Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగులను రాచిరంపాన పెడుతున్న జగన్ ప్రభుత్వం

ఇంతలా ఉద్యోగులను వేధిస్తున్న ప్రభుత్వం దేశంలో మరొకటి లేదు
200 కోట్ల రూపాయలు ఎవరెవరికి చెల్లించారు… సి ఎఫ్ఎంఎస్ వెబ్ సైట్ ఎందుకు మూసివేశారు
ఋషికొండ పై నిర్మించిన అక్రమ భవనంలోకి జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టనివ్వం
వెకేషన్ బెంచ్ లో చంద్రబాబు నాయుడుకు బెయిల్ లభించడం ఖాయం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఉద్యోగులను ఇంత దారుణంగా రాచిరంపాన పెడుతున్న ప్రభుత్వం, దేశ చరిత్రలో మరొకటి లేదని జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

ఉద్యోగులకు ఒకటవ తేదీ జీతాలు చెల్లించడం ప్రభుత్వ బాధ్యతని ఆయన అన్నారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ప్రభుత్వ ఉద్యోగులకు తగిన శాస్తి జరిగిందని కొందరు అంటున్నారు. కానీ అది సరైన విధానం కాదు.

పరిపాలకులు ఇలా తయారై, ఉద్యోగులను ప్రజల మీదకు వదిలేస్తే జీతాలు లేకుండా వారెలా బ్రతకాలి. బ్రతకడం కష్టం అవుతుంది కదా… వారు మనుషులేనన్న విషయాన్ని విస్మరించడం దారుణం. అవినీతి ఉద్యోగులు నాలుగు నుంచి ఐదు శాతం మంది మాత్రమే ఉంటారు. మిగిలిన వారంతా జీతాలపై ఆధారపడే జీవిస్తూ ఉంటారు. వారికి సకాలంలో జీతాలను చెల్లించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యతని ఆయన పేర్కొన్నారు.

గవర్నర్ ఆమోదం పొందిన జిపిఎస్
గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ( జీ పి ఎస్ ) ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా, గవర్నర్ ఆమోదించారు. ఎన్నికల ముందు సిపిఎస్ ను రద్దు చేస్తామని ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి, సిపిఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ ను తీసుకు వస్తాడని ఉద్యోగులు భావించారు.. కానీ ఆయన , గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ పేరిట గ్యారంటీ లేని జిపిఎస్ ను తీసుకువచ్చారని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జిపిఎస్ ను చూసి ఉద్యోగులు నెత్తి, నోరు బాదుకుంటున్నారు.

సిపిఎస్ పథకంలో భాగంగా ఉద్యోగుల జీతాలలో నుంచి 10 శాతం నిధులు కట్ కాగా, రాష్ట్ర ప్రభుత్వం మరో 10 శాతం నిధులను జమ చేసి… ఆ మొత్తం లో నుంచి ఉద్యోగి రిటైర్డ్ అయినప్పుడు 60 శాతం నిధులను చెల్లించేవారు .. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత అతని పేరిట జీవితకాల సర్వీసులో భాగంగా 60 లక్షల జమ అయ్యాయని అనుకుంటే, అందులో నుంచి 36 లక్షల రూపాయలను వెంటనే తీసుకునే వెసులుబాటును కల్పిస్తారు. మిగిలిన 24 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం వచ్చే వాటిల్లో పెట్టుబడుల రూపంలో పెడుతుంది. దానిపై వచ్చే ఆదాయాన్ని పెన్షన్ రూపంలో ఆ ఉద్యోగికి నెల నెల అందజేస్తుంది.

జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన జిపిఎస్ పథకంలో రిటైర్డ్ అయ్యే సమయానికి ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే జీతంలో 50 శాతం మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందజేస్తామని చెబుతున్నారు. ఉదాహరణకు ఉద్యోగి నెల జీతం 70 వేల రూపాయలు అనుకుంటే, రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ రూపంలో 35 వేల రూపాయలు అందజేయనున్నారు. సిపిఎస్ పథకంలో భాగంగా రిటైర్డ్ అయిన తర్వాత ఉద్యోగికి అందజేసే 60 శాతం మొత్తాన్ని, జిపిఎస్ పథకంలో భాగంగా అందజేయరు . అంతా తమ వద్ద ఉంచుకొని నెలనెలకు 50 శాతం మొత్తాన్ని మాత్రమే అందజేస్తారు.

ప్రభుత్వం పెట్టుబడులు పెట్టిన దాంట్లో నష్టం వచ్చిన ఉద్యోగికి తన ఆఖరి జీతం లో సగం మొత్తాన్ని పెన్షన్ రూపంలో ఈ పథకంలో భాగంగా చెల్లించనున్నారు. జిపిఎస్ పథకంలో భాగంగా రిటైర్డ్ అయిన ప్రతి ఉద్యోగి పై నెలకు 20 నుంచి 25వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కన్నం వేయనుంది. ఇది పచ్చి మోసమని లెక్కలు చూసుకున్న తర్వాత ఉద్యోగులు లబోదిబోమంటున్నారు.

హెల్త్ ఇండెక్స్ పెరిగిన తర్వాత 60 సంవత్సరాలు అనేది పెద్ద వయసు కాకుండా పోయింది.. ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత , వేరే ఉద్యోగం చేస్తే పెన్షన్ చెల్లించరు. దీన్ని చట్టంలో పెట్టగా గవర్నర్ ఆమోదించారు. అలాగే రిటైర్డ్ అయిన తర్వాత ఉద్యోగి నడవడిక బాగా ఉంటేనే పెన్షన్ చెల్లిస్తారట. ప్రభుత్వంలో తానే శాశ్వతంగా ఉంటానని కాబోలు జగన్మోహన్ రెడ్డి , ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని ఈ నిబంధనను పొందుపరిచినట్లు ఉన్నారని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు . ఉద్యోగంలో చేరిన తర్వాత 33 ఏళ్లకు, ఉద్యోగంలో నుంచి తొలగించే ఆప్షన్ ను కూడా ఈ పథకంలో పొందుపరిచారు.

జిపిఎస్ కంటే దారుణమైన స్కీం ఉంటుందా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నాయకులైన బండి శ్రీనివాసరావు, వెంకట్ రామ్ రెడ్డి, మరొక రెడ్డికి ఈ పథకం నచ్చి ఉండవచ్చు. కానీ 5 లక్షల మంది ఉద్యోగులకు ఈ పథకం బొత్తిగా నచ్చడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు చెందిన యాబై నుంచి 60 లక్షల ఓట్లు ఈసారి మా పార్టీకి వేసే అవకాశమే లేదు . గత ఎన్నికల్లో దాదాపుగా మెజారిటీ ఓట్లు మా పార్టీకే వేశారు. ఉద్యోగుల ఆగ్రహంతో రానున్న ఎన్నికల్లో మా పార్టీ దారుణంగా ఓడిపోనుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఉద్యోగులకు ప్రభుత్వ బకాయిలు 31,572 కోట్లు
ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 31 వేల 572 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించవలసి ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. పిఆర్సి కరువు భత్యం కలుపుకొని 18 వేల కోట్ల రూపాయలు, కొత్తగా రెండు డి ఏ బకాయిలు 7000 కోట్ల రూపాయలు, వైద్య బిల్లులు, ఎర్న్ లివ్స్ రూపంలో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఎర్న్ లీవ్స్ బకాయిలను వెంటనే చెల్లించేవారు. గత మూడేళ్లుగా ఇవ్వడం లేదు.. ప్రావిడెంట్ ఫండ్ పై లోన్ కావాలంటే, వెంటనే ఇచ్చేవారు. మెడికల్ రీయంబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

ఈ ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిన 31 వేల 572 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లించే అవకాశం లేదు. ఎన్నికల కు ముందు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పాము… చేశామని అంటారని, అయినా ఉద్యోగస్తులు నమ్మే ప్రసక్తే లేదన్నారు.. ఉద్యోగస్తులను దారుణంగా మోసం చేసిన ఈ ప్రభుత్వ కల్లబొల్లి కబుర్లను నమ్మేవారు ఎవరన్నా ఉంటే నమ్ముతారేమో కానీ ఉద్యోగస్తులు మాత్రం నమ్మరు.. ఈ ప్రభుత్వాన్ని ఏమి చేస్తారో నన్న భయంతో ఎన్నికల ప్రక్రియకు టీచర్లను దూరంగా పెట్టాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.

ఉపాధ్యాయులను కాకుండా వాలంటీర్లను పెడతారా అని ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు ఎన్నికల ప్రక్రియ ఉపాధ్యాయులతోనే సజావుగా సాగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించి, పోలీస్ ఆక్ట్ 30ని అమలు చేసి ఈ ప్రభుత్వం శునకానందం పొందుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా, కేవలం ఉద్యోగ సంఘాల నాయకులను మేనేజ్ చేస్తే సరిపోతుందనుకుంటే, అంతకంటే అజ్ఞానం మరొకటి లేదు.

రిటైర్డ్ టీచర్లకు పెన్షన్లు ఇవ్వడం లేదు. ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. వారంతా రోడ్ ఎక్కితే పరిస్థితి ఎలా ఉంటుంది. అయినా ఇప్పుడు సరి చేసుకోవాలని భావించిన ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు. అంతా మనమే భోంచేస్తే, ఇక డబ్బులు ఎక్కడ ఉంటాయని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టిన ఈ ప్రభుత్వానికి, వారు ఖచ్చితంగా తులసి తీర్థం పోస్తారని అన్నారు.

10 నుంచి 20% కమిషన్ ఇచ్చిన వారికే బిల్లులు ఇచ్చారట
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారయిందని రాష్ట్రమంత్రి వేణుగోపాల్ పేర్కొన్నారని, మంత్రి కే అలా అనిపిస్తే ఇక సామాన్యుడి సంగతి ఏంటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. రోడ్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లకు 200 కోట్ల రూపాయలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో 10 నుంచి 20% కమిషన్ చెల్లించిన వారి పేర్లను ఒక మహిళ ప్రతిపాదించగా, ప్రభుత్వంలోని మరొక కీలక వ్యక్తి, కెవివి సత్యనారాయణ అనే అధికారికి రికమండ్ చేశారు. కమిషన్లు చెల్లించిన వారికే బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది.

ముందు పని చేసిన వారికి ముందుగా బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరినప్పటికీ, అలా కాకుండా కమిషన్ కొట్టు పేమెంటు పట్టు అనే పద్ధతిలో బిల్లులు ఇవ్వడంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొంటున్నారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం సి ఎఫ్ ఎం ఎస్ వెబ్ సైట్ ను మూసివేసింది. ఇది నేను బహిరంగంగా చేస్తున్న ఆరోపణ… ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ 200 కోట్ల రూపాయలను ఎవరెవరికి చెల్లించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్మించింది శాశ్వత భవనాలే

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్మించింది శాశ్వత భవనాలే. రాష్ట్ర సచివాలయ భవనాన్ని అంతర్జాతీయ స్థాయిలో 44 అంతస్తుల్లో నిర్మించిన తర్వాత, ప్రస్తుత సచివాలయ భవనాన్ని మరొక దానికి వాడుకుంటామని చెప్పారు. కానీ దాన్ని తాత్కాలిక భవనంగా కొంతమంది పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. తాత్కాలిక భవన నిర్మాణానికి అడుగు ఆరువేల రూపాయలు ఖర్చు అయితే, ఋషికొండ పై నిర్మించిన పర్యాటక శాఖ భవనానికి అడుగు 25 వేల రూపాయలు ఖర్చు కాదా అంటూ సాక్షి దినపత్రిక బరితెగించి ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది.

పర్యాటక శాఖ భవనాలన్నీ, రాష్ట్ర ప్రభుత్వ భవనలేనని సాక్షి దినపత్రిక, ప్రభుత్వం తరఫున వివరణ ఇచ్చింది. హోటల్స్, సమావేశం మందిరాలు కోసం నిర్మించిన టూరిజం శాఖ భవనాలను చిన్న చిన్న మార్పులతో ముఖ్యమంత్రి నివాస యోగ్యంగా మార్చుకుంటే తప్పేమిటని ప్రశ్నించింది. కార్పొరేషన్ ఆస్తులు ప్రభుత్వానివి అయినప్పుడు, అప్పులు కూడా ప్రభుత్వానివే అవుతాయని రఘురామ కృష్ణంరాజు అన్నారు. టూరిజం శాఖ ఆస్తి ప్రభుత్వానిదేనని పేర్కొన్నప్పుడు, కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులన్నీ ప్రభుత్వానివేనని అంగీకరించాలి. కార్పొరేషన్ల పేరిట చేసిన రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు ప్రభుత్వ అప్పులు గానే పరిగణిస్తున్నామని పేర్కొంటూ పత్రికా ప్రకటన విడుదల చేయాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.

ఋషికొండపై నిర్మించిన అక్రమ భవనంలోకి జగన్మోహన్ రెడ్డిని అడుగుపెట్టనివ్వం. ఒక వేళ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కమిటీ ఆయనకు ఋషికొండ భవనం నివాసయోగ్యమని ప్రతిపాదించిన విలువల కోసం నేను అంగీకరించననే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డికి తీసుకువస్తాం. హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడిన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. అంతేకానీ జగన్ మోహన్ రెడ్డిని ఋషికొండపై నిర్మించిన భవనంలో అడుగుపెట్టనిచ్చేదే లేదు. కార్పొరేషన్ ఆస్తులు ప్రభుత్వానివి అయినప్పుడు, అప్పులు మాత్రం ప్రభుత్వానికి కాకుండా పోతాయా అంటూ, ఈ ద్వంద నీతి ఏమిటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

సీట్ల సర్దుబాటు కోసం సమావేశం… హర్షణీయం
తెలుగుదేశం , జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కోసం ఇరుపక్షాల నుంచి ఐదేసి మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమని రఘురామకృష్ణంరాజు అన్నారు. సీట్ల సర్దుబాటు కోసం రెండు పార్టీల నాయకులు సమావేశమై మాట్లాడుకోవడం మా పార్టీ నాయకత్వానికి ఆశనీపాతం. ఈ సంఘటనను మా పార్టీ పెద్ద రెడ్లు ఊహించి ఉండరు. దీనితో, మా పార్టీకి చెందిన కాపు నాయకులతో పవన్ కళ్యాణ్ ను, కమ్మ, ఇతర నాయకులతో లోకేష్ ను తిట్టిస్తారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

జైలులో ఉన్న నారా చంద్రబాబు నాయుడుకి ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి విషం కలిపే అవకాశం ఉందని వైకాపా నేతలు ప్రచారం చేయడం… అనేక అనుమానాలకు తావిస్తోందని లోకేష్ అన్నారు. ప్రభుత్వ పెద్దలు విష ప్రయోగం చేసే అవకాశాలు ఉన్నాయని నేను కూడా గతంలో హెచ్చరించాను. ఇప్పుడు లోకేష్ కూడా అదే విషయాన్ని చెబుతున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు.

వైద్యుల నివేదిక ఆధారంగా చంద్రబాబుకు బెయిల్
వెకేషన్ బెంచ్ లో వైద్యుల నివేదిక ఆధారంగా తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుకి బెయిల్ లభించే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యుల నివేదిక అందజేయాలని వెకేషన్ బెంచ్ కోరితే అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేరని, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కు తలపోటుగా ఉందని చెబితే, ప్రాసిక్యూషన్ తరపు వాదనలు వినవలసిన అవసరమే లేదు. వైద్యుల నివేదిక ఆధారంగా చంద్రబాబు నాయుడుకు తక్షణమే రెండు వారాల బెయిల్ మంజూరు చేయడం ఖాయం.

స్కిల్ డెవలప్మెంట్ కేసు పై నవంబర్ ఏడవ తేదీలోగా తీర్పు వెల్లడిస్తామని సుప్రీం కోర్టు ప్రకటించిన నేపథ్యంలో, ప్రజాస్వామ్యవాదులందరూ దసరా పండుగ సందర్భంగా రాజకీయ రాక్షసుల మర్దనం జరగాలని కోరుకోవాలన్నారు.. పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు రఘురామకృష్ణం రాజు నివాళులు అర్పించారు. అధికారంలో ఉన్నవారు చెప్పిన మాటలు విని కొంతమంది పోలీసులు తప్పుడు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేయడం ఏమిటంటూ మండిపడ్డారు. న్యాయస్థానాలలో ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చాయని జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానాలంటే గౌరవం పెరిగినట్లుగా ఉంది.

కానీ గత మూడు రోజులుగా న్యాయస్థానాలలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. మార్గదర్శిపై యూరి రెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి దాఖలు చేసిన కేసులో న్యాయమూర్తి చివాట్లు పెట్టారు. 8 వారాల వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. మార్గదర్శి అకౌంట్లను ఫ్రీజ్ చేయడాన్ని న్యాయమూర్తి తప్పు పట్టారు. ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ రిస్ట్రిక్ట్ చేయడాన్ని కూడా న్యాయస్థానాలు తప్పు పట్టాయి. దీనితో, న్యాయస్థానాలను, న్యాయమూర్తులను గతంలో తిట్టిచ్చినట్లుగానే జగన్మోహన్ రెడ్డి తిట్టిస్తారా అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

అన్ని పనులకు టెండర్లు పిలవడం కుదరదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై రఘురామకృష్ణం రాజు స్పందిస్తూ నోట్ బుక్ పంపిణి కి కూడా టెండర్లు ఉండవా అంటూ నిలదీశారు. మార్కెట్లో 83 వేలకు టన్ను పేపర్ లభిస్తుండగా, లక్ష 20 వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నామని చెప్పి, అడ్డంగా దోచుకుంటున్న వైనం పై విచారణ జరిపిస్తే బాగుంటుందన్నారు. మధ్య నిషేధం లో భాగంగా రాష్ట్రంలో 1000 మద్యం దుకాణాలను ఎత్తివేసినట్టుగా ప్రభుత్వం చేసిన ప్రకటన శుద్ధ అబద్ధం. 1000 మద్యం దుకాణాల స్థానంలో, అంతే సంఖ్యలో వాకింగ్ స్టోర్ లను ఏర్పాటు చేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

LEAVE A RESPONSE