Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ ది హత్యా రాజకీయాల పాలన

-జగన్‌..వైఎస్సార్‌ వారసుడు కానే కాదు
-ఆయనతో ఏ అంశంలో పోలికే లేదు
-బాబాయిని చంపిన నిందితులకు రక్షణ
-రైతులను ముంచిన ప్రభుత్వం
-సబ్సిడీలను బంద్‌ చేసింది
-మద్య నిషేధమని ప్రభుత్వమే అమ్ముతోంది
-కల్తీ మద్యంతో ప్రాణాలు తీస్తున్నారు
-జాబ్‌ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ అంటూ మోసగించారు
-పీసీసీ చీఫ్‌, కడప పార్లమెంట్‌ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి

వైఎస్సార్‌ వారసుడుగా జగన్‌ ఆయన ఆశయాలు నిలబెడతారు అనుకున్నాడు.. నాతో పాటు రాష్ట్ర ప్రజలు నమ్మారు..ప్రజలు ఆలోచన చేయాలి..జగన్‌ వైఎస్సార్‌ ఆశయాలు నిలబెడు తున్నాడా? ఆయన వైఎస్సార్‌ వారసుడు కానే కాదు అంటూ పీసీసీ చీఫ్‌, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠంలో ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. వైఎస్సార్‌తో జగన్‌కు పోలికే లేదని, జగన్‌ది హత్యా రాజకీయాల పాలన అని విమర్శించారు. వైఎస్సార్‌ రైతుల పక్షపాతి.. రుణమాఫీ చేశాడు..మద్దతు ధర ఇచ్చాడు.. పండిన పంట నష్టపోతే ఎక్కువ పరిహారం ఇచ్చాడు..జగన్‌ పాలనలో రైతు తీవ్రంగా నష్టపోయాడు.. ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి మోసం చేశాడు.. మొత్తం సబ్సిడీలను బంద్‌ పెట్టారు.. కనీసం డ్రిప్‌ వేసుకోవడానికి కూడా సబ్సిడీ లేదు.. రైతులను జగన్‌ ప్రభుత్వం నిండా ముంచిందని ఆరోపించారు.

కల్తీ మద్యంతో ప్రాణాలు తీస్తున్నారు
మేనిఫెస్టో అంటే నాకు భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ అని చెప్పుకుంటున్న జగన్‌ మద్యనిషేధం అని హామీ ఇచ్చాడు..దాన్ని పక్కన పెట్టి ప్రభుత్వమే ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతోంది.. కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు..మద్యం అమ్మకాల్లో లెక్క, పత్రం లేదని షర్మిల విమర్శించారు.

జాబ్‌ క్యాలెండర్‌ లేదు..మెగా డీఎస్సీ లేదు
వైఎస్సార్‌ హయాంలో పెద్దఎత్తున నోటిఫికేషన్లు ఇచ్చారు.. జంబో డీఎస్సీ ఇచ్చారు.. జగన్‌ ఎన్నికల్లో 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని హామీ ఇచ్చాడు..మెగా డీఎస్సీ వేస్తా అన్నాడు..నాలుగున్నరేళ్లలో ముష్టి 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి మోసగించాడని అన్నారు.

హత్యా రాజకీయాల పాలన
జగన్‌ పాలన హత్యా రాజకీయాలు చేసే పాలన.. సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతు..అవినాష్‌రెడ్డికి హత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నా వెంట పెట్టుకుని సీట్‌ ఇచ్చాడు.. నిందితుడు అవినాష్‌ రెడ్డి చట్టసభల్లోకి మళ్లీ వెళ్లకూడదనే నేడు ఎంపీగా పోటీ చేస్తున్నా.. న్యాయం ధర్మం ఒకవైపు…అధర్మం, హంతకులు ఒకవైపు.. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఆలోచన చేయాలి.. హంతకులకు ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు.

న్యాయం కోసం పోరాటం: సునీతారెడ్డి
వివేకా కుమార్తె సునీతారెడ్డి మాట్లాడుతూ ఆడది అంటే ఒక నారీ శక్తి.. మమ్మల్ని అలానే పెంచారు..తప్పు అంటే తప్పు అని చెప్పే మనస్తత్వం మాది..వివేకాను హత్య చేసి మమ్మల్ని రోడ్ల పాలు చేశారు..వివేకా హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసు..న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం.. షర్మిలను ఎంపీగా చూడాలని వివేకా కోరిక..ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE