– మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద దారికాచి కమర్షియల్ శాఖ అధికారుల నిలువుదోపిడీ
– బిల్లుల పేరిట వ్యాపారుల అధికారుల దందా
– ప్రైవేటు డ్రైవర్లతో కలసి వసూళ్ల దందా
– రోజుకో పది లక్షల టార్గెట్
– కారులో కూర్చుని పర్యవేక్షిస్తున్న బాపట్ల వసూల్‌రాజా
– మీడియా రాకతో వసూల్‌రాజాలు పరార్
– ప్రభుత్వ తీరుతో విసిగిపోతున్న వ్యాపారవర్గాలు
– ఇలాగైతే పక్క రాష్ట్రాలకు వెళ్లడమే బెటరని నిర్ణయం
– కమర్షియల్ టాక్సులో దందారాజ్
( మార్తి సుబ్రహ్మణ్యం)
అది గుంటూరుకు సమీపంలోని కాజా టోల్‌ప్లాజా. అంటే అది మంగళగిరి నియోజకవర్గం. ఇంకా చెప్పాలంటే.. యువమంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఆ ప్రకారంగా అక్కడ అక్రమార్కులు ఉండకూడదు. అన్యాయం జరగకూడదు. ధర్మం నాలుగుపాదాల నడవాలి. ఎందుకంటే అది యువమంత్రి లోకేష్ నియోజకవర్గం కాబట్టి! అవినీతి-అక్రమాలు-వసూళ్లకు దూరంగా ఉండే లోకేష్-ఆయన టీమ్ ఇలాకాలో ఇలాంటి దందాలకు చాన్సే ఉండకూడదు. అయితే అందుకు జరుగుతున్నది భిన్నం.
లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాతినిధ్యం వహిస్తున్న కాజా టోల్ ప్లాజా దగ్గర.. ‘నీతినిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన’ వాణిజ్యపన్నులశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మంత్రిత్వ శాఖలోని అధికారులు, దందారాజ్కు తెరలేపారు. ప్రైవేటు ఉద్యోగులను పెట్టుకుని వసూళ్ల పర్వానికి బరితెగించారు. దీనికి కర్త-కర్మ-క్రియ బాపట్లకు చెందిన ఓ అధకారి. ఆయనే కమర్షియల్ ఖల్ ‘నాయక్’.
కారు నుంచి కిందకు దిగకుండా కాలు మీద కాలేసుకుని దందారాజ్ను దిగ్విజయంగా నడిపిస్తున్న ఖల్ ‘నాయక్’. స్వయంగా ఆయన శాఖ అధికారులే, దళారీ అవతారమెత్తి వ్యాపారులను బెంబేలె త్తించి.. పక్క రాష్ట్రానికి పోతే బెటరన్న నిర్ణయానికి కార ణమవుతున్న ఆశ్చర్యకర వైనమిది. విని తరించండి.
మంగళగిరి సమీపంలోని కాజా టోల్ ప్లాజా వద్ద బాపట్ల కమర్షియల్ శాఖకు చెందిన ఓ ఖల్ ‘నాయక్’ దోపిడీ పర్వానికి తెరలేపారు. మామూలుగా ఇది ఏ జిల్లాలోనే జరిగితే పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ అది నీతి-నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన యువ మంత్రి లోకేష్ నియోజవర్గం కావడమే ఈ ఆశ్చర్యానికి కారణం. మామూలుగా అయితే లోకేష్ ప్రాతినిధ్యం వహించే మంగళగిరి నియోజకవ ర్గంలో ఇలాండి దారి దోపిడీ దందా జరగకూడదు. ఎందుకంటే లోకేష్- ఆయన టీమ్, ఇలాంటి దోపిడీని అంగీకరించరు.. సహించరు కాబట్టి!
అయినా సరే ఎవరినీ లెక్కచేయకుండా సదరు బాపట్ల ‘ఖల్ నాయక్’ లెక్కలేనితనంతో చేస్తున్న దారిదోపిడీతో.. ప్రభుత్వానికి లక్షల రూపాయల పన్నులు చెల్లిస్తున్న వ్యాపారులు, ‘‘ఇక ఈ రాష్ట్రంలో వ్యాపారం చేయడం వృధా. పక్క రాష్ట్రానికి వెళితే బెటర’’న్న ఆలోచనకు కారణమవుతున్నారు.
కాజా టోల్ ప్లాజాకు ఇరువైపులా వచ్చే వాహనాలను, ప్రధానంగా సరకు రవాణా వాహనాలను కమర్షియల్ టాక్సు అధికారులు తనిఖీ చేస్తుండటం సహజం. అందులో తప్పేమీ లేదు. అక్రమ రవాణా, బిల్లులు లేకుండా వెళ్లే వాహనాలను ఆపి, వాటిపై చలాన్లు వేయడాన్ని ఎవరూ ఆక్షేపించరు. పైగా దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా.
కానీ అందుకు భిన్నంగా.. సొంత జేబులు నింపేసుకునే లక్ష్యంలో భాగంగా.. అదే కాజా టోల్ ప్లాజాను అడ్డాగా చేసుకుంటున్న ఓ బాపట్ల ఖల్ ‘నాయక్’ దందారాజ్, తాజాగా మీడియా సాక్షిగా బయటపడింది. బాపట్లకు చెందిన ఓ కమర్షియల్ టాక్సు అధికారి, కొందరు ప్రైవేటు వ్యక్తులతో కాజా టోల్ ప్లాజా వద్ద మాటు వేస్తున్నారు.
సరకు రవాణా వాహనాలు ఆపడం, వారి వద్ద అన్ని అనుమతులున్నా, ఎంతో కొంత వసూలు చేయటం వారి లక్ష్యం. పోనీ వీరేమైనా కమర్షియల్టాక్సు సిబ్బంది కాదు. ప్రైవేటు వాహనాల డ్రైవర్లు. వారే ఖల్ ‘నాయక్’ నియమించిన వసూల్‌రాజాలు. సరకు రవాణా వాహనాలను గంటలపాటు నిలిపివేసినందుకు వచ్చే నష్టాన్ని గ్రహించిన యజమానులు, వారికి ఎంతో కొంత ముట్టచెప్పి వెళ్లిపోతున్నారు.
అంతవరకూ బాగానే ఉంది. కానీ అన్ని అనుమతులు ఉండి, బిల్లులు సక్రమంగా ఉన్న వ్యాపారులు వారి ముందు ఎందుకు సాగిలబడతారు? ఇదేమి అన్యాయమని వాదిస్తారు కదా? మీ పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తారు కదా? అవసరమైతే రోడ్డుపైనే బైఠాయిస్తారు కదా? యస్. కాజా టోల్ ప్లాజా వద్ద సరిగ్గా అదే జరిగింది.
తన వద్ద అన్ని అనుమతులు, బిల్లులు ఉన్నా ఎందుకు ఆపారంటూ సుబ్బారావు అనే వ్యాపారి, సదరు ఖల్ నాయక్‌ను ప్రశ్నించారు. ‘నా వద్ద పర్మిషన్లు, బిల్లులు లేకపోతే నాకు నోటీసులివ్వండి. యాక్షన్ తీసుకోండి. అంతేగానీ ఈ అర్ధరాత్రి 2 గంటలకు నా వాహనం ఎందుకు ఆపారో చెప్పాల’ని సదరు ఖల్ నాయక్‌ను ప్రశ్నించారు.
కానీ కారు నుంచి కిందకు దిగకుండా, కాలు మీద కాలేసుకున్న సదరు బాపట్ల కమర్షియల్ టాక్సు ఖల్ ‘నాయక్’.. ఇది కమర్షియల్ టాక్సు మంత్రి గారి పరిథిలో ఉందని లెక్కలేనితనంతో, కిందకు దిగకుండానే సమాధానమిచ్చారు. ప్రజాధనంతో జీతాలు తీసుకుంటున్న అధికారులు, ఇలాంటి అహంకారపూరిత వైఖరి ప్రదర్శించడమే దారుణం.
బాధితుడు తన వద్దకు వచ్చినప్పుడు, వారితో కారు దిగి మాట్లాడాలన్న కనీస ఇంగితం అధికారులకు లేనందున.. ఇకపై ఏ అధికారులయనా సరే.. కారులో కూర్చుని మాట్లాడితే చర్యలు ఉంటాయని ఉత్తర్వులిస్తే తప్ప, ఈ అహంకార-తలబిరుసు తనానికి తెరపడదు. ఇలాంటి తల బిరుసుతనం పోలీసు-రవాణా శాఖలోనూ కనిపిస్తుంటుంది.
దానితో ఆగ్రహించిన సదరు వ్యాపారి సుబ్బారావు.. అసిస్టెంట్ కమర్షియల్ కమిషనర్‌కు ఫోన్ చేసి, విషయం వివరించారు. దానికి స్పందించిన ఆయన బాపట్ల ఖల్ నాయక్‌కు ఫోను చేసి క్లాసు తీసుకోవడంతో అప్పటికిగానీ దారికి రాలేదట. అప్పటికే బాపట్ల ఖల్ నాయక్ ద ందా రాజ్ సోషల్-ఎలక్ట్రానిక్ మీడియాలో రావడంతో వెనక్కితగ్గారట. అయితే సదరు ఖల్ నాయక్.. వాహనం డీలర్‌ది అని చెప్పి, అసిస్టెంట్ కమిషనరును తప్పు దోవపట్టించి చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది.
దానితో కాళ్లబేరానికి వచ్చిన సదరు ఖల్ ‘నాయక్’.. తనకు భార్యా పిల్లలున్నారని, ఇక్కడితో విషయం వదిలేయమని ప్రాధేయపడ్డారట. అడుసు తొక్కనేల? కాలు కడగ నేల?!
పైవాళ్లకూ వాటాలట!
కాగా ఈ వసూళ్ల దందా ఒక్క కాజాకే పరమితమైన వ్యవహారం కాదట. రాష్ట్రం మొత్తం మీద ఇదే దందానట. దారికాసి సరకు రవాణా వాహనాల నుంచి వ సూలు చేసే ప్రైవేటు డ్రైవర్లు చెప్పిన మాటలివి! ‘ఈ డబ్బులు వీళ్కొక్కరే తీసుకోరు. జిల్లా, రాష్ట్ర స్థాయిలోని పైవాళ్లకు సర్దుబాటు చేయాలి. సెక్రయేరియేట్ స్థాయి వరకూ ఈ ముడుపుల పర్వం నడుస్తుందని బహిరంగ రహస్యం. వాళ్లకు టార్గెట్లుంటాయి. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ఎవరి వాటాలు వారికి వెళుతుంటాయి. ఇందులో ఎవరూ సుద్దపూసలు కాదు’’ అని కుండబద్దలు కొట్టడం ఆశ్చర్యం. మీడియా ఎంటర్ కావడంతో ఈ రెండు ముక్కలు చెప్పి ఆ డ్రైవర్లు పరారవడం విశేషం.
‘నీతి, నిజాయితీ’కి నిలువెత్తు నిదర్శనం- రాష్ట్రంలో ఎమ్మెల్యే-మంత్రులు-ఎంపీలతో పాటు, టీడీపీ కార్యకర్త ఏ మూల నుంచి ఫోన్ చేసినా, ‘ఒక్క రింగుకే’ స్పందించి.. అవినీతికి ఆమడదూరంలో ఉండి.. ‘వైసీపీ కార్యకర్తలు-కాంట్రాక్టర్లకు కాకుండా’-కేవలం ‘టీడీపీ కార్యకర్తలకు మాత్రమే’ బిల్లులు ఇప్పించే, ‘నిఖార్సయిన నాయకుడ’యిన పయ్యావుల కేశవ్ శాఖలోనే ఇన్ని అరాచకాలు జరగడమే వింత.
గత ఎన్నికల్లో పనులు చేసిన ‘‘పులివెందుల టీడీపీ కార్యకర్తలకు’’… రావలసిన వంద కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను, విశాల హృదయంతో క్లియర్ చేసి, ‘మీడియా ప్రశంసలు‘ పొందిన సాహసి ప్రాతినిధ్యం వహిస్తున్న కమర్షియల్ శాఖలోనే, ఇలాంటి దందారాజ్ కొనసాగడమే ఆశ్చర్యం.
నిజానికి రాష్ట్రంలో లోకేష్ సహా చాలామంది మంత్రులు ఫోన్లకు వెంటనే స్పందించరన్న పేరుంది. కానీ మొన్న శాసనసభ సమావేశాల్లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు చెప్పినట్లు.. ‘ఒక్క ఫోన్ కాల్కే పలికే ఏకైక మంత్రి’ పయ్యావుల శాఖలో, ఇలాంటి అడ్డగోలు దందాలు జరగడమే వింత.