– ‘కమలం’ కంటే.. కమ్యూనిస్టు రాష్ట్రాల్లోనే కూలీల వేతనాలు ఎక్కువ
– కూలీ రేట్లు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దారుణం
– ప్రధాని రాష్ట్రంలోనూ కూలీల పట్ల నిర్లక్ష్యమే
గుజరాత్ కంటే కేరళలో 500 రూపాయలు ఎక్కువ కూలీ
-గుజరాత్, మధ్యప్రదేశ్‌లో కనిపించని జాతీయ సగటు అమలు
– జాతీయ సగటు కూడా లేని నిర్లక్ష్యం
– కేరళ ఫస్ట్, గుజరాత్ లాస్ట్
– డబుల్ ఇంజన్ స్లోగన్ పార్టీ పాలనలో ఇదో వైచిత్రి
– ఆర్బీఐ నివేదికలో బట్టబయలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
డబుల్ ఇంజన్ సర్కారు వస్తే కన్నీళ్లు తీరుస్తామన్నది బీజేపీ తాజా స్లో‘గన్’. ప్రధానంగా సామాన్య- మధ్య తరగతి-బడుగువర్గాల కష్టాలు కడతేరుస్తామన్నది బీజేపీ తరచూ ఇచ్చే మరో హామీ. ఆయా వర్గాలంతా కష్టపడకుండా చూసే పూచీమాదని, ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఇచ్చే మరో పెద్ద హామీ. కానీ ఆచరణలో మాత్రం అందుకు రివర్సు. ‘కమలం’ మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప, చేతలు గడప దాటడం లేదు.
ముఖ్యంగా వ్యవసాయ, ఇతర కూలీల కనీస వేతనాల అమలు విషయంలో.. బీజేపీ పాలిత రాష్ట్రాలు, మరీ పిసినారితనంతో వ్యవహరిస్తున్నాయి. ఇంకా దానికంటే… కమ్యూనిస్టు పాలిత రాష్ట్రాల్లోనే, కిందిస్థాయి వర్గాలు కూలీల కనీసవేతనాలు జాతీయ సగటుకు మించి అమలవుతున్నాయి. మరి ఒక్క ఇంజన్‌తోనే తమ బతుకుబండి లాగించని బీజేపీకి, ఇంకో ఇంజన్ ఇస్తే ఏం చేస్తారన్నది కమ్యూనిస్టులు సంధిస్తున్న ప్రశ్న.
దేశంలో జాతీయ సగటు 323 రూపాయలు. దానిని ఏ రాష్ట్రాలయినా కచ్చితంగా అమలుచేయాలి. కానీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ.. డబుల్ ఇంజన్ ప్రభుతాలు రావాలని కోరుతున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం, దానిని అసలు అమలుచేయకపోవడమే విచిత్రం. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలోనే, కూలీల జాతీయ సగటును అమలుచేయని పరిస్థితి విమర్శలకు దారితీస్తోంది.
ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ అదే దుస్థితి. ఒకరోజు పనికి కేరళ కూలీ గుజరాత్ కూలీ కన్నా 500 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నట్లు, ఆర్బీఐ తాజా నివేదికలో పేర్కొంది. దీన్నిబట్టి బీజేపీ పాలిత రాష్ట్రాలు, కూలీల కష్టాన్ని పట్టించుకోవడం లేదని అర్ధమవుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
వ్యవసాయ కార్మికుల కూలీల రేట్ల విషయంలో, బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రం దారుణంగా వెనకబడిపోయింది. గుజరాత్లో ఒక కూలీకి రోజుకు 220 ఇస్తుండగా, కమ్యూనిస్టు పాలిత కేరళలో మాత్రం 726 రూపాయలిస్తోంది. అంటే ఇక్కడ గుజరాత్ రాష్ట్రం, జాతీయ సగటు అయిన 323 రూపాయల నిబంధనను కూడా అమలుచేయడం లేదని స్పష్టమవుతోంది.
గుజరాత్లో నిర్మాణ కూలీరేట్లకు సంబంధించి… కూలీలకు 323 రూపాయలు వేతనం అమలుచేయాల్సి ఉండగా, అక్కడ కేవలం 295 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అదే కమ్యూనిస్టు పాలిత కేరళ రాష్ట్రంలో రెండు రెట్లకు మించి.. అంటే 837 రూపాయలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇక ఇతర కూలీ రేట్ల విషయంలో కూడా, బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. అక్కడ రోజుకు 252 రూపాయలు మాత్రమే ఇస్తుండగా, కమ్యూనిస్టు పాలిత కేరళ రాష్ట్రంలో 681 రూపాయలు ఇస్తున్నారు. అంటే గుజరాత్ కంటే రెండు ఎక్కువ కూలీల రేట్లు ఇస్తోందన్నమాట. అయితే విచిత్రమేమిటంటే.. కూలీ రేట్ల విషయంలో కమ్యూనిస్టు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంత భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ, నిత్యావసర వస్తువుల ధరల్లో మాత్రం రెండు రాష్ట్రాలూ సేమ్ టు సేమ్‌గా కనిపిస్తున్నాయి.
ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికలో స్పష్టమయ్యాయి. కూలీల రేట్లే అమలుచేయని బీజేపీ.. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు తీసుకువచ్చి, ఎవరిని బాగుచేస్తుంది? ఏ పారిశ్రామికవేత్తలను మిలియనీర్లు, బిలియనీర్లను బాగు చేస్తుందన్న ప్రశ్నలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి.