– కోడెలకు ఓ న్యాయం, జగన్కు మరో న్యాయమా?
– తెలుగుదేశం అధికార ప్రతినిధి జీవీ రెడ్డి
అమరావతి: స్పీకర్ గా నాడు తాను వాడుకున్న ఫర్నిచర్ తీసుకెళ్లామని కోడెల కోరితే, ఆయన్ని దొంగ అన్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు ఫర్నిచర్ వాడుకున్న జగన్ ను ఎమనాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫర్నిచర్ తీసుకెళ్లండి కోడెల శాసనసభ కు రాసిన లేఖ కూడా ఉందని గుర్తుచేశారు. జగన్ మోహన్ రెడ్డి వాడుకున్న ఫర్నీచర్ కు విలువ కడితే చెల్లిస్తాం అని ఇప్పుడు వైఎస్సార్సీపీ అంటోందని మండిపడ్డారు.
జగన్ ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్ ను సరెండర్ చేయకుండా వైఎస్సార్సీపీ నేతలు నీతులు చెప్పడం సిగ్గుచేటని రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ ధ్వజమెత్తారు. జగన్ ఫర్నిచర్ దొంగ అని విమర్శించారు. గతంలో ఫర్నీచర్ విషయంలో కోడెల శివప్రసాద్ పై అసత్య ఆరోపణలు చేసిన వైఎస్సార్సీపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు.
చేయని తప్పుకు నాడు కోడెల శివప్రసాదరావును బలితీసుకున్నారని.., కోడెలది ఆత్మహత్య కాదని.. వైఎస్సార్సీపీ నేతలు చేసిన హత్య అని మండిపడ్డారు. ఫర్నిచర్ తీసుకెళ్లమని అప్పటి స్పీకర్ కు రెండు సార్లు కోడెల శివప్రసాద్ లేఖలు రాసినా పట్టించుకోకుండా తప్పుడు కేసులు పెట్టడం కక్ష సాధింపు చర్య కాదా అని నిలదీశారు. తాడేపల్లి, లోటస్ పాండ్ ఇళ్లకు 50 కోట్లు సీఎంవో ఖాతాలోవి తీసుకువచ్చి ఫర్నిచర్, ఇతర వసతుల ను తన నివాసంలో అమర్చుకున్నారని ఆరోపించారు.
ఆ ఫర్నిచర్ ను తిరిగి అప్పగిస్తానని ప్రతిపక్ష నేత జగన్ ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదని దుయ్యబట్టారు. ప్రజలు జగన్ దొంగ బుద్ధి చూసి నేడు ఛీ కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఈ అరాచకాలపై చర్చ జరగాలన్నారు. జగన్ కి ఏ మాత్రం నైతిక విలువలున్నా ప్రభుత్వ సొమ్ముతో తన ఇంట్లోకి కొనుగోలు చేసిన ఫర్నిచర్ని ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై అక్రమంగా ఫర్నీచర్స్ కేసులు బనాయించి వేధింపులకు గురిచేసిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీచౌదరి ఆరోపించారు. తద్వారా ఆయన ఆత్మహత్య చేసుకునేలా జగన్మోహనరెడ్డి చేశారని దుయ్యబట్టారు.
ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించిందని, ఇప్పటివరకూ వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తన క్యాంపు కార్యాలయ లో పెట్టుకున్న ప్రభుత్వ ఫర్నీచర్స్ను అప్పగించలేదన్నారు. దానిపై గతంలో కోడెలపై బనాయించిన కేసులను ప్రస్తుతం జగన్మోహనరెడ్డి పై బానాయించాలని బాజీచౌదరి డిమాండ్ చేశారు.