– రేవంత్ రెడ్డి బావమరిదికి సంబంధించిన సాయి మౌర్య అనే కంపెనీతో కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీ లావాదేవీలు
– కె.ఎల్.ఎస్.ఆర్ అనే కంపెనీ ద్వారా సాయి మౌర్య అనే కంపెనీలోకి డబ్బులు
– తన బినామీ కంపెనీకి వేల కోట్ల రూపాయలు దోచిపెడుతున్న రేవంత్ రెడ్డి
– ముఖ్యమంత్రి రేవంత్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలు
– కే ఎల్ ఎస్ ఆర్ ఆర్థిక అవకతవకలు, బినామీ కార్యకలాపాలు, అర్హత లేకుండా కాంట్రాక్టులు సాధించిన అంశం బయటపెట్టిన కేటీఆర్
– ఈ కంపెనీ వ్యవహారాల పైన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు
– సీబీఐ, ఈడి, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ లతో విచారణ చేయించాలని కేంద్రానికి ఆదేశాలు
– తన బినామీ కంపెనీకి నోటీసుల అంశాన్ని దాచి ఉంచడానికి సిట్ పేరుతో దావోస్ నుంచి రేవంత్ డ్రామాలు
– ఈ కంపెనీ పై విచారణ ప్రారంభించి…అప్పటిదాకా దివాలా తీసిన ఈ కంపెనీ కార్యకలాపాలను ఆపాలన్న కేటీఆర్
– కంపెనీని బ్లాక్ లిస్ట్ చేసి ఆ కంపెనీ అర్హత లేకుండా దక్కించుకున్న కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేసిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన బినామీ కంపెనీకి దోచి పెడుతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా కె.ఎల్.ఎస్.ఆర్ (KLSR) అనే కంపెనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ విధంగా బినామీ కంపెనీగా పనిచేస్తుందో ఆధారాలతో సహా బయట పెట్టారు.
కె.ఎల్.ఎస్.ఆర్ అనే కంపెనీ మొదటి నుంచి రేవంత్ రెడ్డికి బినామీ కంపెనీగా వ్యవహరిస్తున్నదని, ఈ కంపెనీకి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధాలు అందరికీ తెలిసిన విషయమే అన్నారు. అయితే తాజాగా ఈ కే ఎల్ ఎస్ ఆర్ అనే కంపెనీ న్యాయమూర్తులను మేనేజ్ చేసే విషయం నుంచి మొదలుకొని…దివాలా తీసిన ఈ కంపెనీలో కొనసాగుతున్న వందల కోట్ల ఆర్థిక లావాదేవీల పైన నిగ్గుతెచాలని సుప్రీంకోర్టు వారం కింద తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందని…తన బినామీ కంపెనీ, తన అక్రమాలు బయటపడతాయి అన్న ఉద్దేశంతోనే దావోస్‌లో ఉన్న రేవంత్ రెడ్డి sit విచారణ పేరుతో డ్రామాలకు తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు.
ఈ సందర్భంగా ఈ కంపెనీకి రేవంత్ రెడ్డికి ఉన్న ఆర్థిక లావాదేవీలు, అనుబంధం, ముఖ్యమంత్రి అయ్యాక చేసిన అనుచిత లబ్ధి, కట్టబెట్టిన వేలకోట్ల రూపాయల కాంట్రాక్టు అంశాన్ని కేటీఆర్ స్పష్టంగా వివరించారు. ఈ కంపెనీ పేరుతో కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్ కారును ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వాడుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు.
ఈ కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీ పైన 2018 లోనే ఈడీ మరియు ఇన్కమ్ టాక్స్ దాడులు చేసిందని, అప్పుడే పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డికి ఈ కంపెనీకి ఉన్న సంబంధాల గురించి మీడియా బయటపెట్టిందన్నారు. అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దివాళా తీసి ఎన్.సి.ఎల్.టి (NCLT) లో దివాళా ప్రక్రియ కేసు నడుస్తున్న ఈ కంపెనీకి, అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి భుజాల మీదకు ఎత్తుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.
ఈ కంపెనీ 2018 సెప్టెంబర్ 27 నాడు రేవంత్ రెడ్డి బంధువుల పైన ఐటీ రైడ్స్ జరిగినాయి. సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీ మరియు కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీ మధ్య నిధులు చేతులు మారిన విషయాన్ని, టాక్స్ ఎగవేతలను ఈ దాడుల సందర్భంగా గుర్తించారు. భూపాల్ ఇన్ఫ్రా,, సాయి మౌర్య కంపెనీల డబ్బులు ఖాతాల్లోకి వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ రెండు కంపెనీలు రేవంత్ రెడ్డి బంధువుల కంపెనీలను విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
అయితే ఈ కంపెనీ కె.ఎల్.ఎస్.ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఒక బినామీ కంపెనీ అని అందరికీ తెలుసు అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు బినామీ కంపెనీల మాస్టర్‌గా పనిచేస్తున్నారని, రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ నేతలకు బినామీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండు సంవత్సరాల కాలంలో అనేక కుంభకోణాలను ప్రధాన ప్రతిపక్షంగా బయటపెట్టిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేస్తూ ప్రతి అంశంలోనూ రేవంత్ రెడ్డి దాటవేత ధోరణితో వ్యవహరించారన్నారు.
ఈ కె.ఎల్.ఎస్.ఆర్ అనే కంపెనీ 23 జూలై 2023 వ సంవత్సరంలో ఏ.ఎస్.ఎం.ఈ.టి (ASMET) అనే కంపెనీ మధ్య గొడవ జరిగిందని, వారిద్దరూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను అప్రోచ్ అయ్యరని, ఆ తర్వాత కేసు నడుస్తున్నదని తెలిపారు. ఆ తర్వాత ఈ కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీ అక్కడ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ పిటిషన్ వేసి తాము దివాళా తీసిన విషయాన్ని స్పష్టంగా చెప్పిందని, దాంతో ఈ కంపెనీలో ఆర్థిక లావాదేవీలను ఎన్.సి.ఎల్.టి నిషేధించిందని కేటీఆర్ గుర్తు చేశారు.
అయితే ఎన్.సి.ఎల్.టి లో జరుగుతున్న ఈ కేసు విషయంలో ఒక ఉన్నత న్యాయస్థానానికి చెందిన జడ్జ్ ద్వారా ఎన్.సి.ఎల్.టి జస్టిస్ శరత్ కుమార్ పైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే, ఆయన ఆ విషయాన్ని బయటపెట్టి ఆ కేసు నుంచి తప్పుకున్నారని కేటీఆర్ తెలిపారు.అయితే ఎన్.సి.ఎల్.టి లోనూ జడ్జిల ద్వారా కంపెనీకి సానుకూలంగా తీర్పు వచ్చేలా నిలబడిన వ్యక్తి ముమ్మాటికీ రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఆరోపించారు.
కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీలో రేవంత్ రెడ్డి అనేక పెట్టుబడులు పెట్టాడని, అందుకే రేవంత్ రెడ్డి బావమరిదికి సంబంధించిన సాయి మౌర్య అనే కంపెనీతో లావాదేవీలు నడిపిందన్నారు. కె.ఎల్.ఎస్.ఆర్ అనే కంపెనీ ద్వారా సాయి మౌర్య అనే కంపెనీలోకి డబ్బులు పంపి దాని నుంచి భారీగా భూములు కొనుగోలు చేసే పని చేసిందని కేటీఆర్ తెలిపారు. 2018 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా ఈ కంపెనీ మీద దాడి చేసి అనేక ఆధారాలు బయటపెట్టారన్నారు.
ఇంత దుర్మార్గమైన, నీచమైన చరిత్ర ఉన్న కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీకి, దివాళా తీసిన కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీకి రేవంత్ రెడ్డి హయాంలో 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు వచ్చాయని, అమృత్ స్కీమ్, జల్ జీవన్ మిషన్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ సాగునీటి ప్రాజెక్ట్ పనులు, రహదారుల పనులు అన్నీ కలిపి సుమారు 6,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్కులను ఈ కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీ ఎలా పొందిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని పురపాలక శాఖతో పాటు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ కంపెనీ భారీగా పనులు దక్కించుకున్నదన్నారు.
