November 13, 2026

కమ్మ, రెడ్డి పాలనకు చరమగీతం పాడాలి

  • టీడీపీ, వైసీపీలది చీకటి ఒప్పందం
  • విశాఖ ఏఐ డేటా సెంటర్లు, బీచ్ శాండ్ మినరల్స్ తదితర అంశాల్లో కమీషన్ల పంపకాలపై ఇరు పార్టీల నేతలు కుమ్మక్కు
  • పుంగనూరులో మిథున్ రెడ్డి అనుచరులకే టీడీపీ మున్సిపల్ చైర్మన్ పదవులు
  • ప్రతిపక్ష పాత్రలో జగన్ విఫలం
  • జగన్మోహన్ రెడ్డి ఒక వీధి రౌడీ
  • విశాఖలో ఏఐ డేటా సెంటర్లను అడ్డుకుంటాం
  • మా బీసీ సభల వార్తలు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాయవా?
  • విజయసాయిరెడ్డి సభ వార్త ఫస్ట్ పేజీలో వేస్తారా?
  • మీడియా పక్షపాతం వీడాలి
  • 2029లో బీసీ ముఖ్యమంత్రే లక్ష్యంగా.. 2027 మే 9 నుంచి “బీసీవై పార్టీ యాత్ర”
  • కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 175 నియోజకవర్గాల్లో చారిత్రాత్మక యాత్ర
  • మంగళగిరి మీడియా సమావేశంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్

మంగళగిరి: రాష్ట్రంలో గత 80 ఏళ్లుగా సాగుతున్న కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల ఆధిపత్యానికి చరమగీతం పాడి, 2029లో బీసీ ముఖ్యమంత్రిని సాధించడమే లక్ష్యంగా 2027 మే 9వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టబోతున్నట్లు భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్ ప్రకటించారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 175 నియోజకవర్గాలను కలుపుతూ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఈ యాత్ర సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

మంగళగిరిలోని బీసీవై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

గత 80 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలే దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు అధికారాన్ని అనుభవిస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా జరగబోయే కులగణన ఆధారంగా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు దక్కేలా బీసీవై పార్టీ పోరాడుతుందన్నారు. 2029 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణల్లో బీసీ ముఖ్యమంత్రులను సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. ఇందులో భాగంగా 2027 మే 9వ తేదీన ప్రారంభమయ్యే బిసివై యాత్ర ద్వారా 90 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాలను ఏకం చేస్తామని, రాజ్యాధికారం కోసం జరిగే ఈ పోరాటానికి అన్ని వర్గాలు మద్దతు తెలపాలని ఆయన కోరారు.

ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, ఆయన కేవలం పులివెందులకు మాత్రమే పరిమితమై ఒక వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. టీడీపీ, వైసీపీలు పైకి కొట్లాడుకుంటున్నట్లు నటిస్తూనే, తెరవెనుక అవినీతి కోసం లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నాయని ఆయన ఆరోపించారు. పుంగనూరులో మిథున్ రెడ్డి అనుచరులకే టీడీపీ మున్సిపల్ చైర్మన్ పదవులు కట్టబెట్టడం, ఇటీవల చెన్నైలో ఒక సారాయి వ్యాపారి ఇంట్లో జరిగిన వివాహ వేడుకలో విశాఖ ఏఐ డేటా సెంటర్లు, బీచ్ శాండ్ మినరల్స్ తదితర అంశాల్లో కమీషన్ల పంపకాలపై ఇరు పార్టీల నేతలు కుమ్మక్కవ్వడమే దీనికి నిదర్శనమన్నారు.

విశాఖలో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏఐ డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి, ఉపాధికి తీవ్ర నష్టం ఉందని ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నా.. కేవలం కమీషన్ల కోసమే ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. విశాఖ ప్రజలతో కలిసి ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటును బీసీవై పార్టీ తీవ్రంగా అడ్డుకుంటుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో ప్రధాన మీడియా సంస్థలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర పత్రికలు పక్షపాత వైఖరి వీడాలని ఆయన హితవు పలికారు. బీసీవై పార్టీ ఆవిర్భావ సభకు వేలాది మంది వస్తే కనీసం జిల్లా ఎడిషన్‌లో కూడా వార్త రాయలేదని, కానీ మొన్న ఒక అగ్రవర్ణ నేత చిన్న హాలులో పార్టీ పెడితే మొదటి పేజీలో వార్త వేశారని, ఇది మీడియా పక్షపాతానికి నిదర్శనం కాదా అని ఆయన ప్రశ్నించారు.

Total Visitors: 3,386,085