• బొల్లా బ్రహ్మనాయుడు అనుచరుల దౌర్జన్యం.. జేసీబీతో ఇల్లు ధ్వంసం
• టీడీపీ ఏజెంట్ గా కూర్చున్నందుకు పగబట్టిన శెట్టిపల్లి
• వల్లభనేని అనుచరులు రాత్రికి రాత్రే పొలంలో పంటను దోచుకెళ్లారు
• వైసీపీ నేతలు, వారి అనుచరుల దౌర్జన్యాలపై వరుస ఫిర్యాదులు
మంగళగిరి: వైసీపీ పార్టీ అనుకూలమైన వారికి మాత్రమే పోస్టింగ్ లు ఇచ్చి దివ్యాంగులైన తమకు గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని.. రెండుసార్లు తాడేపల్లిగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు పిలిచి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వైసీపీ అనుకూలపరులకు ఉద్యోగాలు ఇచ్చుకుని.. దివ్యాంగులకోటాలో తమకు రావాల్సిన ఉద్యోగాలను ఇవ్వలేదని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన ఎన్. నరేష్ అనే దివ్యాంగుడు శనివారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్, రాష్ట తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ రిష్వంత్ లకు వినతి ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. అర్జీలు స్వీకరించిన నేతలు వాటిని స్వీకరించి సమస్యల పరిష్కారినికి కృషిచేశారు.
• స్థలం విషయంలో కోర్టు ఆదేశాలు తమకు అనుకూలంగా ఉన్నప్పటికి అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు వందమంది వచ్చి తమ ఇంటిపై దాడి చేసి తమను కొట్టి జేసీబీతో ఇల్లు, కొట్టును ధ్వంసం చేసి వెళ్లారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినుకొండకు చెందిన కామా వెంకటేశ్వర్లు గ్రీవెన్స్ లో నేతలకు ఫిర్యాదు చేశారు.
• జ్యోతుల చంటిబాబుతో రెవెన్యూ అధికారులు పోసుబాబు, చెల్లాయమ్మలు కుమ్మక్కై తమను భారీగా మోసం చేశారని.. ప్రభుత్వ భూమిని జీరాయితిగా పెట్టి తమచేత కోటిన్నర పెట్టి కొనుగోలు చేయించి.. 40 లక్షలు లంచంగా తీసుకుని నట్టేట ముంచారని.. ఎన్నిసార్లు వెళ్లి అభ్యర్థించినా పట్టించుకోవడంలేదని.. తమను మోసం చేసిన అధికారులను శాశ్వతంగా ఉద్యోగాలనుండి తొలగించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.
• తాను టీడీపీ ఏజెంట్ గా కూర్చున్నందుకు 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న శెట్టిపల్లి రఘురామిరెడ్డి తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని.. వైసీపీ నేతలు తన పొలంలో పంటను ధ్వంసం చేశారని.. పోలీసులతో భయపెట్టారని.. తనకు రావాల్సిన బిల్లులు రాకుండా అడ్డుకున్నారని.. దాంతో రోడ్డున పడ్డామని తమకు రావాల్సిన బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని కడప జిల్లా చాపాడుకు మండలం ఎన్. అనంతపురం గ్రామానికి చెందిన మల్లికార్జున రెడ్డి వేడుకున్నారు.
• మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అనుచరులు దౌర్జన్యంగా రాత్రికి రాత్రి తమ పొలంలో ఉన్న వరి పంటను కొసుకుపోయారని.. దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినా తీసుకోలేదని.. పంటను సాగు చేస్తే ధ్వంసం చేస్తున్నారని.. పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా గన్నవరం మండలం గోపవరపుగూడెంకు చెందిన వేమూరి రామారావు, వేమూరి నాగేశ్వరరావులు విజ్ఞప్తి చేశారు.
• తమ స్థలాన్ని ఆక్రమించి అందులో దౌర్జన్యంగా నాగవరం గ్రామానికి చెందిన యోహాను ఇల్లు కట్టుకుంటున్నారని.. అతనిపై చర్యలు తీసుకుని తమ స్థలం కబ్జా నుండి విడిపించాలని ప్రకాశం జిల్లా క్రోసూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన శారగొండి సామ్రాజ్యం నేతలకు విజ్ఞప్తి చేసింది.
• ఏపీ ప్రభుత్వ విధాన పరిషత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రులలో అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులను ఆప్కాస్ లో చేర్చి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు గ్రీవెన్స్ లో మంత్రి వాసంశెట్టిని అభ్యర్థించారు.
• పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని న్యూవె కాంప్లెస్ పక్కన ఉన్న సర్వె నెంబర్ 195-1ఏ1బీలో ఉన్న తమ ప్లాట్ లో అక్రమంగా నిర్మించిన రేకులషెడ్ ను తొలగించి తమకు న్యాయం చేయాలని గుంటూరుకు చెందిన దాసరి శ్రీనివాసరావు, దాసరి రవికుమార్ లు విజ్ఞప్తి చేశారు.
• కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన తుమ్మా వీర్రాజమ్మ విజ్ఞప్తి చేస్తూ.. గండేపల్లిమండలం యర్రంపాలెం గ్రామంలో ఉన్న తమ భూమి 3.56 సెంట్లను ఉద్దేశ పూర్వకంగా నిషేధిత జాబితా 22-ఏ కేటగిరి ఇ -5 లో చేర్చి హైదరాబాద్ ఎండోమెంట్ వారు కబ్జా చేశారని.. తమ భూమిని కబ్చా నుండి విడిపించాలని వారు వేడుకున్నారు.
• గుంటూరు జిల్లా తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్ కు చెందిన కొండెపోగు శాంతి విజ్ఞప్తి చేస్తూ.. తమకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఆక్రమించుకుని కబ్జాదారులు తమపైనే దాడు చేస్తున్నారని తమ భూమిని కబ్బాదారుల నుండి విడిపించి ఆదుకోవాలని వేడుకున్నారు.
• డవలప్ మెంట్ పేరుతో తమ భూమిని తీసుకుని డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఏం చేసుకుంటావో చేసుకోమంటూ.. ముక్కామలకు చెందిన కొప్పిశెట్టి రాంబాబు బెదిరిస్తున్నారని.. అతని నుండి రావాల్సిన సొమ్ములను ఇప్పించి ఆదుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన కముజు శ్యామసుందర్ రావు విజ్ఞప్తి చేశారు.
• తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన తంగెళ్ల వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేస్తూ.. తమ పూర్వికుల నుండి వచ్చిన భూమిని రెవెన్యూ అధికారులు పేర్లు మార్చి ఇబ్బంది పెడుతున్నారని, దాన్ని సరిచేసి తమ భూమి తమకు ఉండేలా చూడాలని వేడుకున్నారు.
• కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మీదంపతులు గ్రీవెన్స్ లో అర్జీ ఇస్తూ.. సామర్లకోట మండలం మాధవ పట్నం గ్రామంలో గోదావరి కాలువ పరివాహక ప్రాంతంలో నిర్మించిన శ్రీ కనకదుర్గ, శ్రీ వెంకటేశ్వర , శ్రీ విజ్ఞేశ్వర, శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణేశ్వర స్వామి దేవాలయాలకు సంబంధించి దేవాదాయ ధర్మదాయ చట్టంలోని సెక్షన్ 43ను అనుసరించి నోటిఫై చేసి ఇద్దరు అర్చకులకు గౌరవ వేతనం, జీతభత్యాలు దేవాదాయ శాఖ నుండి చెల్లించాలని కోరారు.
• కరోనా, ఎలక్షన్, దసరా సమయాల్లో తమను సిల్ట్ వర్కర్ లు తీసుకుని తరువాత తమకు పనిలేదు పొమ్మని చెబుతున్నారని.. తమకు పనికల్పించి ఆదుకోవాలని విజయవాడకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున వచ్చి నేతలను అభ్యర్థించారు.
రాజధాని అభివృద్ధి కోసం తన పింఛన్ డబ్బుల నుండి కొంత సొమ్మును గుంటూరు జిల్లా కాకుమాను మండలం తెలగాయ పాలెంకు చెందిన సాంబశివరావు అందించారు. అలాగే పలువురికి మంత్రి వాసంశెట్టి ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు.