– 22ఎ జాబితాలో రైతుల భూములను చేర్చి ఇబ్బందులకు గురి చేశారు
– భూ దోపిడీకి చెక్ పెట్టిన కూటమి ప్రభుత్వం
– ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేసి ప్రజల భూములకు రక్షణ కల్పించాం
– రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం
– మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి : జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ప్రజల భూములకు పూర్తిగా భద్రతే లేకుండా పోయింది. భూ రికార్డులను తారుమారు చేసి వేల ఎకరాల రైతుల భూములను కబ్జా చేశారు. ప్రైవేట్ భూములను 22ఎ జాబితాలో చేర్చి లావాదేవీలను అడ్డుకున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. భూమి ఉన్న రైతే తన భూమిని అమ్మలేని, కొనలేని, అభివృద్ధి చేయలేని దుస్థితిని వైసీపీ ప్రభుత్వం సృష్టించింది. ఒకవైపు ఇడుపులపాయలో అసైన్డ్ భూములను కబ్జా చేస్తూనే మరోవైపు తాడేపల్లిలో బలహీన వర్గాలకు చెందిన భూములను లాక్కున్న పెత్తందారుడిగా జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయాడు.
ఆంగ్లేయులు దేశాన్ని దోచుకుంటే.. రెవెన్యూ సంస్కరణల పేరుతో ప్రజల భూములను జే గ్యాంగ్ దోచుకుంది. ప్రజల భూములను వారి ప్రమేయం లేకుండా వారికి ఇష్టమొచ్చిన వారి పేర్లు మీద మార్చుకునేలా భయంకరమైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను తీసుకొచ్చారు. జాయింట్ ఎల్పిఎం పేరుతో రైతులపై లక్షల రూపాయిల భారం మోపి ఆర్థికంగా నాశనం చేశారు. పాస్ పుస్తకాలపై ఉన్న రాజముద్రను తీసేసి జగన్ బొమ్మను ముద్రించనట్లే రైతుల పేర్లు మార్చి వైసీపీ నేతల పేర్లు ఎక్కించుకొని రైతులను రోడ్డున పడేశారు. బొమ్మల పిచ్చితో రూ.750 కోట్ల ప్రజాధనాన్ని జగన్ రెడ్డి వృథా చేశారు.
ఈ భూ దోపిడీ పాలనకు ముగింపు పలికింది కూటమి ప్రభుత్వం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను పూర్తిగా రద్దు చేసి ప్రజల భూములకు చట్టపరమైన రక్షణ కల్పించింది. ప్రైవేట్ భూములను 22ఎ జాబితాలో చేర్చకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జాయింట్ ఎల్పిఎంను రద్దు చేసి రైతులపై వేసిన భారాన్ని తొలగించింది. రైతులకు తిరిగి రాజముద్ర ఉన్న పాస్ పుస్తకాలను పంపిణీ చేశాం.
జగన్ హయాంలో రీ-సర్వే పేరిట 6,688 గ్రామాల్లో జరిగిన అక్రమాలపై వచ్చిన వేలాది ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భూమి అంటే రైతుకు జీవనం, భూమి అంటే బడుగు బలహీన వర్గాల బిడ్డల భవిష్యత్తు. ఆ భవిష్యత్తును కాపాడేందుకు ప్రజల పక్షాన నిలబడేది కూటమి ప్రభుత్వం మాత్రమే. భూ భద్రత, రైతు హక్కులు, ప్రజల ఆస్తుల రక్షణ ఇవే మా లక్ష్యమని మంత్రి అన్నారు