– రాజకీయాల్లో భూకంపం సృష్టించిన ‘కాపునాడు’
– ‘కాపునాడు’తో కాపునేతలకు మర్యాద దక్కించిన పోరాటయోద్ధ మిరియాల వెంకట్రావు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఉమ్మడి రాష్ట్రంలో ముచ్చటగా మూడే ఉద్యమాలు చరిత్ర సృష్టించాయి. చరిత్ర గతిని మార్చాయి. పాలకుల గుండెల్లో గునపాలుగా మారాయి. ఆ ఉద్యమ నిర్మాతలెవరూ భూస్వాములు కారు.. కోటీశ్వరులు అంతకంటే కాదు. సామాన్య జనం నుంచి పుట్టిన నాయకులే. జాతి కోసం పుట్టిన నాయకులే. వారే ఆ ఉద్యమాలు శాసించారు. శ్వాసించారు. కష్టాలు పడ్డారు. అవమానాలు భరించారు.
కులాలు వేరైనా వారి లక్ష్యం ఒక్కటే. అణగారిన తమ కులాల దాస్య శృంఖాలను తెంచి, అందరితో సమానంగా, సమున్నతంగా తమ జాతిని నిలపాలన్న లక్ష్యం. గుప్పెడు కులాలు రాజ్యాధికారం అనుభవిస్తున్నా, పిడికెడు మంది ఉన్న తమ జాతి నిస్తేజంగా ఉండటాన్నిభరించలేక వారు చేసిన తిరుగుబాటే, తర్వాత వారిని చరిత్రకారులను చేసింది. అందుకే వారిని చరిత్ర ఇంకా గుర్తుపెట్టుకుంది. మదిలో దాచుకుంది. అందుకే వారు దశాబ్దాలయినా చిరకాలం చిరస్థాయిగా చరిత్రలో నిలిచారు. అందులో ఒకరు కాపునాడు వ్యవస్థాపకుడు మిరియాల వెంకట్రావు.
కాపు రిజర్వేషన్ నినాదంతో కాపు జాతిని భూమార్గం పట్టించి, పాలకులకు చెమటలు పట్టించిన కాపుజాతి మార్గదర్శి ఆయన. కాపు ఉద్యమాన్ని భూమార్గం పట్టించి, కాపు యువతలో రాజ్యాధికార ఆలోచనకు ఆయన వేసిన బీజమే ఇప్పుడు మహావృక్షమయింది. కాపులు సీఎం కావాలన్న ఆకాంక్ష ఇప్పటికీ సజీవంగా నిలిపింది. అందుకే మిరియాల సేవలు సజీవం.
ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయంగా చరిత్ర సృష్టించిన తొలి ఉద్యమం తెలంగాణ స్వరాష్ట్ర నినాదం. సొంత రాష్ట్ర డిమాండుతో నాటి కాంగ్రెస్‌కు చెమటలు పుట్టించిన ప్రజా ఉద్యమమది. అప్పట్లో నాయకుల స్వార్థ రాజకీయాల కారణంగా ఆ కల సాకారం కాకపోయినా.. కొన్ని దశాబ్దాల విరామానంతరం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్మించిన తెలంగాణ ఉద్యమం యావత్ తెలంగాణ సమాజాన్ని రోడ్డెక్కించింది. సొంత రాష్ట్ర నినాదాన్ని ఢిల్లీ దాకా వినిపించేలా చేసింది. ఫలితంగా దిగివచ్చిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఊపిరిపోసింది.
ఎన్ని సైద్ధాంతిక విబేధాలున్నా, ఎన్ని ప్రాంతీయ విబేధాలున్నా.. ఇది నిస్సందేహంగా, నిర్మొహమాటంగా కేసీఆర్ అనే ఒక బక్క పలచని వ్యక్తి సాధించిన అనన్య సామాన్య అద్భుత విజయమే. అదో చరిత్ర. అది ఎన్నటికీ కేసీఆర్ పేరునే చరిత్రకు చెబుతుంటుంది. తెలంగాణ చరిత్రలో కేసీఆర్‌ది చెరగని- చెరపలేని అధ్యాయం.
ఆ తర్వాత జరిగిన మరో మహా ఉద్యమమే కాపు రిజర్వేషన్ ఉద్యమం! దానికి కర్త-కర్మ-క్రియ, మిరియాల వెంకట్రావు అనే ఓ సగటు వ్యక్తి. జనాభాలో అత్యధిక శాతం ఉన్న కాపుల్లో రాజ్యాధికార కాంక్ష రేకెత్తించి, మాకూ సీఎం సీటు ఎందుకివ్వరన్న నినాదాన్ని క్షేత్రస్థాయిలో రగిలించిన కాపు విప్లవకారుడు మిరియాల. ఆయన నినదించిన గళమే మహా స్వరమై.. అది ఢిల్లీ కాంగ్రెస్ పీఠాన్ని కదిలించింది. కాపు జాతి ఉన్నంతవరకూ మిరియాల చరిత్ర చిరస్మణీయం.
