• పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల జనసేన శ్రేణుల నిరసన
• నల్లదుస్తులు, ప్లకార్డులతో ఆందోళన
•పవన్ కళ్యాణ్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
• పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల అరెస్టు
• సంఘీభావంగా పెద్ద ఎత్తున అమలాపురం చేరుకుంటున్న పార్టీ శ్రేణులు
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేష్ కి రాష్ట్రం నలుమూలల జనసేన శ్రేణుల నిరసన సెగలు తాకుతూనే ఉన్నాయి. శుక్రవారం అమలాపురం మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణస్వీకారానికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి హోదాలో హాజరైన జోగి రమేష్ ను జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు నల్లదుస్తులు, గో బ్యాక్ జోగి నినాదాలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఉదయం 10 గంటలకే పెద్ద ఎత్తున స్థానిక గడియారం సెంటర్ కి చేరుకుని నల్లజెండాలు, ప్లకార్డులతో నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. మంత్రి ఎదుటే దిష్టిబొమ్మను తగులబెట్టేందుకు రెడీ అయ్యారు. పిచ్చి కుక్క జోగి.. పిచ్చి పట్టిన జోగి రమేష్.. డౌన్ డౌన్ జోగి రమేష్, పవన్ కళ్యాణ్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
జనసేన నిరసన నేపధ్యంలో అప్రమత్తమైన పోలీసులు మంత్రిని మరో మార్గంలో మళ్లించి… ప్లకార్డులు, నల్ల జెండాలు, జోగి రమేష్ దిష్టిబొమ్మలను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆందోళనకు దిగిన జనసేన కౌన్సిలర్లు వాకపల్లి వెంకటేశ్వరరావు, పడాల నానాజీ, పార్టీ నేతలు లింగోలు పండు, ఆర్.డి.ఎస్. ప్రసాద్, డాక్టర్ నాగమానస, బట్టు పండు, మలికిపురం ఎంపీపీ మేడిచర్ల సత్యవేణి, మలికిపురం మండలానికి చెందిన ఎంపీటీసీలు జక్కంపూడి శ్రీదేవి, పోలిశెట్టి అన్నపూర్ణ తదితర నాయకులతో పాటు 34 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా అరెస్టు చేసి అమలాపురం పోలీస్ స్టేషన్ కి తరలించారు. మంత్రి దిష్టిబొమ్మ కారులో ఉందన్న నెపంతో కారుని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అరెస్టు చేసిన జనసేన నాయకులకు ఉదయం నుంచి ఆహారం కూడా ఇవ్వకుండా స్టేషన్ లోనే ఉంచారు.
అటకాయించి అడ్డుకున్న పోలీసులు.. అక్రమ అరెస్టులపై స్పందన కరవు
అంతకు ముందు నిరసన తెలిపేందుకు వస్తున్న అమలాపురం పురపాలక సంఘం జనసేన ఫ్లోర్ లీడర్ ఏడిద శ్రీను, పార్టీ నేతశ్రీ ఆకుల సూర్యనారాయణ తదితరుల్ని మార్గ మధ్యలో అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి కాట్రేనికోన పోలీస్ స్టేషన్ కి తరలించారు. జనసేన నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి వాహనాల్లో రోడ్ల వెంట తిప్పుతూ ఒక్కొక్కరినీ ఒక్కో స్టేషన్ కి తరలించారు. విషయం తెలుసుకున్న పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, పి.గన్నవరం నియోజకవర్గం నాయకులు శిరిగినీడి వెంకటేశ్వరరావులు అమలాపురం స్టేషన్ కి చేరుకుని అక్రమంగా అరెస్టు చేసిన పార్టీ నేతలను విడుదల చేయాలంటూ డీఎస్పీతో మాట్లాడారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ అక్రమ అరెస్టులపై జిల్లా ఎస్పీతో మాట్లాడారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి స్పందన కరువయ్యింది.
స్టేషన్ ఎదుట శెట్టిబత్తుల రాజబాబు నిరసన
అక్రమంగా అరెస్టు చేసిన జనసేన నాయకులను పోలీసులు సాయంత్రం వరకు విడుదల చేయకపోవడంతో అమలాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. అరెస్టు చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ నినదింవచారు. స్టేషన్ ఎదుట నిరసన తెలియచేస్తున్న రాజబాబుతో పాటు పార్టీ నాయకులు ఆకుల బుజ్జి, పిండి రాజా, చిక్కం భీముడు, గండి స్వామి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని మొదట అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడి నుంచి ముమ్మడివరం వైపు తరలించారు.
జనసేన నాయకులు అక్రమ అరెస్టుల గురించి తెలుసుకున్న కోనసీమ ప్రాంతానికి చెందిన జనసేన శ్రేణులు వారికి సంఘీభావంగా పెద్ద ఎత్తున అమలాపురం చేరుకుంటున్నాయి. కొత్తపేట ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్, రాజోలు, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మడివరం నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అమలాపురం చేరుకున్నారు. దీంతో అమలాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.