– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
నెల్లూరు: ప్రసన్న లాంటి విలువలు లేని నాయకులను సమర్థిస్తున్న జగన్మోహన్ మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే మరో 30 ఏళ్ళ పాటు వైసీపీ అధికారంలోనికి వచ్చే అవకాశమే లేదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నెల్లూరు మాగుంట లే ఔట్ లోని ఆమె నివాసంలో గురువారం మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పై నిప్పులు చెరిగారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి నిజాయతీగా వ్యాపారాలు చేసే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని విమర్శిస్తావా అంటూ సూటిగా ప్రశ్నించారు.
మహిళలను కించపరుస్తూ సంస్కార రహిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్నలాంటి వారిని పరామర్శించి సమాజానికి ఏం సందేశమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర్థయాత్రలు చూశాం… జైత్రయాత్రలు, విజయయాత్రలు చూశాం.. దండయాత్రలు, ఓదార్పు యాత్రలు లాంటివి కూడా చూశాం… ఈ జైలు యాత్రాలేంటని ఆమె జగన్ పై ఛలోక్తులు విసిరారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి తెలిసి కూడా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి విపిఆర్ ని విమర్శించడం భావ్యమా అంటూ నిలదీశారు. శాంతి భద్రతలు కాపాడే పోలీసులను అనవసరంగా ఆడి పోసుకుంటున్నారని ఆమె విమర్శించారు. అనిల్, ప్రసన్న లాంటి వారి వల్లే జిల్లాలో వైసీపీ తుడిచి పెట్టుకుపోయిందన్నారు. ప్రజలు ఛీ కొట్టి 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీ నేతల బుద్ధి మారడం లేదన్నారు. ప్రసన్నను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ తల్లో, చెల్లో, ఆవిడో రాజకీయాల్లో ఉంటే, వాళ్లపై ప్రత్యర్థులు నీలా నోరుపారేసుకుంటే నువ్వు ఊరుకుంటావా అంటూ తన ఆవేదన వెళ్లగక్కారు.