దాని ఫలితమే అనేక మంది కాపు ప్రముఖులు మంత్రులు, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలయేందుకు బాటలు వేసింది. ఇప్పుడు రాజకీయంగా ఏ పార్టీ అయినా కాపులను రాజకీయంగా పక్కనపెట్టలేని పరిస్థితితోపాటు.. వారికి పెద్దపీట వేయక తప్పని అనివార్య పరిస్థితి సృష్టించిన కాపు ఉద్యమ బాటసారి మిరియాల వెంకట్రావే. అంత చేసినా.. కాపును సీఎంగా చూడాలన్న తన అంతిమ లక్ష్యం నెరవేరకుండానే, అంతిమ శ్వాస విడవటమే విచారకరం. అయినా కాపు జాతి ఉన్నంతవరకూ మిరియాల పేరు సజీవంగానే ఉంటుందనేది మనం మనుషులం అన్నంత నిజం.
ఇప్పుడంటే.. జిల్లాకో కాపునాడు. ఏరియాకో కాపు జేఏసీ. అంతా కాపు లీడర్లే. వారిలో ఎక్కువ మంది విజిటింగ్ కార్డు ప్రొఫెసర్లే. యూట్యూబ్ లీడర్లే. కానీ.. అసలు ప్రచార-ప్రసార మాధ్యమాలు అంతంత మాత్రంగా ఉన్న ఆ రోజుల్లోనే కాపులను ఏకం చేసి, వారిని భూమార్గం పట్టించి.. తన జీవితాన్ని కాపులకే అంకితం చేసి, లక్ష్యసాధనకు మడమతిప్పకుండా పోరాడిన ఏకైక కాపు యోద్ధ మిరియాల వెంకట్రావు. ఇప్పటి కాపు యువతరానికి తెలియని మిరియాల చరిత్ర.. పోరాట శైలిని ఆయన 11వ వర్ధంతి సందర్భంగా ఓసారి సింహావలోకనం చేసుకుందాం.
కాపు నేత అయినప్పటికీ.. జక్కంపూడితోపాటు, హర్షకుమార్, గొల్లపల్లి సూర్యారావు వంటి దళిత నాయకులను తయారుచేశారంటే.. బడుగు బలహీన వర్గాలపై ఆయనకున్న చిత్తశుద్ధి ఏమిటన్నది సుస్పష్టం. ‘‘1988లో జరిగిన కాపునాడు సభ మా ఉద్యమాలకు స్ఫూర్తి, ప్రేరణ. కాపు ఉద్యమం నుంచి ఎంతో నేర్చుకున్నా. వ్యూహాలు, ఎత్తుగడలు నేర్చుకున్నా’’ అని ఎమ్మార్పీస్ ఉద్యమకారుడు మంద కృష్ణమాదిగ అన్నారంటే.. మిరియాల వెంకట్రావు సృష్టించిన చరిత్ర ఏమిటన్నది సుస్పష్టం.
ఒకప్పుడు కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరుకాపుల దారులు వేరుండేవి. ఎవరి దారి వారిదే. అలాంటి కులాలను ఏకం చేసి.. అందరినీ కాపుజాతి గొడుగు కిందకు చేర్చిన ఘనత మిరియాలదే. అదే పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ప్రతి ఎన్నికల్లో కాపులకు టికెట్లు, మంత్రి పదవులు ఇవ్వక తప్పని అనివార్య పరిస్థితి కల్పించింది.
కృష్ణాతీరంలో లక్షలాదిమంది కాపులతో నిర్వహించిన కాపునాడు మహాసభ పాలకుల ఆలోచనలు మార్చేందుకే కాదు.. రాజ్యాధికారంపై ఆశలు వదులుకున్న కాపుజాతిలో సమరోత్సాహం నింపేందుకు బాటలు వేసింది. ఆ కాపునాడు సభ నింపిన స్ఫూర్తి.. ఇచ్చిన సంకేతాలు.. చేసిన రణనినాదాలే.. ఇప్పుడు కాపుల సమున్నతికి..భవిష్యత్తుకు కారణమన్నది మనం మనుషులం అన్నంత నిజం.
కాపు-బలిజ-తెలగ జాతి కోసం మిరియాల ఎక్కడిదాకా వెళ్లేందుకయినా సిద్ధపడేవారు. 1983లో తిరుపతి, గుడివాడ నుంచి ఎన్టీఆర్ గెలిచిన సందర్భం అది. ఆ సమయంలో టీడీపీ చిత్తూరు జిల్లాలో ఒక్క సీటు కూడా బలిజలకు కేటాయించలేదు. బలిజ ఓటర్లు అధికంగా ఉన్న తిరుపతి సీటు కూడా, బలిజలకు కేటాయించకపోవడాన్ని మిరియాల అప్పట్లో ఎన్టీఆర్‌ను ధైర్యంగా ప్రశ్నించిన పరిస్థితి. అందుకు ఏమాత్రం ఆగ్రహించని ఎన్టీఆర్..
మిరియాల డిమాండును పరిగణనలోకి తీసుకుని, తాను రాజీనామా చేసిన తిరుపతి స్థానంలో.. బలిజ నేత డాక్టర్ త్తుల శ్యామలకు కేటాయిస్తే, ఆమె ఘన విజయం సాధించిన వైనంతో.. మిరియాల కాపుజాతికి ఆరాధ్యదైవమయ్యారు. మాస్ లీడర్‌గా అవతరించారు. ఇక అప్పటి నుంచి తిరుపతి సీటును బలిజలకు ఇచ్చే సంప్రదాయాన్ని టీడీపీ కొనసాగించిందంటే, దానికి కారణం మిరియాల వెంకట్రావే అన్నది నిస్సందేహం. ఎన్టీఆర్ జీవించి ఉన్నంతవరకూ సీమలో బలిజలకు ఎక్కువ సీట్లు కేటాయించారంటే దానికి కారణం మిరియాలనే.
జైల్లో ఉన్న కాపునేత వంగవీటి మోహనరంగాకు న్యాయం చేయాలని, తెలగ-కాపు-బలిజలంతా ఒకే తాటిపైకి రావాలంటూ 1988 జూన్ 10న..
మిరియాల ఇచ్చిన పిలుపు, విజయవాడలో కృష్ణాతీరాన్ని జనప్రళయంగా మార్చింది. ఇసుకేస్తే రాలనంత జనం. రాదార్లు గోదార్లయిన వైనం. దాదాపు 15 లక్షల మంది హాజరయిన ఆ వేదిక మీదనే కాపునాడు పురుడు పోసుకుంది. ఆ వేదికనే కాపునాడుకు జన్మనిచ్చింది. అంత జనప్రభజంనం బెజవాడ టీడీపీ మహానాడులోనే దర్శనమిచ్చింది. దానితో రంగాను విడుదల చేయడం అనివార్యమయింది. అది వేరే విషయం.
అప్పట్లో కాంగ్రెస్ ప్రముఖులయిన పి.శివశంకర్, కె.కేశవరావు, వి.హన్మంతరావు, చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ, బుట్నా గోపాలకృష్ణయ్య, డాక్టర్ ఎస్.వెంకటేశ్వరరావు వంటి కాపు-బలిజ-మున్నూరు కాపు నేతలు మిరియాల నేతృత్వంలో అడుగులు వేయగా, నాడు జరిగిన జిల్లా-పట్టణ కాపునాడు సభలకు కాపుజాతి హోరెత్తింది. ఒక నాయకుడికి ఆ స్థాయిలో బ్రహ్మరథం పట్టిన ఏకైక ఉద్యమం అది.
తర్వాత మంద కృష్ణ మాదిగ మాదిగ నిర్మించిన రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) కుల ఉద్యమంలో మరో మైలురాయి. వేల కిలోమీటర్ల పాదయాత్రలు, నిరాహార-ఆమరణ నిరాహార దీక్షలతో పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన పోరాట యోద్ధ మంద కృష్ణ. అప్పట్లో ఆయన పిలుపే ఒక ప్రభ ంజనం.
కృష్ణమాదిగ వస్తున్నారని తెలిస్తే చాలు. మాదిగ ఉద్యోగ-వ్యాపార-యువకులు ఆయనను కలిసేందుకు పోటీ పడేవారు. సన్మానాలు చేసేవారు. ఆయన వెంట వచ్చిన వారికి భోజన-వసతి సౌకర్యాలు కల్పించేవారు. అలా మందకృష్ణను మాదిగ జాతి తమ సొంతం చేసుకుంది. టీడీపీ ప్రభుత్వంలో మంద కృష్ణ మాదిగ సమస్యలు వివరిస్తూ, ఆయన మంత్రులకు ఒక లేఖ రాస్తే చాలు. అదే శిలాశాసనంగా ఉండేది. మంద కృష్ణంటే అంత క్రేజ్ అప్పట్లో మరి!
అంతకంటే ముందు… కాపునాడు ఉద్యమ నిర్మాత మిరియాల వెంకట్రావుకు అప్పట్లో అంతకుమించిన క్రేజ్ ఉండేది. మిరియాల వెంకట్రావు కాపునాడు నేతలతో కలసి సీఎం ఇంటికో, సచివాలయానికో, మంత్రుల ఇళ్లకో వస్తున్నారంటే..వారంతా రాచమర్యాదలతో ఎదురెళ్లి స్వాగతించిన రోజులవి. కోట్ల, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి.. ఎవరు సీఎంగా ఉన్నా మిరియాల మాట వారికి వేదవాక్కుగా ఉండేది. మిరియాల కాపునాడు ఉద్యమంతో కాపు నాయకులు.. ఎమ్మెల్యే, మంత్రులుగా అవతరించారు. అందుకే వారిలో ఆ కృతజ్ఞత!
కాపుజాతి ఉన్నతి కోసం దశాబ్దాల తరబడి జనక్షేత్రంలో ఉన్న మిరియాల.. ఆ క్రమంలో కుటుంబ జీవితాన్ని త్యాగం చేశారు. కాపు ఉద్యమాలు-సభలు-సమావేశాలతో ఆయన ఇంటిపట్టున ఉన్న సందర్భాలు బహు తక్కువే. ఎక్కువ కాలం హోటళ్లలోనే బస. పండగ-పబ్బాలకూ ఇంటిపట్టున ఉన్నది లేదు. ఒక స్థాయికి చేరి, ఇమేజ్ వచ్చిన ప్రతి నాయకుడికీ ఈ కష్టాలు తప్పవు. అందుకు మిరియాల కూడా మినహాయింపు కాదు. ఆయన కాపు ఉద్యమంలో తలమునకలయి ఉంటే.. ఇంట్లో పిల్లల విద్యాభ్యాసం, కుటుంబభారం మొత్తం ఆయన శ్రీమతి చూసుకునేవారు. చివరకు అవసానదశలోనూ, కాపు జాతి ఉన్నతికి సలహాలు ఇస్తూనే కన్నుమూసిన నేత మిరియాల.
మిగిలిన వారికి భిన్నంగా.. తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా కాపుజాతి కోసం వినియోగించిన నాయకుడు మిరియాల. మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న మిరియాల తన కార్పొరేషన్లో ఖాళీ అయిన 49 ఉద్యోగాలను మొత్తం కాపులకే ఇచ్చిన వైనం వివాదం సృష్టించింది. దానితో నాటి సీఎం నేదురుమల్లి ‘అన్ని ఉద్యోగాలు మీ కులానికే ఇస్తే ఎలా’ అని ప్రశ్నిస్తే.. ‘ఇప్పటికీ మా వారికి న్యాయం చేసుకోలేకపోతే ఇంకెప్పుడు న్యాయం చేసుకుంటాం’ అని నిర్భయంగా బదులిచ్చిన నాయకుడు మిరియాల. ఆయన కాపునాడు ఉద్యమమే, దాసరి నారాయణరావును రాజ్యసభ్యసభ్యుడిగా ఎంపిక చేసింది.
ఇంత చేసిన మిరియాల కాపు నాయకుడు మాత్రమే కాదు. కార్మిక నాయకుడు కూడా. కార్మికోద్యమాలు నిర్మించిన స్ఫూర్తితోనే కాపునాడు నిర్మించారు. ఇప్పుడు కనిపించే ఎన్నో కాపు కల్యాణోత్సవాలు, కాపు ట్రస్టులకు ఆయనే స్ఫూర్తి ప్రదాత. సినీ హీరో దివంగత శ్రీహరికి ఎంతో ఇష్టమైన నాయకుడు మిరియాల. శ్రీహరి గంటలపాటు మిరియాల ఇంట్లో కూర్చుని, ఆయన సలహాలు తీసుకునేవారు.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాల మహానాడు, బీసీ సంక్షేమ సంఘం వంటి శక్తివంతమైన కుల సంఘ ఆవిర్భావానికి.. కాపునాడు సృష్టికర్త మిరియాల వెంకట్రావు పోరాటాలే స్ఫూర్తిగా నిలిచాయంటే.. ఆరోజుల్లో ఆయన చేసిన త్యాగం-పోరాటం ఏమిటన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
నిద్రాణమైన ఒక జాతిని తన ప్రసంగాలతో మేల్కొలిపి, వారిలో నవనవోన్మేషమైన ఆలోచనలు నింపి.. తమ లక్ష్యసాధన కోసం వారిని భూమార్గం పట్టించడమే కాదు. మిగిలిన అనేక కుల ఉద్యమాలకు మార్గదర్శిగా మారిన మిరియాల వెంకట్రావు చిరస్మరణీయుడు.