– గురి తప్పి తిరిగి వైసీపీకే తగులుతున్న అస్త్రాలు
– వివాదంలో వాసిరెడ్డి పద్మ నోటీసు
– పవన్‌కు నోటీసు ఇచ్చిన మహిళా కమిషన్
– మాధవ్‌ను మర్చిపోయారా మేడమ్ అంటూ విపక్షాల ట్రోలింగ్
– ఎంపీ మాధవ్‌కు నోటీసు ఇచ్చే ధైర్యం లేదా అంటూ ప్రశ్నల వర్షం
– అర్ధగంట, గంట నేతలకు నోటీసులివ్వలేదేం?
– తాడేపల్లి అత్యాచారం ఇంకా తేల్చలేదేం?
– గుంటూరులో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు ఏమైంది?
– ఎన్‌సీఆర్‌బీ నివేదికలతో టీడీపీ-జనసైనికుల విమర్శనాస్త్రాలు
– విడాకులు తీసుకుని పెళ్లి చేసుకోవడం నేరమా?
– మరి షర్మిలకూ నోటీసులిస్తారా అని ఎదురుదాడి
– వేధింపు ఆరోపణలున్న మంత్రులు-ఎమ్మెల్యేలు పుణ్యపురుషులా?
– వాసిరెడ్డి పద్మపై జనసైనికుల ఎదురుదాడి
– విమర్శల చట్రంలో మహిళా హక్కుల కమిషన్
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆంజనేయుడిని చే యబోతే కోతి అయిన సామెత చందంగా.. జనసేనాధిపతి పవన్‌ను ఇరికించబోయి, అధికార వైసీపీ తానే ఇరుక్కున్నట్లయింది. చేతనైతే మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలంటూ.. వైసీపీ నేతలపై ఎదురుదాడి చేసిన జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌కు, ఏపీ మహిళా హక్కుల కమిషన్ నోటీసులివ్వడం వివాదాస్పదంగా మారింది. మూడు పెళ్లిళ్లపై పవన్ చే సిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, అందుకు సంజాయిషీ ఇవ్వాలని పవన్‌కు నోటీసు జారీ చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వల్ల మహిళల మనోభావాలు, ఆత్మగౌరం దెబ్బతిన్నాయంటూ పవన్‌ను ఘాటుగా విమర్శించారు. పెళ్లి చేసుకుని, తర్వాత డబ్బులిచ్చి వదిలించుకుంటామనే ధోరణి, సమాజానికి ప్రమాదకరమని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.
ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రజలకు ఇచ్చే సందేశం ఇదేనా? అని ఆమె జనసేనాధిపతిని నిలదీశారు. పవన్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ ధ్వజమెత్తిన నేపథ్యంలో, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ జనసేనానికి నోటీసు పంపించటం వివాదానికి కారణమయింది.దానితో జనసేన-టీడీపీ జమిలిగా పద్మపై ఎదురుదాడి ప్రారంభించాయి. ఫలితంగా ఆమె జనసైనికుల ట్రోలింగ్, ట్వీట్లను ఎదుర్కొంటున్నారు.
ఈ సందర్భంగా మంత్రులు- వైసీపీ ఎమ్మెల్యేలు- వైసీపీ నేతల చేతిలో అవమానాలకు గురైన మహిళల ఉదంతాన్ని, జనసేన-టీడీపీ మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నాయి. ఇది రాజకీయంగా వైసీపీకి-వ్యక్తిగతంగా మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మకు ఇబ్బందికరంగా మారింది. ప్రధానంగా సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్, తన మొదటి భార్యను బెదిరించి.. విడాకులు తీసుకున్న తర్వాత షర్మిళను పెళ్లిచేసుకోలేదా అంటూ, టీడీపీ-జనసేన ఎదురుదాడి ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఇలాంటి ఆరోపణ-ప్రస్తావనను వైసీపీ వ్యూహబృందం అంచనా వేసి ఉండదు.
