత్రిక-చానెల్‌ను తాను మేళ్లు చేసిన వారి డబ్బులతో ప్రారంభించారు.

అలాంటి ‘షేర్’ కుటుంబంలో ‘షేర్ల ముసలం’ పుట్టి.. పైసల పంచాయతీ వస్తుందని ఎవరైనా ఊహించగలరా? చివరాఖరకు తన భార్యను కన్న కొడుకే షేర్ల కోసం కోర్టుకు ఈడుస్తారని, ఆ ‘షేర్’ ఎందుకు ఊహిస్తుంది? షేర్ల రూపంలో వచ్చే డబ్బుల కోసం.. తన రక్తం పంచుకుపుట్టిన కన్న కొడుకే, కోడలితో కలసి.. తన భార్యాబిడ్డను, కోర్టుకు ఈడుస్తారని తెలిసిన ఆ పెద్దాయన గుండె, బతికుంటే పగిలిపోదా?

ఇది తెలిసి పెద్దాయనను తమ గుండెల్లో పెట్టుకుని పూజిస్తూ, ఆ ప్రేమను జగన్‌పై కొనసాగిస్తున్న లక్షలాదిమంది రాజన్న అభిమానులు, ఇకపై జగన్‌ను మనన్ఫూర్తిగా ప్రేమించగలరా? ఆయన అడుగులో అడుగు వేయగలరా? తల్లినే కోర్టును ఈడ్చిన కొడుకుగా ముద్రపడ్డ జగనన్నను, మహిళలు ఇకపై తన కొడుకుగా చూడగలరా?

నా అక్కచెల్లెమ్మలంటూ..టన్నులకొద్దీ ప్రేమ కురిపించే తమ జగనన్నలో, చెల్లి షేర్లు కూడా లాక్కునే టక్కుటమార విద్యలున్నాయని తెలిసిన అదే అక్కచెల్లెమ్మలు, జగనన్నను ఇకపైఅభిమానించే సాహసం చేయగలరా? ఏతావతా ఇది వైసీపీకి మహిళలసెంటి‘మంట’! ఇదే ఈనెల 8న హైదరాబాద్ ఎన్‌సీఎల్‌టీ బెంచి కెక్కనున్న.. పులివెందుల ‘ఎదుగూరు సందింటి’ వారి ‘ఫ్యామిలీవార్’.

ఏ అన్నయినా తల్లి-చెల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారికి కష్టం వస్తే వాళ్ల కాళ్లకు ముళ్లవుతారు. ఇంటి ఆడపడచుకు ఆపద వస్తే తన ఆస్తి పంచుతారు. కానీ సీఎంగా ‘రివర్స్ టెండర్’కు అలవాటుపడ్డ జగన్ మాత్రం.. అలవాటు ప్రకారం జీవితంలోనూ రివర్స్ పద్ధతి ఫాలో అవుతున్నారు. తల్లి-చెల్లికిచ్చిన ఆస్తులు కూడా కోర్టుకెక్కి మరీ లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చరిత్రలో జగన్ ‘చెల్లెమ్మ ఆస్తులు లాగేసుకునే ‘ఆధునిక అన్నయ్య’గా ఆవిష్కరించబోతున్నారన్నమాట.

నా అక్కచెల్లెమ్మలు, నా తల్లులూ అంటూ దీర్ఘాలు తీసి.. వారిపై టన్నుల కొద్దీ ప్రేమాభిమానాలు చూపే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు, అసలు సొంత తల్లి-చెల్లి అంటే ఏమాత్రం ప్రేమ లేదని విస్పష్టంగా తేలిపోయింది. స్వయంగా ఆయన సంతకంతో 68 పేజీలతో ఒకటి.. 70 పేజీలతో మరొకటి హైదరాబాద్ ఎన్‌సీఎల్‌టీ కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో, తల్లి-చెల్లికి తాను గతంలో ఇచ్చిన షేర్లను రద్దు చేసి, వాటిని తనకు- తన భార్య భారతీరెడ్డికి బదలాయించాలన్న వాదనతో, జగన్ మరోసారి మహిళ సెంటి‘మంట’ను ఎదుర్కోనున్నారు.
ఇక పులివెందుల ‘ఎదుగూరి సందింటి’ వారి ఫ్యామిలీ పంచాయతీకి వెళదాం..

గ్రంధి ఈశ్వరరావు, గ్రంధి శశికళ, గ్రంధి సతీష్ స్థాపించిన సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను.. ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకువచ్చామని, ఆ కంపెనీ ఎదుగుదలలో తమ కష్టం ఉందని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతీరెడ్డి, క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కలసి, 3-9-2024లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచిలో వేసిన పిటిషన్‌లో వెల్లడించారు.
అందులో సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, చెల్లి వైఎస్ షర్మిలారెడ్డి, తల్లి విజయా రాజశేఖర్‌రెడ్డి, చాగరి జనార్దన్‌రెడ్డి, కేతిరెడ్డి యశ్వంత్‌రెడ్డిని ఒకటి, రెండు, మూడు, మూడు, నాలుగు, ఐదవ పార్టీగా పేర్కొంటూ పిటిషన్ వేశారు.

తాను-తన భార్య భారతీరెడ్డి.. తన చెల్లి షర్మిలారెడ్డికి ప్రేమ-వాత్సల్యంతో తమ షేర్లు ఇస్తామని 31-8-2019లో ఒక ఒప్పందం (ఎంఓయు) చేసుకున్నారు. అయితే తమ ఆస్తులకు సంబంధించిన కేసులు ఈడీలో ఉన్నందున, అవి ముగిసిన తర్వాత మాత్రమే తాను చెప్పిన షేర్లు ఇస్తానని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే దానిపై2-12-2019న హైకోర్టులో ఈడీ ప్రొసీడింగ్స్ స్టేటస్‌కో వచ్చినట్లు జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

తల్లి విజయమ్మకు తన షేర్లు ఇచ్చానని, చెల్లికి ఇవ్వాల్సిన షేర్లు కూడా తల్లిపేరుమీదే పెట్టాలంటూ, జగన్-భారతీరెడ్డి కలసి గిఫ్ట్‌డీడ్ రిజిస్టర్ చేసినట్లు ఎన్సీఎల్టీకి వివరించారు. 23-7-20121న తల్లి విజయమ్మ నుంచి జగన్ తిరిగి షేర్లు కొనినట్లు పేర్కొన్నారు.
అయితే తాను చెల్లి షర్మిలారెడ్డికి, ఎంతో అభిమానం-ప్రేమ వాత్సల్యంతో షేర్లు ఇచ్చినప్పటికీ.. ఆమె తనను దూషించిందని, అకార ణమైన ఆరోపణలు చేయడంతో, తాను మనస్తాపానికి గురయ్యానని తన పిటిషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.అందులో మోసగత్తె అన్న పదం వాడటం ప్రస్తావనార్హం.

కాబట్టి ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. తన షేర్లు తన చెల్లి షర్మిలకు ఇవ్వాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. తన ప్రేమ కరిగిపోయింది కాబట్టి, తనను చెల్లి రాజకీయంగా వ్యతిరేకించింది కాబట్టి.. గిఫ్ట్‌డీడ్, ఎంఓయు చేసుకున్నప్పటికీ.. చెల్లికి చిల్లిగవ్వ కూడా ఇచ్చేది లేదని, తన పిటిషన్‌లో జగన్ ఖరాఖండీగా స్పష్టం చేశారు.

అందువల్ల ఎన్‌సీఎల్‌టీ వారు తమకు 51 శాతం షేర్లు డిక్లేర్ చేయాలని కోరిన జగన్.. ఆ మేరకు 6-72024న వారికి ట్రాన్స్‌ఫర్ అయిన షేర్లను గుర్తించకుండా రద్దు చేయాలని అభ్యర్ధించారు. కాగా భారతీరెడ్డి నుంచి ఇచ్చిన 40 లక్షల 50 వేల షేర్లను కూడా, అదే తేదీన రద్దు చేయాలని జగన్ అభ్యర్ధించారు. భీమిశెట్టి రమేష్ నుంచి విజయమ్మకు ఇచ్చిన, 12 లక్షల షేర్లు రద్దు చేయాలని కోరారు.

అంటే తల్లి విజయమ్మ-త ల్లి షర్మిలమ్మకు, తాను ఇస్తానన్న షేర్లలో నయాపైసా ఇచ్చేది లేదని జగన్ స్పష్టం చేసినట్లు అర్ధమవుతుంది. పైగా తాము ఒప్పందం చేసుకున్న షేర్లను రద్దు చేసి, ఆ షేర్లు కూడా తనకు-తన భార్య భారతీరెడ్డికి బదలాయించాలని కోర్టుకెక్కినట్లు, ఆయన వేసిన పిటిషన్ స్పష్టం చేస్తోంది. కాగా సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్ క్యాపిటల్ ( కంపెనీ పెయిడప్ క్యాపిటల్) మొత్తం 32 కోట్ల రూపాయలు కాగా, 2022లో నెట్‌ప్రాఫిట్ పదకొండున్నర కోట్లుగా పేర్కొన్నారు.

సీఎంగా ఉన్నప్పుడు తాను ఇంటికి పెద్ద కొడుకునని, అక్కాచెల్లమ్మలకు సోదరుడినని మైకులుగలకొట్టిన జగన్.. అసలు తన సొంత తల్లి-చెల్లికే చిల్లిగవ్వ ఇచ్చేది లేదంటూ, వారిపైనే కోర్టుకెక్కడంతో ఇప్పటివరకూ ఆయనను గుడ్డిగా అభిమానిస్తున్న వారు, అమితంగా ఆరాధిస్తున్న మహిళలు.. 8న విచారణకు రానున్న ఈ కేసు తర్వాత.. జగన్ తీరు పట్ల ఎలా స్పందిస్తారో చూడాలి.

కాగా.. చెల్లి షర్మిలతో అన్న జగ న్ రాయబారం నిర్వహిస్తున్నారంటూ.. ఇటీవలి కాలంలో వస్తున్న వార్తలు ఉత్తిదేనని, తాజా కేసుతో స్పష్టమయింది. కాంగ్రెస్‌లో చేరేందుకు జగన్, తన చెల్లితో మాట్లాడుతున్నారని, ఆమేరకు తన ఆస్తి పంచాయతీని కూడా సెటిల్ చేసుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. దానితో న్యూస్‌చానెల్స్ దానిపై, చర్చకు తెరలేపాయి.

అయితే.. ఒకవైపు తల్లి-చెల్లితో జగడానికి సిద్ధపడుతున్న జగన్, మళ్లీ చెల్లి షర్మిలతో రాయబారం ఎలా చేస్తారన్నది ప్రశ్న. తమకు ఇచ్చిన షేర్లు లాక్కొనేందుకు కోర్టు ద్వారా ప్రయత్నిస్తున్న జగన్‌తో, చెల్లి షర్మిల ఎలా రాజీపడతారన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

LEAVE A RESPONSE