– సిసిఐ,జిన్నింగ్ మిల్లు యజమానులు కుమ్మక్కై రైతులకు మోసం
– కపాస్ కిసాన్ యాప్ ఎందుకు తెచ్చారు?
– కలెక్టర్ కు వినతి,డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమమే
– బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఆసిఫాబాద్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని, వ్యాపారులను, మిల్లు యజమానులకు లాభం చేయాలనే చూస్తున్నాయని రైతులను పట్టించుకోవడం లేదని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్రం అదాని కంపెనీ నష్టాల్లో ఉంటే, ఎల్ఐసి నుండి 30 వేల కోట్లు ఎవరికీ తెలియకుండా ఇప్పించారన్నారు.విజయ్ మాల్యా వేల కోట్లు లోన్ తీసుకొని పారిపోతే కేంద్రం ఏమీ చేయలేకపోయిదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పుష్ప వంటి సినిమాలకు అడిగిన వెంటనే కోట్ల రూపాయలు ఆర్జించడానికి నిబంధనలు మార్చారని గుర్తుచేశారు.
అదానికి, వ్యాపారస్తులకు నిర్మాతలకు లాభాల గురించి ఆలోచించే ప్రభుత్వాలు పేద రైతులకు ఎందుకు న్యాయం చేయడం లేదని నిలదీశారు.బడాబాబులకు ఒక న్యాయం రైతులకు ఇంకో న్యాయమా అంటూ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో సిసిఐ అధికారులు, జిన్నింగ్ మిల్ యజమానులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారన్నారు. సిసిఐ అధికారులు రైతులను మోసం చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారని,వారిపై సిబిఐ విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కపాస్ కిసాన్ యాప్ కేంద్రం ఎందుకు తెచ్చిందని,దీనివల్ల రైతులకు ఏం లాభం జరుగుతుందని అడిగారు.ఈ యాప్ రైతులను మోసం చేయడానికేనన్నారు.
గతంలో సిసిఐ సర్వర్ డౌన్ ఉందని చెప్పి కొనుగోలు ఆపితే,రైతులు ఏమి చేయలేక తక్కువ ధరకు అమ్ముకున్నారని గుర్తుచేశారు. అదే విధంగా ఈ యాప్ లో కూడా సాంకేతిక కారణాలు అని చెప్పి మళ్లీ దోచుకుంటారని అనుమానం వ్యక్తం చేశారు. పత్తి ఎకరానికి 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని,తేమ శాతం 12 కి మించకూడదని,శని ఆదివారాల్లో కొనడం లేదని మరియు సాయంత్రం 6 దాటితే కొనుగోలు ఆపి,రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పంట నష్టం జరగకుండా రక్షించుకునే క్రమంలో పందులు చనిపోయినా రైతులను జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించి,ఎలాంటి షరతులు,నిబంధనలు లేకుండా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.కపాస్ కిసాన్ యాప్ తప్పనిసరి చేయొద్దని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి,రెండేండ్లయినా,రెండే సార్లు రైతు భరోసా ఇచ్చారని తెలిపారు. తుఫాన్,అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగితే పది వేల పరిహారం ఇస్తామని ఎందుకివ్వడం లేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని,రోడ్లు దిగ్బంధం చేస్తామని,కలెక్టరేట్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు హక్కుల సంఘం జెఎసి నాయకులు జయరాం వాసు, బిఆర్ఎస్ నాయకులు లెండుగురె శ్యాంరావు, అర్షద్ హుస్సేన్, లలిత, కవిత, వాసు, పోశం తదితరులు పాల్గొన్నారు.