Suryaa.co.in

Editorial

బీజేపీలో జనసేన విలీనం?

  • సంక్రాంతి తర్వాత ముహుర్తం?

  • పవన్‌కు కేంద్రమంత్రి పదవి?

  • ఏపీ బీజేపీ పగ్గాలూ ఆయనకే?

  • అందుకే అన్నయ్య నాగబాబుకు రాష్ట్రంలో మంత్రి పదవి తీసుకున్నారా?

  • కాకినాడ ఎంపీగా పోటీ? లేదా రాజ్యసభ ఎంపీ?

  • కాకినాడ నుంచి పోటీకే పవన్ సుముఖత?

  • ఎంపి ఉదయ్ శ్రీనివాస్‌కు ముందే సంకేతాలిచ్చారా?

  • సంచలనం సృష్టిస్తున్న బీజేపీ జాతీయ మాజీ నేత పివిఎస్ శర్మ ట్వీట్

  • తొలుత పవన్‌ను మోదీ వద్దకు తీసుకువెళ్లింది శర్మనే

  • ఢిల్లీ నేత శర్మ మన తెలుగువాడే

  • సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిన జనసేన విలీనం టాపిక్

(మార్తి సుబ్రహ్మణ్యం)

జనసేన దళపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నారా? ఆయన రాష్ట్రం నుంచి కేంద్రమంత్రిగా వెళ్లనున్నారా? ఇక ఏపీ బీజేపీ పగ్గాలూ ఆయనకేనా? ఆ మేరకు హోంమంత్రి అమిత్‌షాతో ఒప్పందం జరిగిందా? దీనికి సంక్రాంతి తర్వాత ముహుర్తం నిర్ణయించారా?.. పవన్ కల్యాణ్‌ను తొట్ట తొలుత మోదీ వద్దకు తీసుకువెళ్లి భేటీ వేయించిన, తెలుగువాడైన బీజేపీ మాజీ జాతీయ నేత పివిఎస్ శర్మ తాజాగా చేసిన ట్వీట్ చూస్తే ఇది నిజమనిపించకమానదు.

ఢిల్లీలో కొన్నేళ్ల నుంచి ఉంటున్న పివిఎస్ శర్మ మన తెలుగువాడే. ఆయన బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. మోదీ, అమిత్‌షా, రాంమాధవ్ వంటి అగ్రనేతలతో సత్సంబంధాలున్న నేత. ఒకప్పుడు ఢిల్లీలో ఒక వెలుగువెలిగిన నలుగురైదుగురు తెలుగువారిలో పివిఎస్ శర్మ ఒకరు. పవన్ కల్యాణ్ రాజకీయ అరంగేట్రం సందర్భంలో ఆయనను ప్రధాని మోదీ వద్దకు తీసుకువెళ్లింది ఈ శర్మనే కావడం ప్రస్తావనార్హం. ఆయన చాలాకాలం క్రితమే బీజేపీకి రాజీనామా చేశారు.

అప్పట్లో పవన్‌తోపాటు రాఘవయ్య, సోము వీర్రాజు, ఏఎం రత్నంను కూడా తనతో వెంటబెట్టుకుని వెళ్లింది కూడా ఇదే శర్మ కావడం విశేషం. అలాంటి శర్మ చేసిన ట్వీట్‌ను పక్కనపెట్టలేమన్నది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య. బీజేపీలో జనసేన విలీనం కానున్నట్లు, ఢిల్లీ రాజకీయాల్లో తలపండిన శర్మ చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. పైగా మంచి రోజుల దృష్ట్యా సంక్రాంతి తర్వాత ముహుర్తంగా నిర్ణయించారని శర్మ జోస్యం చెప్పినందున, ఇప్పుడు సోషల్‌మీడియాలో దానిపై సహజంగా ఉత్కంఠకు తెరలేచింది.

శర్మ జోస్యం ప్రకారం.. సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా జనసేన బీజేపీలో విలీనం కానుంది. పవన్ కల్యాణ్‌కు కేంద్రమంత్రి పదవి కూడా ఇచ్చేందుకు, హోంమంత్రి అమిత్‌షా అంగీకరించారట. నిజానికి ఇది శర్మ చెప్పకపోయినా, చాలాకాలం నుంచి జనసేన వర్గాల్లో వినిపిస్తున్న చర్చనే. ఎన్నికలకు ముందు కాకినాడ జనసేన ఎంపి అభ్యర్ధి ఉదయ్ శ్రీనివాస్‌కు టికెట్ ఇచ్చే సందర్భంలోనే.. తాను ఎప్పుడైనా కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని, పవన్ స్పష్టం చేశారన్న చర్చ జనసేన వర్గాల్లో వినిపించిన విషయం తెలిసింది. ఇప్పుడు బీజేపీ మాజీ జాతీయ నేత శర్మ చేసిన ట్వీట్ పరిశీలిస్తే, జనసేనలో జరుగుతున్న చర్చ నిజమేననిపించక తప్పదు. అయితే పవన్ రాజ్యసభకు వెళతారా? లేక కాకినాడ నుంచే పోటీ చేస్తారా అన్నది చూడాలి. ఇప్పట్లో రాజ్యసభ ఎన్నికలు లేనందున, కాకినాడ ఎంపీగానే పోటీ చేస్తారని భావించక తప్పదు.

కాగా పవన్‌కు కేంద్రమంత్రిగా అవకాశం ఇవ్వనున్న బీజేపీ నాయకత్వం.. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర పార్టీ పగ్గాలు కూడా ఆయనకే ఇవ్వాలని నిర్ణయించిందట. పవన్‌తో ఏపీలో కమలాన్ని కదం తొక్కించాలన్నదే కమలదళాల వ్యూహం. బహుశా ఈ కారణంతోనే పవన్ కల్యాణ్ తన సోదరుడు నాగబాబును, మంత్రివర్గంలోకి సిఫార్సు చే సి ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

నిజానికి రాజ్యసభ సీటును పవన్ తన మిత్రుడైన లింగమనేని రమేష్‌కు సిఫార్సు చేశారని, అప్పటికే కాపు సామాజికవర్గానికే చెందిన సాన సతీష్‌కు మాట ఇచ్చినందున.. నాగబాబుకు మంత్రి పదవి అంశం తెరపైకి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆవిధంగా అన్నయ్యను రాష్ట్రమంత్రివర్గంలో ఉంచి, పవన్ కేంద్రంలోకి వెళతారన్న మాట!

LEAVE A RESPONSE