హైదరాబాద్: పన్నెండేండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాసాబ్ ట్యాంక్ లోని సమాచార కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(TUWJ) ఆధ్వర్యంలో బుధవారం నాడు జరిగిన మహా ధర్నా అనూహ్యరీతిలో విజయవంతం అయ్యింది. టీయూడబ్ల్యూజే పిలుపుపై స్పందించి, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు రాష్ట్ర నలుమూలల నుండి ఏంతో ఉత్సాహంగా, భారీగా జర్నలిస్టులు తరలి రావడం విశేషం. జర్నలిస్టుల నినాదాలతో మహానగరం రోడ్లన్నీ దద్దరిల్లాయి.
మహా ధర్నాకు యూనియన్ అనుబంధ సంస్థలైన తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ చిన్న, మద్య తరగతి పత్రికల సంఘం, మహిళా జర్నలిస్టుల విభాగం, తెలంగాణ ఉర్దూ జర్నలిస్టుల సమాఖ్యలతో పాటు హైదరాబాద్ ప్రెస్ క్లబ్, జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ, జవహర్ లాల్ హౌసింగ్ సొసైటీ, టీజేఏలు సంపూర్ణ మద్దతును ప్రకటించి మహా ధర్నాలో భాగస్వామ్యమయ్యాయి.
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ మహా ధర్నాలో, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, ఎం. ఏ. మాజీద్, జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ,ఉప ప్రధాన కార్యదర్శి కలుకూరి రాములు ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, నగునూరి శేఖర్, చిన్న పత్రికల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్ బాబు, అశోక్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయ్ కుమార్ రెడ్డి, రమేష్, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, కె.ఎన్.హరి, వీడియో జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, హరీష్, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గోపరాజు, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు ఏ. రాజేష్, ఉర్దూ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గౌస్, సీనియర్ మహిళా జర్నలిస్టులు విమల, అత్తలూరి అరుణ, వాకటి మంజుల, కళ్యాణం రాజేశ్వరీ తదితరులు మాట్లాడారు.



