Suryaa.co.in

Andhra Pradesh

కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్పై వేటు

– వివేకా హత్యకేసు నిందితుడికి సకల వసతులు
– జైళ్లశాఖ అదనపు డీఐజీ వర్ర పసాద్‌ను గుంటూరు డీఐజీగా బదిలీ

కడప జిల్లా: వైఎస్సార్సీపీ హయాంలో ఆ పార్టీ నాయకులతో అంటకాగిన కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్పై బదిలీ వేటు పడింది. మాజీ మంత్రి వివేకా హత్యకేసు నిందితుడు శివశంకర్‌రెడ్డికి జైలులో అన్ని సౌకర్యాలు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు పలు ఫిర్యాదులు రావడంతో సూపరింటెండెంట్ ప్రకాష్‌ను బదిలీ చేశారు.

కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ప్రకాష్పై బదిలీ వేటు పడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులతో అంటకాగారనే ఆరోపణలు ఎదుర్కొన్న ప్రకాష్ను నెల్లూరు జైలుకు బదిలీ చేశారు. నెల్లూరు జైలు సూపరింటెండెంట్ రాజేశ్వరరావును కడపకు బదిలీ చేశారు.

రెండేళ్ల కిందట కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి జైల్లో అన్ని సౌకర్యాలు సమకూర్చారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. శివశంకర్ రెడ్డి బ్యారెక్ సమీపంలోనే గ్యాంగ్ స్టర్ సునీల్ అనుచరులు హర్షతేజ్, కేశవ్, వాహిద్లను అందుబాటులో ఉంచడంతో, వారంతా శివశంకర్ రెడ్డికి సహాయకులుగా పనిచేశారనే తెలిసింది.

శివశంకర్ రెడ్డి సిఫారసు మేరకు ఆ ముగ్గురు ఖైదీలను నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌వోపీకి పంపినట్లు తెలిసింది. ప్రస్తుతం హర్ష తేజ బనగానపల్లె జైల్లో, కేశవ్ జమ్మలమడుగు జైల్లో ఉండగా, వాహిద్ కడప జైలు ఆవరణలోని పెట్రోలు బంకులో పనిచేస్తున్నాడు.

దీంతోపాటు 10 నెలల కిందట కడప జైల్లో వివేకా కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరి ఓ కేసులో నాలుగు నెలలపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆ సమయంలో శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి జైల్లోకి వచ్చి దస్తగిరిని కలిసి ప్రలోభ పెట్టారని దస్తగిరి గతంలో ఆరోపణలు చేశాడు.

రాష్ట్ర స్థాయి జైలు ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే డాక్టర్ చైతన్యరెడ్డితో జైల్లో వైద్యశిబిరం ఏర్పాటు చేయించారని జైలు సూపరింటెండెంట్పై అభియోగాలు వచ్చాయి. జైల్లో పనిచేస్తున్న ఓ మహిళా వైద్యురాలు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి సహకారం అందించే విధంగా చేయడంలో సూపరింటెండెంట్ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవన్నీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో ప్రకాష్పై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో నిందితులు జైల్లో ఉన్న సమయంలో వారికి నచ్చిన ఆహారం సమకూర్చేందుకు ప్రకాష్‌ సహకరించినట్లు సమాచారం. ఆయన రెండున్నరేళ్లపాటు సూపరింటెండెంట్గా పని చేసిన సమయంలో కారాగారంలో ఫోన్లు, ఇతరత్రా సామాగ్రి దొరికినట్లు తెలిసింది. జైల్లో జరిగిన వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే వీలుందని సమాచారం.

బాధ్యతలు స్వీకరించిన రాజేశ్వరరావు

కేంద్ర కారాగారం సూపరింటెండెంట్గా కె.రాజేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ప్రకాష్‌ నెల్లూరు కేంద్ర కారాగారానికి బదిలీ అవ్వడంతో, అక్కడ విధులు నిర్వహిస్తున్న రాజేశ్వరరావు కడపకు వచ్చారు. దీంతో పాటు ఈయనకు జైళ్లశాఖ రాయలసీమ డీఐజీగా అదనపు బాధ్యతలను సైతం అప్పగించారు. ఇక్కడ పనిచేస్తున్న జైళ్లశాఖ అదనపు డీఐజీ వర్ర పసాద్‌ను గుంటూరు డీఐజీగా బదిలీ చేశారు.

LEAVE A RESPONSE