Suryaa.co.in

Andhra Pradesh

ఎన్ఆర్ఐ టిడిపి ద్వారా గల్ఫ్‌ లో ఉద్యోగాలు

-10 మందికి మంగళగిరిలోని J1C లో ఉపాధి
-జాబ్ ఆఫర్ లెటర్స్ అందచేసిన అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం అయిన ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యంలోని ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో శిక్షణ పొందిన విద్యార్థులకు గల్ఫ్ లో ఉద్యోగాలు లభించాయి. సాధారణ డిప్లొమా మరియు ఐటిఐ అర్హతతోనే ఎలక్ట్రీషియన్ కోర్సు లో 45 రోజుల శిక్షణ అనంతరం వీరు ఈ ఉద్యోగాలు పొందారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం నాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు ఉద్యోగాలు లభించిన మరియు శిక్షణ పొందిన ఎనిమిది మంది విద్యార్థులకు నియామక మరియు శిక్షణాంతర పత్రాలు అందజేశారు. అదే విధంగా మరో 10 మంది విద్యార్థులు కూడా టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ లోనే శిక్షణ పొందిన అనంతరం మంగళగిరిలోని జే వన్-సి (J1C) అనే సర్వీసు సెంటర్ లో ఉద్యోగాలు పొందారు. వారు కూడా నియామక పత్రాలు అందుకున్నారు.

ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విద్యార్థులను అభినందించారు. తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో శిక్షణ పొంది ఉద్యోగాలు పొందటం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులు మరింత మందికి తోడ్పాటును అందించాలని కోరారు. రాష్ట్రంలోనీ వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉద్యోగావకాశాలు పొందటం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉచితంగా శిక్షణ పొందే అవకాశం కల్పించిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎన్ఆర్ఐ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ వేమూరు రవికుమార్ లకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్ ట్రైనింగ్ కో ఆర్డినేటర్ పెండ్యాల యామిని, ట్రైనర్లు అధికారి, ఉమామహేశ్వరి, అడ్మినిస్ట్రేషన్ విభాగం డివి రావు, హిమజ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE