ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ ప్రజల అంచనాలు, అవసరాలు, ఆలోచనలకు పూర్తిగా భిన్నంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. శాసన మండలిలో బడ్జెట్‌పై మాట్లాడిన ఆయన, ప్రభుత్వం సమర్పించిన అధికారిక గణాంకాలనే ఆధారంగా తీసుకుని పలు కీలక ప్రశ్నలను లేవనెత్తారు.
బడ్జెట్ అంచనాలు మరియు వాస్తవ ఖర్చుల మధ్య భారీ వ్యత్యాసాలు ఉండటం వల్ల బడ్జెట్‌పై ప్రజల్లోనే కాకుండా ప్రభుత్వ యంత్రాంగంలో కూడా విశ్వాసం దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.2.2 లక్షల కోట్ల బడ్జెట్ అంచనాలు పెట్టగా వాస్తవంగా రూ.1.67 లక్షల కోట్లే ఖర్చయినట్లు తెలిపారు. అదే విధంగా 2025–26లో రూ.2.29 లక్షల కోట్ల అంచనాలు పెట్టి, ఇప్పటివరకు కేవలం రూ.2.03 లక్షల కోట్లే సాధ్యమైనట్లు వివరించారు. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి రూ.2.41 లక్షల కోట్ల భారీ అంచనాలు పెట్టడం అసంబద్ధమని విమర్శించారు.
బడ్జెట్ అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలని, సాధారణంగా 5 నుండి 10 శాతం వరకు మాత్రమే వ్యత్యాసం ఉండాలని పేర్కొన్న శ్రవణ్, ప్రభుత్వం మాత్రం ప్రతిసారి భారీ అంచనాలు చూపించి చివరికి తక్కువ ఖర్చు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదని అన్నారు.
సీఏజీ నివేదిక ప్రకారం 2025–26 సంవత్సరానికి ప్రభుత్వం రూ.2.29 లక్షల కోట్ల రెవెన్యూ రిసిప్ట్స్ అంచనా వేసిందని, అయితే 2026 జనవరి చివరి వరకు కేవలం రూ.1.38 లక్షల కోట్లే వచ్చాయని తెలిపారు. అంటే సుమారు 60 శాతం మాత్రమే సాధ్యమైందని చెప్పారు. ఇంకా రెండు నెలల్లోనే రూ.65 వేల కోట్ల రెవెన్యూ సాధిస్తామని ప్రభుత్వం చెప్పడం వాస్తవానికి అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరాల్లో చివరి నెలల్లో కూడా గరిష్టంగా రూ.10 వేల నుండి రూ.20 వేల కోట్ల వరకు మాత్రమే వచ్చిన పరిస్థితి ఉందని గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్పుల విషయంలో కూడా ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని శ్రవణ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ మూడు సంవత్సరాల్లో రూ.3.47 లక్షల కోట్ల అప్పులు తీసుకుని, అందులో రూ.3.30 లక్షల కోట్లు పాత అప్పుల చెల్లింపులకు ఉపయోగించామని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని తెలిపారు. వాస్తవానికి ప్రభుత్వం నేరుగా చెల్లించిన అప్పులు సుమారు రూ.1.67 లక్షల కోట్లే ఉన్నాయని, కార్పొరేషన్లు మరియు ప్రత్యేక ప్రయోజన సంస్థలు (SPVs) తీసుకున్న అప్పులను కూడా ప్రభుత్వ ఖాతాలో చూపుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
విద్య రంగంపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని శ్రవణ్ అన్నారు. తెలంగాణలో సుమారు 77 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్నారని, కానీ ప్రైవేట్ స్కూల్లు మరియు కాలేజీల ఫీజు దోపిడీని నియంత్రించే అంశంపై బడ్జెట్లో ఒక్క మాట కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యపై ఖర్చు గత ఏడాది 10.1 శాతం ఉండగా ఈసారి 9.8 శాతానికి తగ్గిందని, ఇది జాతీయ సగటు 14.5 శాతంతో పోలిస్తే చాలా తక్కువని తెలిపారు.
ఆరోగ్య రంగంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఆరోగ్యంపై సగటు వ్యయం 6.2 శాతం ఉంటే, తెలంగాణలో కేవలం 5 శాతం మాత్రమే కేటాయించడం బాధాకరమని అన్నారు. పేద ప్రజలు విద్య మరియు ఆరోగ్య ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 6.45 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ, బడ్జెట్ పత్రాల్లో గత పదేళ్లలో ఒక్క కార్డు కూడా ఇవ్వలేదని పేర్కొనడం అసత్యమని ఆయన మండిపడ్డారు.
బీసీ వర్గాల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టులు మరియు నిర్వహణ పనుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని అన్నారు. ప్రభుత్వం రాజకీయ విమర్శలకు బదులు వాస్తవ గణాంకాలతో ప్రజలకు నిజాయితీగా సమాధానం చెప్పాలని, బడ్జెట్‌ను ప్రజలకు ఉపయోగపడే విధంగా సవరించాలని డా. దాసోజు శ్రవణ్ కోరారు.