-వాస్తవాలను మరుగున పరిచి విగ్రహ పున ప్రతిష్ట : కాకాని విజయకుమార్
-ప్రచారం కోసం సంబంధం లేని వ్యక్తి వారసుడిగా ప్రకటించుకోవటం సిగ్గుచేటు : పాలడుగు మాధవ కిషోర్
-శిలాఫలకం రాళ్లపై కాకాని చరిత్రను సైతం వక్రీకరణ : అక్కినేని బోసు
-విగ్రహం పున ప్రతిష్టను ప్రతిష్టగా పేర్కొనటం దురదృష్టకరం : కనగాల నాగేశ్వరరావు
దివంగత కాకాని వెంకటరత్నం విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు ఆందోళన కరమని నగర ప్రముఖులు, కాకాని అభిమానులు ముక్త కంఠంతో నినదించారు. సోమవారం విజయవాడ కాకాని సర్కిల్ (బెంజ్ సర్కిల్) వేదికగా జరిగిన కాకాని 51వ వర్ధంతి కార్యక్రమంలో ఈ అంశాలు చర్చకు వచ్చాయి. కేవలం ప్రచార పిచ్చ, వ్యక్తిగత స్వార్ధంతో ఉక్కు మనిషి కాకానికి వారసునిగా ప్రకటించుకున్న వ్యక్తి చర్యలను ఈ సందర్భంగా తీవ్రంగా ఎండగట్టారు.
ఈ సందర్భంగా కాకాని మనవడు విజయకుమార్ మాట్లాడుతూ దివంగత వెంకటరత్నం చరిత్రను, ఆయన విలువను దిగజార్చే విధంగా కొందరు వ్యక్తులు వ్యక్తిగత స్వార్ధంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిజానికి విగ్రహ పున ప్రతిష్ట ఘనంగా నిర్వహించేందుకు కాకాని అనుచరులు, సహచరులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో, ఎటువంటి సంబంధం లేని కాకాణి తరుణ్ అనే వ్యక్తి కేవలం ప్రచార ప్రయోజనం కోసం వ్యవస్ధను పూర్తిగా తప్పుదారి పట్టించారన్నారు. జాతీయ రహదారి విస్తరణ నేపధ్యంలో విగ్రహం తొలిగింపు సందర్భంగా పోరాటం చేసి, విగ్రహాన్ని అధికారుల రక్షణలో ఉంచి, తిరగి ప్రతిష్టించేలా హామీలు పొందిన విజయవాడ ప్రముఖులను పక్కన పెట్టి కేవలం స్వార్ధ ప్రయోజనాలే ప్రాతిపదికగా కార్యక్రమాన్ని ముగించారన్నారు. తరుణ్ కాకాని అనే వ్యక్తికి కాకాని కుటుంబానికిగాని, ఆయన గ్రామానికి కాని, బంధుత్వ పరంగా కాని ఎటువంటి సంబంధం లేదని, కాకాని వారసునిగా తనను తాను ప్రకటించుకోవటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాకాని అనుచరుడు పాలడుగు మాధవ కిషోర్ మాట్లాడుతూ విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమం ఆయన విలువను దిగజార్చిందన్నారు. శిలాఫలకం రాళ్లపై కాకాని చరిత్రను సైతం వక్రీకరించారని, విగ్రహం పున ప్రతిష్టను కొత్తగా విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు రాసుకొచ్చారన్నారు. కాకాని మృతి సందర్భంగా ఇందిరాగాంధీ వచ్చినట్లు పేర్కొన్నారని, ఇది పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేసారు.
మాజీ శాసన సభ్యులు దివంగత అక్కినేని భాస్కరరావు కుమారుడు బోసు మాట్లాడుతూ కేవలం వ్యక్తిగత స్వార్ధం కోసం ఎటువంటి సంబంధం లేని వ్యక్తి తనకు తాను వారసుడిగా బిల్డప్ ఇచ్చుకోవటం, ఇందుకు కొందరు రాజకీయ నాయకులు సహకరించటం విచారకరమన్నారు. శిలాఫలకంపై 25వ తేదీన విగ్రహ పతిష్ట చేసినట్లు రాసి, 22వ తేదీనే కార్యక్రమం ముగించటం ఏమిటన్నారు. కాకాని అనుచరుడు కనగాల బోసు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సంపూర్ణ దాత అంటూ శిలాఫలకంపై వేయించుకోవటం ఏమిటని, పాత విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టిస్తూ ఇలా చేయటం కాకాని వెంకటరత్నం ప్రతిష్టను దిగజార్చటమేనన్నారు.
అసలు వివాదం ఏమిటి : జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కాకాని సర్కిల్ లో ఉన్న దివంగత ఉక్కు కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలిగించారు. ఆ సమయంలో విజయవాడ తూర్పు శాసనసభ్యులు యలమంచిలి రవి నేతృత్వంలో భారీ ఆందోళన నిర్వహించారు. ఫలితంగా జిల్లా యంత్రాంగం విగ్రహాన్ని పనులు పూర్తి అయిన తదుపరి తిరిగి ప్రతిష్టిస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఎక్కడ ప్రతిష్టించాలన్న దానిపై నగర ప్రముఖలు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. కాకాని అభిమానులు కోరుకున్న చోట విగ్రహ ఏర్పాటుకు అధికారులు అసక్తత వ్యక్తం చేయటంతో చర్చలు కొనసాగుతున్నాయి.
ఈ సమయంలో కాకాని ఆశయ సాధన సమితి పేరిట ఒక సంస్ధను ఏర్పాటు చేసుకుని వ్యవస్ధాపక అధ్యక్షుడినంటూ తరుణ్ అనే వ్యక్తి ప్రకటించుకున్నారు. కాకాని వెంకట రత్నం మనవడు కాకాని విజయకుమార్ తో కొన్ని కార్యక్రమాలకు హాజరై ఇంటి పేరు అధారంగా వారసత్వాన్ని సొంతం చేసుకునే కుట్రకు తెరతీసారు. తాజాగా విగ్రహ పున ప్రతిష్ట చేపడుతూ ఒక పధకం ప్రకారం వెంకట రత్నం కుటుంబ సభ్యులను పక్కన పేట్టి కార్యక్రమాన్ని పూర్తి చేయించారు. ఇది కాకాని అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో రాష్ట్ర వాప్తంగా ఉన్న కాకాని అభిమానులు సోమవారం కాకాని సర్కిల్ లో సమావేశమై ఈ పరిణామాలను ముక్త కంఠంతో ఖండించారు.
ఈ రోజు జరిగిందేమిటి : కాకాని వర్ధంతి సందర్భంగా మాజీ శాసన సభ్యులు యలమంచిలి రవి, కాకాని విజయకుమార్, పాలడుగు మాధవ కిషోర్, అక్కినేని బోసు, కనగాల నాగేశ్వరరావు, కలపాల వినయసాగర్ , బి. ఇంద్రమోహన్ రెడ్డి, చెన్నుపాటి గణేష్, రామాయణపు సాంబయ్య, కాంగ్రెస్ నేత కొలను కొండ శివాజీ, వందల సంఖ్యలో కాకాని అభిమానులు నివాళి అర్పించేందుకు సోమవారం కాకాని సర్కిల్ కు చేరుకున్నారు. అక్కడ జెడి లక్ష్మి నారాయణ ముఖ్య అతిధిగా తరుణ్ తదితరులు నివాళి అర్పిస్తూ విగ్రహం తామే ఏర్పాటు చేసామని చెప్పుకోవటం విజయవాడ ప్రముఖుల ఆగ్రహానికి కారణమైంది.
దీనిని తీవ్రంగా నిరశించిన కాకాని అభిమానులు ఆ ధోరణిని తప్పు పట్టారు. తరుణ్ ను ఎండగట్టారు. ఏరకంగా కాకాని వాసరుడివంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. కార్యక్రమంలో భాగంగా అక్కడే ఉన్న యలమంచిలి రవి యూత్ సభ్యులు ఇదే విషయంపై తరుణ్ వైఖరిని ఎండగట్టారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న యలమంచిలి రవి తన అనుచరులకు సర్ధి చెప్పారు. తరుణ్ ను అక్కడి నుండి పంపించి వేసారు. ఈ సందర్భంగా పుర ప్రముఖులు 22వ తేదీ కార్యక్రమం జరిగిన తీరు పట్ల తమ ఆవేదనను మీడియా దృష్టికి తీసుకువచ్చారు.
విజయవాడ చరిత్రనే మార్చే కుట్ర : యలమంచిలి రవి
కాకాని విగ్రహ పున ప్రతిష్టతో విజయవాడ చరిత్రను మసకబార్చే కుట్ర జరిగిందని విజయవాడ తూర్పు మాజీ శాసనసభ్యులు యలమంచిలి రవి అన్నారు. స్వార్ధ పూరితంగా కుటుంబ సభ్యులను సైతం పక్కన పెట్టి కార్యక్రమం చేపట్టటం, మరి కొందరు దానికి వంతపాడే విధంగా వ్యవహరించటాన్ని ప్రజలు అర్ధం చేసుకున్నారని తెలిపారు. నిజానికి ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వర రావు కూడా హాజరై తన నిరసన తెలపాలని భావించారని, కాని అదివారం జారీ పడటంతో అయన కార్యక్రమానికి రాలేక పోయారని వివరించారు. ప్రస్తుతం విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతం ఆయన స్ధాయికి ఏమాత్రం తగదని, కాకాని అనుచరులుగా తాము ఈ విషయంలో సమావేశం నిర్వహించి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకోనున్నామని యలమంచిలి స్పష్టం చేసారు. కాకాని విగ్రహాన్ని కార్పోరేట్ సంస్ధల ప్రచారానికి వినియోగించుకున్నారని ఆక్షేపించారు. బోటింగ్ సంస్ధ పేరుతో ఉక్కు కాకానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
యలమంచిలి రవి యూత్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ
ఉక్కు కాకానిగా పేరుగాంచిన దివంగత కాకాని వెంకటరత్నం 51వ వర్ధంతి వేడుకలు నగరంలోని కాకాని సర్కిల్ (బెంజ్ సర్కిల్) లో సోమవారం ఘనంగా జరిగాయి. మాజీ శాసనసభ్యులు యలమంచిలి రవి, నగర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రానికి కాకాని అందించిన సేవలను కొనియాడారు. ఉక్కు కాకానిగా వెంకటరత్నం ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు అజరామరమన్నారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి యూత్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేసారు. కార్యక్రమంలో యలమంచిలి రాజీవ్, సుంకర రవి, రవి యూత్ సభ్యులు మోహన్, రేఖాబాబు, పల్లా సాగర్, ఆటో రవి, ధనుంజయ, వల్లభనేని సాయి, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.