– సర్కారుపై అప్పుడే జ‘గన్’ పేలిస్తే ఎలా?
– ఆరునెలల గడువు ఇవ్వాలని సీనియర్ల సూచన
– ఇప్పుడే విమర్శిస్తే ప్రజలు హర్షించరన్న వాదన
– ఇది తమ గత పాలనను తిట్టించుకోవడమేనంటున్న సీనియర్లు
– తమ హయాంలో పథకాలు ఎప్పుడించామని ప్రశ్న
– కూటమి సర్కారుపై విమర్శలకు వైకాపా నేతల విముఖత
– పార్టీ ఆఫీసు ఫోన్లకు పలకని సీనియర్ నేతలు
– దొరికిన నాయకులతోనే ప్రెస్మీట్లు
– రెండునెలల్లోనే విమర్శలెందుకంటున్న సీనియర్లు
– రివర్సయిన విజయసాయి కమ్మ కులాస్త్రం
– దానితో బయటకొచ్చిన రెడ్లజాబితా
– బూమెరాంగయిన రజని ఆరోగ్యశ్రీ అస్త్రం
– వైసీపీ హయాంలోనే బిల్లుల బకాయిలంటూ సొంత పార్టీ మీడియాలో కథనం
– సొంత మీడియా జర్నలిస్టులపైనా ఒత్తిడి
– ఇసుక, మైనింగ్‌పై వ్యతిరేక కథనాలు రాయాలంటూ ఒత్తిళ్లు
– దానిపై మళ్లీ మీడియాకెక్కాలంటూ వైసీపీ నేతలకు ఆదేశాలు
– పని మొదలవుతేనే కదా ఫలితాలంటున్న వైసీపీ నేతలు
– తల పట్టుకుంటున్న వైసీపీ- మీడియా బృందాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎవరైనా అన్నప్రాసనరోజే ఆవకాయ తినిపిస్తారా?.. మామూలుగా అయితే బుద్ధి-బుర్ర ఉన్న వారెవరూ ఆపని చేయరు. ఆవిధంగా ఎవరైనా పిచ్చిప్రయత్నం చేసిన వారిని తింగరోళ్లని అంటారు. అలాంటి తింగరితనం రాజకీయాల్లో కూడా ఈమధ్య కాలంలో కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి రెండునెలలు కూడా కాని ప్రభుత్వంపై అప్పుడే జ‘గన్’ పేలిస్తే ఏమవుతుంది? అది గురి తప్పి, మళ్లీ వారికే తగులుతుంది. ఇప్పుడు వైసీపీ శిబిరంలో పేలుతున్న జ‘గన్’ కూడా గురితప్పి.. బూమెరాంగయి, మాట్లాడేందుకు నేతలు కూడా దొరక్క పారిపోతున్న వైచిత్రి దర్శనమిస్తోంది.
వైసీపీ గద్దె కూలి, దానిపై కూటమి కూర్చుని ఇంకా రెండు నెలలు కూడా పూర్తికాలేదు. ఇంకా ఆ ప్రభుత్వం కుదురుకోలేదు. చీఫ్ విప్, విప్, సీపీఆర్వో లాంటి కీలక పదవులు కూడా భర్తీ చేసుకోలేదు. ఇప్పుడే డీఎస్పీ బదిలీలు తొలి దశ అయింది. ఇంకా సీఐ, ఎస్ఐ, అడిషనల్ ఎస్పీల బదిలీలు కాలేదు. ఈలోగా కూటమి ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ వైసీపీ శిబిరం నుంచి వస్తున్న విమర్శలు, సొంత పార్టీ సీనియర్లకే రుచించడం లేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కనీసం ఆరునెలల సమయం ఇచ్చిన తర్వాత, దాడిచేయడం సమంజసంగా ఉంటుందన్నది మెజారిటీ వైసీపీ సీనియర్ల వాదన. అందుకు భిన్నంగా అధికారంలోకి వచ్చిన వారం రోజుల నుంచే విమర్శలు ఎక్కుపెడితే, అభాసుపాలవుతామన్నది వారి ఆందోళన.
— Team Lokesh (@Srinu_LokeshIst) July 31, 2024
‘‘వాళ్లకు కనీసం ఆర్నెలు సమయం ఇవ్వాలి. ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలపై మనం దాడి చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. అలా కాకుండా ఇప్పటినుంచే విమర్శించాలని మాకు ఫోన్లు చేస్తే మేం ఎలా మాట్లాడతాం? ఏమని మాట్లాడతాం? వాళ్లను తప్పులు చేసే వరకూ మనం ఓపికపట్టాలి కదా? ఏదైనా పని మొదలైతే కదా అందులో లోపం ఏమిటి? అవినీతి ఎక్కడ జరుగుతుందని తెలిసేది?’’ అని ఒక మాజీ మంత్రి విశ్లేషించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తామిచ్చిన హామీలన్నీ ఒకేసారి అమలు చేశామా? ఇప్పుడు మేం వారిని హామీల గురించి ప్రశ్తిస్తే, వారి ఎదురుదాడికి మేం ముఖం ఎక్కడ పెట్టుకోవాలని వాదిస్తున్నారు.
ఇసుక, మైనింగ్, ఆరోగ్యశ్రీ అంశాలపై మాట్లాడాలంటూ పార్టీ ఆఫీసు నుంచి వస్తున్న ఫోన్లను సీనియర్లు పట్టించుకోవడం మానేశారట. స్థానికంగా ప్రజల నుంచి ఇంకా వ్యతిరేకత రానంతవరకూ, తాము ఏం చేసినా ఉపయోగం లేదన్నది వారి వాదన. కూటమి సర్కారు కచ్చితంగా తప్పులు చేస్తుందని, అప్పటిదాకా విమర్శించకుండా పాలనను పరిశీలించాలంటున్నారు. ‘ మా నాయకుడికి ఉన్నంత బాధ , తొందర ప్రజలకు ఎందుకుంటుంది? వాళ్లకు కడుపులో మండినప్పుడు వాళ్లే బయటకొస్తారు. మేం రమ్మంటే వాళ్లెందుకు వస్తార’ని ఓ మాజీ మహిళా ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
‘కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎట్టిపరిస్థితిలోనూ నెరవేర్చదు. కొద్దిరోజుల్లో రేషన్‌కార్డులు, పెన్షన్లు అన్నీ తొలగించి మళ్లీ కొత్తవి ఇచ్చే క్రమంలో ప్రజావ్యతిరేకత మొదలవుతుంది. వైన్స్, బార్లు మొదలయిన తర్వాత మహిళల్లో వ్యతిరేకత ప్రారంభమవుతుంది. పేదలకు రెండు సెంట్ల భూమి ఎలా ఇస్తారో చూడాలి. ఉద్యోగుల రిటైర్మెంట్ డబ్బులివ్వాలి. కాంట్రాక్టర్లను పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే రోడ్లు వేయరు. జనం ముందు చూసేది రోడ్లనే. ఇవ్వాళకాకపోయినా అన్ని పన్నులు పెంచాల్సిందే. అప్పుడు ఎలాగూ వ్యతిరేకత మొదలవుతుంది. ఇలా ఇంకా చాలా అంశాలున్నాయి. వాటిపై కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని ఆరునెలల వరకూ ఎదురుచూడకుండా, ఏదో ఒకటి మాట్లాడమంటే మేమెందుకు మాట్లాడతాం? మాకు పబ్లిక్పల్స్ తెలియకుండానే ఇన్నిసార్లు ఎమ్మెల్యే, మంత్రులమయ్యామా?’’ అని కోస్తాకు చెందిన ఓ మాజీ మంత్రి ప్రశ్నించారు.
ఇటీవల తమ పార్టీ ఎంపి విజయసాయిరెడ్డి, కమ్మకులంపై చేసిన ట్వీట్ బూమెరాంగయి..చివరకు జగన్‌ను తిట్టించేలా చేసిందని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. తమ హయాంలో మొత్తం రెడ్లతో నింపేసి.. ఇప్పుడు టీటీడీ అడిషనల్ ఈఓ ఒకరిని కమ్మ అధికారిని నియమిస్తే, ట్వీట్ చేసి అభాసుపాలయ్యామంటున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ బిల్లులపై మాజీ మంత్రి రజనితో మాట్లాడించి, చిక్కుల్లో పడటం ఎందుకంటున్నారు. తమ ప్రభుత్వమే నెట్వర్క్ ఆసుపత్రులకు, వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టిన విషయం ప్రజలకు తెలియదా? మన హయాంలోనే కదా ఆసుపత్రుల అసోసియేషన్ ఆందోళనకు నోటీసీలిచ్చింది? అసలు ఆ వార్త సాక్షిలో రాయకపోతే నిజాలు తెలిసేవి కావు. సాక్షిలో రాయడంతో మన ప్రభత్వమే బిల్లులు ఎగ్గొట్టిందని చెప్పడమే కదా? ఇంతగా వ్యూహం లేకుండా పార్టీ ఎలా నడుపుతున్నారో అర్ధం కావడం లేదని రాయలసీమకు చె ందిన ఓ మాజీ ఎంపి విస్మయం వ్యక్తం చేశారు.
తమ పార్టీ వ్యూహలేమికి ఇటీవలి ఢిల్లీ ధర్నానే నిదర్శనమంటున్నారు. రాష్ట్రంలో 32 హత్యలు జరిగాయి కాబట్టి రాష్ట్రపతిపాలన విధించాలన్న డిమాండ్, పార్టీ పరువుతీసిందని గుర్తు చేస్తున్నారు. అసలు 90 శాతం మెజారిటీతో గెలిచిన ఒక ప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధించాలని ఎవరైనా డిమాండ్ చేస్తారా? అసలు కనీసం ఢిల్లీ ధర్నా అజెడా ఏమిటన్నది మా లాంటి సీనియర్లతో చర్చించారా? అని ఓ సీనియర్ ఎమ్మెల్సీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
గతంలో ఇదే టీడీపీ ప్రతిపక్షంగా ఉండగా ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు, మృతుల ఫొటోలతో ఎగ్గిబిషన్ పెట్టిన వైనాన్ని గుర్తు చేసింది. ‘మేం ఆ 32 మంది మృతుల ఫొటోలు కూడా పెట్టుకోలేదంటే, జనం అనుమానించడం సహజమే కదా? అందుకే కదా వారి పేర్లు చెప్పాలని జాతీయ మీడియా మా అధ్యక్షుడిని ప్రశ్నించింది’ అని గుర్తు చేశారు.
ఇక వైసీపీ అధికార మీడియాలో పనిచేసే ఉద్యోగులది మరో గోస. ఆయా జిల్లాల్లో ఇసుక, మైనింగ్ అక్రమాలపై రోజుకొక కథనంతోపాటు, ప్రజల అభిప్రాయాలతో కథనాలు వండివార్చాలంటూ వస్తున్న ఒత్తిళ్లకు, జర్నలిస్టులు హడ లిపోతున్నారు.
ఇటీవలి ఇసుక పాలసీకి ముందు.. అంటే ప్రభుత్వం మారిన తర్వాత, చాలా జిల్లాల్లో స్టాకులో ఉన్న ఇసుకను మంత్రులు-ఎమ్మెల్యేలు-నియోజకవర్గ ఇన్చార్జిలు ఊడ్చేశారన్న ఆరోపణలొచ్చాయి. నెల్లూరులో కీలక పదవిలో ఉన్న ఓ ప్రముఖుడు 3 కోట్లకు, కాకినాడ జిల్లాలో 13 కోట్లకు ఇసుక అమ్ముకున్నారన్న విమర్శలు వచ్చాయి.
ఆ తర్వాత పాలసీ రావడంతో, రవాణా ఖర్చులు భరించి ఇసుకు తీసుకువెళ్లే విధానం అమలవుతోంది. అయితే దానిపై కూడా అక్రమాలు జరుగుతున్నాయన్న కథనాలివ్వాలంటూ, జిల్లా-గ్రామీణ విలేకరులపై వస్తున్న ఒత్తిళ్లకు వారు హడిలిపోతున్న పరిస్థితి. నిజానికి ఈ పద్ధతిలో ఎలాంటి అవినీతి జరగడం లేదని, కాకపోతే రవాణా చార్జీలు ఎక్కువగా ఉన్నాయే తప్ప, అవినీతి లేదని వైసీపీ మీడియా ప్రతినిధులే చెబుతున్నారు. వినియోగదారులు సొంతగా వాహనాలు తెచ్చుకుంటే ఆ చార్జీలు కూడా ఉండవు కదా? అంటున్నారు.
వాటిపై కూడా వ్యతిరేకంగా రాస్తే మేం స్థానికంగా ఎలా ఉండగలుగుతాం? ఎలా మనుగడ సాగిస్తాం? అసలే వైసీపీ మీడియా అంటే ఎవరూ దగ్గరకు రానీయడం లేదు. ఇప్పుడు లేనిది ఉన్నట్లు రాస్తే మేం ఇక స్థానికంగా తిరగగలమా? అన్నది వారి ఆందోళన.
అదేవిధంగా జిల్లా స్థాయిలో మైనింగ్, క్వారీలు ఏ పార్టీ నాయకులు స్వాధీనం చేసుకున్నారన్న కథనాలు.. వారిపై స్థానికుల స్పందన ఇవ్వాలంటూ వస్తున్న ఒత్తిళ్లకు విలేకరులు తలపట్టుకుంటున్నారు. నిజానికి ప్రకాశం జిల్లాలో కడప ఎంపి అవినాష్‌రెడ్డి మామ, మరికొందరు వైసీపీ నేతలే ఇంకా నిర్భయంగా, కేసులు లేకుండా మైనింగ్ చేసుకుంటున్నారన్న అసంతృప్తి టీడీపీ నేతల్లో లేకపోలేదు.