– బతికుండే వారూ సిగ్గుపడేవారు
– జగన్ సర్కారుపై దళితులు తిరుగుబాటు చేయాలి
– ఎమ్మెల్యే స్వామిపై దాడి అనాగరికం
– దాడిపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాలి
– టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఖండన
రాష్ట్రంలో జగన్ పాలన హిట్లర్, నాజీల కంటే ఘోరంగా ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వారిద్దరూ బతికిఉండే వారు కూడా జగన్ పాలన చూసి సిగ్గుపడేవారని వ్యాఖ్యానించారు. కొండేపి ఎమ్మెల్యే స్వామిని అప్రజాస్వామ్య పద్ధతిలో అరెస్టు చేయడాన్ని కన్నా ఖండించారు. దళిత ఎమ్మెల్యే అని కూడా చూడకుండా, జగన్ ప్రభుత్వం ఆయన అరెస్టు చేసిన తీరును దళితులు గమనించాలని కోరారు.
జగన్ ప్రభుత్వం ఇందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంపై జగన్‌కు నమ్మకం లేదని, గుండాయిజం,రౌడీ యిజంపైనే జగన్ ఆధారపడి, ప్రత్యర్ధులపై దాడి చేస్తుందనడానికి ఈ ఘటన మరో నిదర్శనమన్నారు. దళితులు జగన్ సర్కారుపై తిరుగుబాటు చేయాలని కన్నా పిలుపునిచ్చారు. దీనిపై వైసీపీలోని దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్వామికి ప్రజలు దన్నుగా నిలవాలని కన్నా పిలుపునిచ్చారు.