– విజయవంతం చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ పిలుపు
హైదరాబాద్ : దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ ఒకటిన “ఛలో సమాచార భవన్” హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార శాఖ కమీషనరేట్(సమాచారభవన్) ఎదుట జర్నలిస్టుల ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ మామిడి సోమయ్య తెలిపారు. శనివారం ఆయన ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కో-కన్వీనర్లు వల్లాల జగన్, బండి విజయ్ కుమార్, తన్నీరు శ్రీనివాస్ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నప్పటికీ జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని, కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు. ఇక జర్నలిస్టులకు ఇస్తామన్న ఇళ్లస్థలాల ఊసే లేదని, ఆరోగ్య భీమా పథకం అటకెక్కిందని, చిన్న మధ్య తరహా పత్రికలు సంక్షోభంలో పడ్డాయని మామిడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు గత ప్రభుత్వమే తీరని అన్యాయం చేసిందంటే…ఈ ప్రభుత్వం కూడా మరింత అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామంటూ ముఖ్యమంత్రి, సమాచార శాఖ మంత్రి పలు మార్లు హామీలిటచ్చారే తప్ప ఆచరణలో పెట్టలేదని, చివరికి జర్నలిస్టుల ప్రతినిధిగా ఉన్న మీడియా అకాడమీ ఛైర్మన్ కూడా కమిటీ పేరుతో కాలయాపన చేసి చివరికి చేతులెత్తేసినట్లు తెలుస్తోందని అన్నారు.