మహిళా కమిషన్ తేనెతుట్టెని కదిపింది. మహిళా కమిషన్ లక్ష్యం ఒకటయితే, అది అటు తిరిగి, ఇటు తిరిగి అధికార పార్టీకే తలనొప్పిలా పరిణమించింది. పవన్‌కల్యాణ్ మూడుపెళ్లిళ్ల ముచ్చటపై, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఆయనకు నోటీసు ఇస్తే.. మరి రెండు పెళ్లిళ్లు చేసుకున్న షర్మిలకు ఇవ్వరా? అంటూ జనసేన-టీడీపీ నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు, అధికార శిబిరం నుంచి జవాబు కరవవుతోంది. స్వయంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఇదే ప్రశ్న సంధించడం విశేషం.
మహిళా కమిషన్ నోటీసు ఒక రకంగా.. అధికారపార్టీ నేతల వ్యక్తిగత జీవితాలను మరోసారి తవ్వితీసినట్టయింది. గతంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబుకు సంబంధించి లీకయిన ‘గంట’, ‘అరగంట’ ఆడియోలు మళ్లీ తెరమీదకు చర్చకు వచ్చేందుకు కారణమయింది. నిజానికి ప్రజలు వాటిని చాలాకాలం క్రితమే మర్చిపోయారు. కానీ మహిళా కమిషన్ చైర్మన్ నోటీసు పుణ్యాన మళ్లీ అవి చర్చల్లోకి వచ్చాయి. ఒకరకంగా అవన్నీ పవన్‌కు నోటీసు పుణ్యాన, మళ్లీ అవి తెరపైకొస్తున్నాయి.
అదొక్కటే కాదు.. దాదాపు నెలరోజులు రాష్ట్రాన్ని కుదిపేసి, తెరమరుగయిన ఎంపీ మాధవ్ నగ్న వీడియో వ్యవహారం కూడా, ఇప్పుడు వాసిరెడ్డి పద్మ ఇచ్చిన నోటీసు ఫలితంగా, విపక్షాలకు అస్త్రంగా మారింది. ఒక మహిళకు తన నగ్న వీడియో చూపించి, మహిళల మనోభావాలు దెబ్బతీసిన వైసీపీ ఎంపీ మాధవ్ అశ్లీలవ్యవహారం తాజాగా మళ్లీ తెరపైకొచ్చింది. మహిళకు జిప్పు తీసి చూపించిన ఎంపీ మాధవ్, మీ దృష్టిలో పుణ్యపురుషుడా అంటూ.. జనసేన-టీడీపీ నేతలు జమిలిగా సంధిస్తున్న విమర్శనాస్త్రాలు, మరోసారి అధికార పార్టీని ఇరుకునపెడుతున్నాయి. దీనిపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ, మహిళా చైర్మన్‌కు సంధించిన ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి.
ఇక మహిళా కమిషన్‌ను మరింత ఇరకాటంలో నెట్టేందుకు, టీడీపీ సోషల్‌మీడియా రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ఏపీ పోలీస్ రిపోర్టులను రక్షణ కవచంగా ధరించిన టీడీపీ సోషల్‌మీడియా.. కొన్ని ఘటనలు, ఎన్‌సీఆర్‌బీ నివేదికలను పవన్‌కు నోటీసు నేపథ్యంలో చర్చనీయాంశంగా మార్చడ ం, అధికార పార్టీకి తలనొప్పిలా పరిణమించింది.
దేశంలో మహిళలపై జరిగిన దాడుల్లో 3వ వంతు ఏపీలోనే అంటూ ఎన్‌సీఆర్‌బీ ఇచ్చిన నివేదికను, టీడీపీ
మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇక మహిళలపై భౌతికదాడుల్లో తొలిస్థానం, మావన అక్రమరవాణాలో 2వ స్థానం, పనిప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల్లో ఏపీది 2వ స్థానం అంటూ ఎన్‌సీఆర్‌బీ ఇచ్చిన నివేదికను, టీడీపీ ఇప్పుడు చర్చనీయాంశం చేసే వ్యూహానికి తెరలేపింది.
ఇదే సమయంలో గతంలో మహిళలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ ప్రముఖులపై టీడీపీ-జనసేన తన దాడికి మరింత పదునుపెట్టడం, అధికార పార్టీకి సహజంగానే ఇబ్బందిగా మారింది. గతంలో మహిళా వాలంటీరును లైంగికంగా వేధించారని ఆరోపణలెదుర్కొన్న మంత్రి జోగి రమేష్.. మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా, స్థానిక మున్సిపల్ చైరపర్సన్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం.. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, భార్యను వేధించిన అదనపు కట్నం ఆరోపణలు.. బెల్లన చంద్రశేఖర్.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై మహిళలను వేధించారన్న ఫిర్యాదులున్నా.. మహిళా కమిషన్ వారికి ఎందుకు నోటీసు ఇవ్వలేదని టీడీపీ-జనసేన మహిళా నేతలు నిలదీస్తున్న వైనం కమిషన్ చైర్మన్‌కు సంకటమే.
ఇదే సమయంలో సీఎం సొంత జిల్లా అయిన ప్రొద్దుటూరులో.. 15 ఏళ్ల దళిత బాలికపై 10 మంది మృగాళ్లు అత్యాచారం చేసిన వైనాన్ని, మహిళా నేతలు మళ్లీ తెరపైకి తీసుకువస్తుండటం, అధికార పార్టీకి ఇబ్బందికర పరిణామమే. పులివెందులలో దళిత మహిళ నాగమ్మను అత్యాచారం చేసి, హత్య చేసినా మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని మహిళా నేతలు నిలదీస్తున్నారు.
ఇక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బెజవాడ ప్రభుత్వాసుపత్రిలో మహిళపై అత్యాచారం.. రేపల్లె రైల్వే స్టేషన్‌లో భర్త-పిల్లల ఎదుటే మహిళపై అత్యాచారం.. గుంటూరు జిల్లా తుమ్మలపూడిలో దుండగులు మహిళ ఇంట్లోకి చొరబడి చేసిన గ్యాంగ్‌రేప్.. నర్సరావుపేటలో బీటెక్ విద్యార్ధిని హత్య.. రాజమండ్రిలో
చిన్నారిపై సామూహిక అత్యాచారాల ఘటనలు.. పవన్ కల్యాణ్‌కు నోటీసు నేపథ్యంలో మళ్లీ తెరపైకి రావడం, అటు అధికార పార్టీ మహిళా నేతలకూ ఇబ్బందికరంగానే మారింది.
పవన్ మూడు పెళ్లిళ్లు న్యాయపరంగా జరిగినవే కాబట్టి, వాటి వల్ల సమాజానికి ఎలాంటి నష్టం ఉండదు. చట్టం కూడా విడాకులు తీసుకున్న తర్వాత, పెళ్లి చేసుకోవడాన్ని త ప్పు పట్టదు. పవన్ కూడా చేసింది అదే. పైగా తాను వారందరికీ భరణం చెల్లించానని స్వయంగా వెల్లడించారు. కానీ మహిళా కమిషన్‌కు అది అభ్యంతరంగా కనిపించడమే విమర్శలకు దారితీస్తోంది. అంటే మహిళా కమిషన్ దృష్టిలో విడాకులు తీసుకున్న వారు, మళ్లీ పెళ్లి చేసుకోవడం నేరంగానే కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మహిళలను వేధించిన అధికార పార్టీ నేతలకు నోటీసులివ్వడం బదులు, ‘మీరూ మూడు పెళ్ళిళ్లు చేసుకోమని’ వైసీపీపై ఎదురుదాడి చేసిన పవన్‌కు నోటీసు ఇవ్వడంపైనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
అయితే మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ నోటీసు పుణ్యాన.. గతంలో వైసీపీ నేతలు- మంత్రులు మహిళలపై చేసిన వ్యాఖ్యలు- వేధింపులన్నీ మళ్లీ తెరపైకి రావటం, అధికార పార్టీకి శిరోభారంగా పరిణమించింది. ప్రధానంగా అంతా మర్చిపోయిన ఎంపీ మాధవ్ నగ్న వీడియో వ్యవహారం, వైసీపీ నేతలకు సంకటంలా మారింది. దీనితో పవన్‌కు వాసిరెడ్డి పద్మ నోటీసు ఇచ్చిన తర్వాత.. వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చేందుకు ఆసక్తిచూపించకపోవడం బట్టి.. ఈ వ్యవహారం అధికార పార్టీని, ఏ స్థాయిలో ఆత్మరక్షణలో నెట్టిందో స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.