– మీరు చేసిన తప్పుకు 3 సెంటీమీటర్ల వార్త వేసి చింతిస్తే సరిపోతుందా..?
– మీ విషపు రాతలు చదివిన లక్షల మంది ఇళ్ళకు వెళ్ళి ఎవరు చెబుతారు..?
– రాతలా..రోతలా రామోజీ…
– తల్లకిందులుగా తపస్సు చేసినా బాబును సీఎం చేయలేవు రామోజీ..!
– పేజీల కొద్దీ బురద రాతలు… సవరణలేమో సింగిల్ కాలమా?
– లోకేశ్ మాట్లాడే బూతులు మీకు కనిపించవా?
–ఈనాడు దృష్టిలో లోకేశ్ పులి…జనం దృష్టిలో పులకేశి
– గన్నవరంలో రౌడీయిజం చేసిన పట్టాభికి ఎల్లోమీడియా వత్తాసా..?
– తప్పుడు రాతలు ఇకనైనా కట్టిపెట్టండి రామోజీ
– మాజీ మంత్రి కురసాల కన్నబాబు
బాబు కోసం ఈనాడు బరితెగింపు రాతలు
ప్రభుత్వంపై ఎల్లో మీడియా పనిగట్టుకుని దాడి చేస్తోంది. ముఖ్యమంత్రి పై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది. గత మూడు రోజులుగా జరుగుతున్న సంఘటనలు విన్నప్పుడు, చూసినప్పుడు ఎల్లో మీడియా ప్రచురిస్తున్న వార్తలు, చేస్తున్న ప్రచారం చూస్తుంటే ఇంక దిగజారడానికి మెట్లేమీ లేవు అన్నట్టుగా తయారయ్యాయి. ఈనాడు పత్రికాధిపతి రామోజీరావు అయితే మరీ దిగజారి పోయారు. టీడీపీ ని భుజాన వేసుకునే కార్యక్రమంలో, ఎలాగైనా బాబును సీఎం సీట్లో కూర్చోబెట్టాలనేది ఆయన చిరకాల ఆశయం. అదేమో దింపుడు కల్లం ఆశ. తల్లకిందులుగా తపస్సు చేసినా, అది నెరవేరనే నెరవేరదని జనం ఎప్పుడో తేల్చేశారు. అయినా సరే ఆశ చావక బాబు కోసం , బాబు చేత, బాబు చెప్పినట్లల్లా నడుచుకోవడానికి అడ్డమైన అష్టావక్ర బరితెగింపు రాతలు ఈనాడులో అచ్చేస్తున్నారు.
బూతులు బాగా తిట్టగలడని పట్టాభిని దింపిన టీడీపీ…
సభలు, పాదయాత్రల పేరిట చంద్రబాబు, ఆయన తనయుడు వెర్రి వెంగళ మాలోకం లోకేశ్‌లు రోడ్లమీద పడ్డారు. తమ పార్టీ నాయకులు ఎవరూ క్షేత్ర స్థాయిలో మాట్లాడడానికి ఇష్టపడడం లేదని టీడీపీకి తెలిసిపోయింది. అందుకే చివరాఖరి ఆశగా పట్టాభి లాంటి బూతు శిఖామణులను ప్రభుత్వంపైకి బూతు ప్రసంగాలతో ఉసిగొలుపుతున్నారు. పట్టాభి చూస్తే కార్పొరేటర్ స్థాయి కూడా లేని నాయకుడు. అతన్ని జాకీలు వేసి మరీ ఈనాడులో లేపుతున్నారు.
పేజీల కొద్దీ బురద రాతలు…సవరణలు సింగిల్ కాలమ్‌కు పరిమితం…
పట్టాభి విజయవాడలో బూతు ప్రసంగాలు చేయడమే కాకుండా గన్నవరం వచ్చి వల్లభనేని, వంశీలను ఇష్టమొచ్చినట్లు తిడతాడు. ఆపై వారిపై పోటీకి తానే సిద్ధమంటూ తొడకొడతాడు. ప్రగల్భాలు పలుకుతాడు. అలాంటి వ్యక్తి గన్నవరం వచ్చి డ్రామా చేస్తే, ఇంకేముంది…పట్టాభిని కొట్టారని, ఈనాడులో పేజీల కొద్దీ తప్పుడు వార్తలను వండి వార్చారు. సచిత్రంగా పెద్ద పెద్ద కథనాలు ఇచ్చారు. రామోజీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఇంకా ఇవి ఎల్లో మీడియా రోజులు కావు. పట్టాభిని పోలీసులు కాళ్లపై కొట్టారంటూ ఈనాడు ప్రచురించిన తప్పుడు ఫోటోలను సామాజిక మాధ్యమాలు గుర్తించి, బట్టబయలు చేశాయి. అప్పుడు నాలిక్కరుచుకున్న ఈనాడు తప్పనిసరై ఏదో మొక్కుబడిగా మూడు- నాలుగు సెంటీమీటర్ల సింగిల్‌కాలమ్ వార్తను సవరణగా ప్రచురించింది. సన్నాయినొక్కులా సాంకేతికంగా పొరపాటు జరిగిందని తప్పించుకునే రీతిలో ఉందా వార్త.
మరి ఇంటింటికీ వెళ్ళి జనానికి క్షమాపణలు చెబుతారా..?
ఇదంతా చాలదన్నట్లు ఇంటర్నెట్ ఎడిషన్‌లో తీసేశామని ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ సవరణలో పేర్కొన్నారు. నెట్‌లో తీసేశారు సరే… పత్రికలు జనంలోకి వెళ్లాయి. మరి వాటికేం సమాధానం చెబుతారు?. ఇంటింటికీ వెళ్ళి క్షమాపణలు చెబుతారా? . అబద్ధాలయితే పేజీల కొద్దీ ప్రచురించడం, సవరణలు చిన్న వార్తలుగా సరిపెట్టడం ఆ పత్రికకు రివాజుగా మారింది. తప్పని ఒప్పుకున్నప్పుడు సవరణ అలాగా వేసేది?. ప్రభుత్వంపై బురద జల్లినప్పుడు హింసాత్మకంగా జల్లుతున్నారు.
లోకేశ్ ను జనం పులకేశిగా చూస్తున్నారు
ఈనాడు రామోజీ కోరిక ఏంటంటే.. లోకేశ్‌ను బాహుబలిలా, పులిలా చూపాలనుకుంటోంది.. కానీ అతన్ని జనం పులకేశిగా చూస్తున్నారు. బాబుపై సానుభూతి రావాలని, జగన్‌గారిని దౌర్జన్యపరుడిగా చిత్రించాలని ఈనాడు భ్రమపడుతోంది.మేం చెప్పిందే వేదమని, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, వారి టీవీలు అబద్ధాలు ప్రచారం చేస్తే నమ్మడానికి జనం సిద్ధంగా లేరన్న విషయం ఇంకా ఆ పత్రికల యాజమాన్యాలకు అర్థమైనట్లు లేదు.
అది బాబు కరపత్రిక
అర్జెంటుగా బాబును సీఎంను చేసేయాలని ఈనాడు రామోజీ తపన పడితే.. అది మిన్నువిరిగి మీద పడినా సాధ్యం కానేకాదని అందరికీ తెలుసు. అది దినపత్రిక కాదు .. చంద్రబాబు కరపత్రిక అని పట్టాభి ఉదంతంతో నిరూపించుకుంది. పట్టాభి అనే బూతులు మాట్లాడేవాణ్ని ఒక ఉద్యమకారుడిగా చూపాలని ఈనాడు తపిస్తున్నట్లుగా ఉంది. జగన్‌పై కక్షతో మీరే రకంగా దిగజారి రాతలు రాస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోండి. మీవి రాతలా…రోతలా..అని జనమే ఛీ కొడుతున్నారు. టీడీపీ ఎంతగా దాడులు చేస్తున్నా, ఎంత అడ్డగోలుగా మాట్లాడుతున్నా సంయమనంతో నడుచుకునే ప్రభుత్వం మాది. పట్టాభి లాంటి వారితో జగన్ గారిని తిట్టించి, తద్వారా దాడులకు దిగి, కల్లోలం సృష్టించి ఓట్లను పొందాలనుకునే స్వార్థపూరిత మనస్తత్వంతో టీడీపీ ఉంది. దీనికి మద్దతుగా ఎల్లో మీడియా తబలా వాయిస్తోంది.
జగన్ సంక్షేమం జనంలోకి వెళ్ళకూడదనే..
దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి సింహభాగం ఎమ్మెల్సీ స్థానాలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కేటాయించారు. ఇది జనంలోకి వెళ్తే ఆయనకు మరింతగా ప్రజాభిమానం పెరుగుతుందన్న దుగ్ధ కొద్దీ.. దీన్ని పక్కకు మళ్లించే స్టంటును టీడీపీ, ఎల్లో మీడియాలు కలిసి ప్రారంభించాయి. టీడీపీకి ఇప్పటివరకు అభ్యర్థులు కూడా దొరకలేదు. ఇప్పుడు వెతుక్కుంటోంది. గుడివాడలో కొడాలి నాని, లేదా గన్నవరంలో వంశీ లపై పోటీకి అభ్యర్థులను వెతుక్కునే పనిలో టీడీపీ పడింది. ఆ క్రమంలోనే వారిపై తానే పోటీకి వస్తానని పట్టాభి రౌడీయిజానికి దిగాడు. అతనికి వత్తాసుగా కొన్ని తప్పెటగుళ్ల బృందాలు, గరగ నృత్యాల బృందాలు… దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి…అనేవి దూకుడుగా గన్నవరంలో రౌడీయిజానిక దిగాయి.
పట్టాభిని ముసుగేసి కొట్టారంటూ సీపీఐ నారాయణ ప్రవచనాలు
పోలీసులు కొట్టకపోయినా, తానే దగ్గరుండి చూసినట్లుగా సీపీఐ నారాయణ ముసుగేసి కొట్టారంటూ ప్రవచనాలు చెబుతున్నారు. అసలు కొట్టనే లేదని వైద్యులే నివేదికలు ఇచ్చారు. పోలీసులు కూడా ఇదే చెప్పినా, ఆ మాటలను పట్టించుకోకుండా జగన్ పై నారాయణ పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తాడు. సీపీఐ టీడీపీతో ఎప్పుడో కలిసిపోయిందని జనానికి ఎప్పుడో అర్థమయింది. పట్టాభి మాట్లాడిన భాష మీకు తప్పుగా అనిపించలేదా? జగన్ ని, ఆయన సతీమణిని ఇష్టమొచ్చినట్లు పట్టాభి లాంటి దిగజారుడు వ్యక్తి నిందిస్తే.. అది మీకు తప్పని అనిపించలేదా? అది సంస్కారవంతంగా ఉందా? సీనియర్ నాయకుడిగా మీరేం సమాధానమిస్తారు?
బాబు నటనకు పరాకాష్ట అనపర్తి…
అనపర్తిలో ఏమీ జరగని చోట పోలీసులు తన సభను అడ్డుకుంటున్నారని బాబు అడ్డగోలు ప్రకటనలు. ఒక పక్క జీవో–1 ఉంది. పక్కనే విశాలమైన పాఠశాల మైదానం ఉందని పోలీసులు చూపించినా వినకుండా బాబు రోడ్డుపైనే సభ పెట్టారు. జనంలోకి వెళ్లి తనపై కేసులు పెడతారని కర్చీఫ్ పట్టుకుని ఏడుపులు మొదలు పెడతాడు. ఇదేం ఖర్మ అని బాబు అంటుంటే, మాకు వీడెక్కడి ఖర్మరా బాబు అని తండ్రీకొడుకులను చూసి టీడీపీ కార్యకర్తలే కథలు కథలుగా చెబుతున్నారు. డీఎన్‌ఏల గురించి లోకేశ్ అనే అజ్ఞాని మాట్లాడతాడు. మీరు ఒక పార్టీ ఆఫీసును పడగొడితే…మేం వంద ఆఫీసులను పడగొడతామని …డ్యాష్ అంటాడు. ఇది బూతుగా ఎల్లో మీడియాకు కనిపించలేదా?. కొడాలి నాని కొద్దిగా ఘాటుగా మాట్లాడితే తప్పనేవాళ్లు.. ఇదే లోకేశ్ మాటలకు సిగ్గనిపించడం లేదా? రాజకీయాల్లో, మీడియాలో విలువలు దిగజారాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది?
సంక్షేమ పథమే జగన్ లక్ష్యం…
చంద్రబాబు ఎంతగా వైఎస్సార్సీపీని, ముఖ్యమంత్రిని రెచ్చగొట్టాలని చూసినా జగన్ ప్రజా సంక్షేమమే తనకు ముఖ్యమనేలా, సంయమనంతో ముందుకు నడుస్తున్నారు. ఇంత ధైర్యమున్న నాయకుడు ఎక్కడా కనిపించరు. ఈనాడు పత్రిక రోజుకో అజెండా నిర్ణయించుకుంది. పేదలకు ఇంత డబ్బెందుకు వేస్తారు? ఖజానా ఖాళీ అయిపోయిందని రాస్తారు. అదే పత్రిక బాబు పదవి దిగేసమయంలో ఖజానాలో వంద కోట్లే మిగిలాయని చంకలు గుద్దుకుంటుంది. అయినా సరే వీటిని పట్టించుకోకుండా విజయవంతంగా సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇదొక టీడీపీ కుట్రగా భావించాలి. బాబుకు ఎన్ని జాకీలు వేసినా, ఆ పార్టీ లేవడం లేదు. బాబు చూస్తే ప్రవచన కర్తగా మారిపోయాడు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలి? ప్రజాసంక్షేమం ఎలా చూడాలి…అని హితోక్తులు చెబుతుంటాడు. తనకన్నా చట్టాలు మిన్నగా ఎవరూ అమలు చేయలేదంటాడు.
బాబు క్రూర మనస్తత్వం ముద్రగడ అంశంలోనే చూశారు
ముద్రగడ శాంతి యుత నిరసన సమయంలో బంధించి ఆయన కుటుంబ సభ్యులను వేధించి, చిరంజీవి ని రానివ్వకుండా , కాపుల సంక్షేమాన్ని తుంగలో తొక్కిన వ్యక్తి బాబు కాదా అని అడుగుతున్నాను. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వని వ్యక్తి చంద్రబాబు. నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ గారిని విశాఖ ఎయిర్ పోర్టులోనే ఆపేసినా, ఆయన సంయమనంతో వెనక్కి తిరిగి వచ్చేశారే కాని ఆయన ఏనాడూ టీడీపీని నిందించలేదు. బాబు అరాచకాలు అన్నీఇన్నీ కావు. కర్నూలు జిల్లాలో నారాయణరెడ్డిని పట్టపగలే టీడీపీ వాళ్లు వెంటపడి కిరాతకంగా చంపేస్తే అప్పుడేం చేశాడు బాబు? చట్టాలు టీడీపీకి మాత్రమే చుట్టాలని బాబు భావిస్తుంటాడు. అందుకే మళ్లీ బాబు ముఖ్యమంత్రి కావాలన్న స్కీము ఈనాడు పదేపదే పునరుద్ఘాటిస్తోంది. ఈ మధ్య ఒక షోలో చూశాను. అందులో పార్టీని వదిలేశానంటాడు ..కానీ…ప్రభుత్వాన్ని నడిపానంటాడు బాబు…23 మంది ఎమ్మెల్యేలను కొన్నాడు. మరి దీన్నేమనాలి? ఇది పార్టీని వదిలేసినట్లా? మా జగన్ గారు ధైర్యానికి ఈ నాటికీ కేరాఫ్ అడ్రస్…కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కోవడానికి ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్…అని దమ్మూధైర్యంతో చెబుతారు.