Suryaa.co.in

Editorial

సజ్జల మెడకు జిత్వానీ ఉచ్చు?

  • నోరు విప్పుతున్న పోలీసులు

  • ఆయన ఆదేశాల మేరకే చేశామని ఒప్పుకోలు?

  • జిందాల్ వచ్చినప్పటి నుంచి ఆ పోలీసుల కాల్‌లిస్టుపై నిఘా

  • సజ్జల, ముగ్గురు ఐపిఎస్‌ల కాల్‌డేటా పరిశీలన

  • అప్రూవర్‌గా మారనున్న ఓ ఐపిఎస్

  •  సజ్జలపైనా కేసు తప్పదా?

  • అవునంటున్న పోలీసు వర్గాలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

ముంబయి నటి కాదంబరి జిత్వానీని ముంబయి నుంచి చెరబట్టి.. విజయవాడకు తెచ్చి ఆమెను అక్రమంగా అరెస్టు చేసిన ముగ్గురు ఐపిఎస్‌లపై సస్పెన్షన్ వేటు పడిన వైనం, పోలీసువర్గాల్లో సంచలనం సంచలనం సృష్టించింది. కాగా ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని ప్రచారం జరుగుతోందన్న, నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మెడకు, జిత్వానీ ఉచ్చు బిగిసుకోవటం ఖాయమన్న ఆసక్తికరమైన చర్చకు పోలీసు, కూటమి వర్గాల్లో తెరలేచింది.

ఈ కేసును విచారిస్తున్న అధికారులకు.. ముంబయికి ఎవరి ఆదేశాలతో, ఎవరెవరు వెళ్లారు? ఆమె తండ్రిని కారులో ఎవరు తీసుకువచ్చారు? ఇబ్రహీంపట్నంలో రోడ్డు పక్కన ఉన్న లాడ్జిలో, ఆమెను ఎవరెవరు ఇంటరాగేట్ చేశారు? వీటీపీఎస్ గెస్‌హౌస్‌లో ఏ అధికారులు ఆమెను బంధించి చిత్రహింలు పెట్టారన్న విషయాలను.. ఆ కేసులో పాలుపంచుకున్న అధికారులు పూసగుచ్చినట్లు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రధానంగా పోలీసుశాఖలో ఇంకా భవిష్యత్తు ఉన్న ఒక ఐపిఎస్ అధికారి, అప్రూవర్‌గా మారుతున్నట్లు సమాచారం.

జిత్వానీని తెచ్చేందుకు స్వయంగా ముంబయికి వెళ్లిన ఆయన, తాను ఎవరి ఆదేశాలతో అక్కడికి వెళ్లింది? ఆ సందర్భంలో తనతో ఎవరెవరు ఫోనులో మాట్లాడిన అంశాలను, ఉన్నతాధికారులకు పూసగుచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.ఇందులో తన పాత్రేమీలేదని, అంతా ఆ నలుగురు చెప్పినట్లే చేశానని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే.. సజ్జల పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు పోలీసు-కూటమి వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో పోలీసులు, ఆయనపైనా కేసు నమోదు చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. నిబంధనలు అనుసరించి, అధికారుల సాక్ష్యం ప్రకారమే ఆయనపై కేసు నమోదుచేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెబుతున్నారు. కేసు పెట్టిన తర్వాత ఆయన సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, కేసును మరింత బలంగా బిగిస్తారంటున్నారు.

ఇప్పటికే ఐపిఎస్‌ల ఫోన్‌కాల్‌డేటా విశ్లేషించిన పోలీసు ఉన్నతాధికారులు, సజ్జల నుంచి వారికి ఎన్నిసార్లు ఫోన్లు వెళ్లాయని ధృవీకరించుకున్నట్లు పోలీసువర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జిందాల్ ఏపీకి వచ్చినప్పటి నుంచి.. ఈ ముగ్గురు ఐపిఎస్‌లు, మరికొందరు కిందిస్థాయి అధికారుల మధ్య, ఈ నెంబర్లతో ఎన్నిసార్లు సంభాషించిన వివరాలు ఈపాటికే పోలీసులు సేకరించారని తెలుస్తోంది. అయితే జిత్వానీ కేసులో తనకెలాంటి సంబంధం లేదని, తనపై దుష్ప్రచారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని సజ్జల హెచ్చరించిన విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE