నవ్వుతూ మొదలైన చర్చ, చివరికి కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది. సభలో అంతకుముందు ఆసక్తి చూపని సభ్యులే, చివరికి ఉద్వేగంతో, గర్వంగా చప్పట్లు కొట్టారు. ఇది కేవలం ఒక ప్రసంగం కాదు, ఒక జలతపస్వి కథ. అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేయగలనని నిరూపించిన ఒక నాయకుడి గాథ.
కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంపై ఎంతోమంది ఎగతాళి చేశారు. ముఖ్యంగా పట్టిసీమ ప్రాజెక్టుపై వైకాపా నాయకులు చేసిన వ్యాఖ్యలు, విసిరిన సవాళ్లు అందరికీ గుర్తుండే ఉంటాయి. ‘ఒకే ఏడాదిలో పూర్తి చేస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం’ అని అసెంబ్లీలో సవాల్ విసిరిన రోజులు మరవలేం. కానీ ఆ నాయకుడు, చంద్రబాబు నాయుడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఆయన పట్టుదల, దూరదృష్టి ముందు ఎన్ని అడ్డంకులు వచ్చినా నిలవలేకపోయాయి.
పట్టిసీమ ప్రాజెక్టు కోసం జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతికూల ప్రచారం, రైతులను రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ నిష్ఫలమయ్యాయి. గోదావరి ప్రాంత రైతులు ఆ ప్రాజెక్టు ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. అందుకే ఏ ఒక్కరూ అడ్డుకోలేదు.
గోదావరి నీళ్లు కృష్ణా నదిలోకి చేరినప్పుడు జలహారతులు ఇచ్చారు. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి గుండె ఆనందంతో ఉప్పొంగింది. కానీ ఆ విజయాన్ని ఓర్వలేక, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే పట్టిసీమ పంప్ హౌస్‌కు వాడే సబ్‌స్టేషన్‌ను తగలబెట్టించింది. ఇది కేవలం పగతో చేసిన చర్యే తప్ప మరొకటి కాదు.
పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అదే జరిగింది. ‘రివర్స్ టెండరింగ్’ పేరుతో ఎన్ని నాటకాలు ఆడారో అందరికీ తెలుసు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెడతామని చెప్పడం, కరీఫ్ అంటే ఏటా వస్తుందని తెలవక, అచ్చే కరీఫ్‌లో పోలవరం పూర్తవుతుందని చెప్పడం… ఇవన్నీ కేవలం డ్రామాలే. కానీ ఏ ఒక్క డ్రామా కూడా చివరికి నిలబడలేదు.
మరి, బూచేపల్లి అవ్వ కన్నీళ్లతో ‘ఎప్పుడొస్తావు రాజశేఖర రెడ్డి అన్నా’ అని ఆ వయసులో ఎంతో శ్రావ్యంగా పాడిన పాట ఎంతమందికి తెలుసు? ఆ పాటను విని భావోద్వేగానికి గురైన వారు ఎంతమందో. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆవిడను భారీ కాన్వాయ్‌తో తీసుకువెళ్లడం, సొరంగం నుండి నీళ్లు వదులుతున్నామని గొప్పగా ప్రకటించడం చూసి జనం నవ్వుకున్నారు. కానీ ఆ సొరంగంలో ఇరుక్కుపోయిన యంత్రాన్ని కూడా బయటకు తీయలేకపోయారు.
అయితే, ఇప్పుడు అదే సభలో, అదే ప్రజల ముందు, ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు అందరూ నిశ్శబ్దంగా విన్నారు. ఆయన తన ప్రాంతాల పేర్లను ఒక్కొక్కటిగా చెబుతూ, చివరికి పులివెందుల పేరు చెప్పి ‘నీళ్లు ఇస్తాను’ అని చెప్పినప్పుడు, సభలోని అందరూ ఆశ్చర్యంతో చూశారు. కళ్లలో ఒక అబ్బురం, ఒక మెచ్చుకోలు స్పష్టంగా కనిపించాయి. కుప్పం ప్రజలకు నీరు అందిస్తానని శపథం చేసి, దాన్ని నెరవేర్చినందుకు తన కళ్లలో కనిపించిన తృప్తి, సభలో ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించింది.
ఇది ఒక సినిమా కాదు. ఇది నిజం. రాజకీయ అడ్డంకులను, ఎగతాళిని, నిందలను తట్టుకొని నిలిచిన ఒక నాయకుడి శ్రమ, నిజాయితీ. ఒక ఏడాదిలోనే గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా, శ్రీశైలం నీటిని హంద్రీనీవా ద్వారా తరలించి, చరిత్ర సృష్టించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. కమండలం నుండి తీర్థం ఇచ్చిన ఋషిలా ఆయన కనిపించారు. ఆ దృశ్యాన్ని చూసిన జనం కళ్లు చెమ్మగిల్లాయి.