అయితే 2023 నుంచే దివాళా తీసిన కంపెనీకి 2024-26 సంవత్సరాల్లో ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చిందన్న విషయాన్ని స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ కె.ఎల్.ఎస్.ఆర్ అనే కంపెనీ తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి 15 లక్షల రూపాయలు కూడా లేవని బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నదని, అంతటి ఆర్థిక వనరులు లేని కంపెనీ వేల కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టులకు సంబంధించిన వందల కోట్ల బ్యాంక్ గ్యారంటీలను ఎందుకు, ఏ విధంగా సబ్మిట్ చేస్తుంది అన్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని, ఆ మేరకు జడ్జిని ప్రభావితం చేసే అంశంతో పాటు ఈ కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీలోకి వచ్చిన వందల కోట్ల రూపాయల నిధుల విషయం పైన విచారణ జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది.
అందులో భాగంగానే సిబిఐ ), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూడు ఏజెన్సీల ద్వారా విచారణ జరిపించాలని కేంద్రాన్ని రాష్ట్రాన్ని కోరుతూ నోటీసు కూడా ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. అయితే ఈ నోటీసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే తనతో పాటు పార్టీ నేతలు హరీష్ రావు, సంతోష్ రావు, పార్టీ అధినేత కేసీఆర్ గారికి టెలిఫోన్ ట్యాపింగ్ సిట్ నోటీసుల పేరిట డ్రామాలు ఆడారని, ఈ అంశానికి సంబంధించి దావోస్ నుంచి స్వయంగా రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చి ఈ డ్రామా నడిపించారన్నారు.
కానీ ఈరోజు తాము ఆధారాలతో సహా ఈ 6,000 కోట్ల రూపాయల స్కామ్‌తో పాటు కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీకి సంబంధించిన అవకతవకల పైన రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చిన అనుచిత లబ్ధి పైన దర్యాప్తు జరపాలంటూ రాష్ట్రానికి ఇచ్చిన నోటీసులను ఎందుకు ముఖ్యమంత్రి దాచి ఉంచారన్న విషయాన్ని కేటీఆర్ ప్రశ్నించారు.
ఒక దివాళా తీసిన కంపెనీ పైన రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత అమితమైన ఆసక్తి ఉన్నదని, ఇది కేవలం కమిషన్ల కోసమా లేక భాగస్వామ్యం కోసమా లేక అక్రమ సంపాదన ఆ కంపెనీ ద్వారా పంపించుకోవడానికా లేకుంటే ఆ కంపెనీ స్వయంగా రేవంత్ రెడ్డిదా అన్న విషయం తేలాల్సిన అవసరం ఉన్నదని, ఈ అంశం పైన రేవంత్ రెడ్డి స్వయంగా సమాధానం చెప్పాలి అన్నారు.
వెంటనే సుప్రీంకోర్టు ఆదేశించినట్లు రాష్ట్రంలో సిబిఐ తో ఈ అంశంలో ఎంక్వయిరీ నిష్పాక్షికంగా జరిపించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పటిదాకా కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీకి రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి కాంట్రాక్టును రద్దు చేయాలని, ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్ట్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
దీంతోపాటు సుప్రీంకోర్టు విచారణ పూర్తి అయ్యేదాకా ఈ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టి నూతన కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా బ్లాక్ లిస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి వెంటనే సిబిఐ, ఈడీ ద్వారా విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఈ మొత్తం వ్యవహారంలో కిషన్ రెడ్డి స్పందించి కేంద్రం పైన ఒత్తిడి తీసుకువచ్చి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు నోటీసులను పక్కన పెట్టి మరి కిషన్ రెడ్డి, బిజెపి పార్టీ రేవంత్ రెడ్డిని కాపాడుతున్న మాట నిజం కాకపోతే ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ మొత్తం వ్యవహారం కేవలం అవకతవకలు, ఆర్థిక కుంభకోణం, క్రిమినల్ కుట్ర, అధికార దుర్వినియోగం మాత్రమే కాకుండా మనీ లాండరింగ్ మీద కూడా ముఖ్యమంత్రి పాత్ర ఉందని… ఈ అంశం పైన కేంద్ర ఏజెన్సీలు విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తాము అన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఈ అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ మొత్తం కె.ఎల్.ఎస్.ఆర్ కంపెనీ విషయంలో సమగ్ర విచారణ జరిపేదాకా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు.