Suryaa.co.in

Editorial

కరణం బలరాంకు బంధువు షాక్

– బలరాం పార్టీ మారితే నేను మారతానా?
– నేను చచ్చే వరకూ టీడీపీనే
– లోకేష్‌ను చూసిన తర్వాతే వెళతా
– లోకేష్‌ను దీవించిన బలరాం బంధువైన 93 ఏళ్ల వృద్ధురాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

మల్లూరి సరోజిని. ఆమెది ప్రకాశం జిల్లా తిమ్మ సముద్రం గ్రామం. ఆమెకు 92 సంవత్సరాలు. అయినా బోలెండత ఓపిక. కాలం కలసి వస్తే శతాధిక వృద్ధురాలవుతారు. పైగా ఆమె చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు సమీప బంధువుట. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన నాటి నుంచీ టీడీపీకి వీరాభిమాని ఆమె.

ఇప్పుడు ఎన్టీఆర్ మనుమడు లోకేష్ .. తన జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడని తెలిసింది. అంతే.. ఆమె ప్రాణం ఆగలేదు. లేని ఓపిక తెచ్చుకుని, శక్తి కూడగట్టుకుని లోకేష్ పాదయాత్ర స్థలానికి చేరుకుంది. కానీ వేలాదిమంది జనం. అందరివీ ఉరుకులు, పరుగులు. ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. కానీ సరోజినీ ఏమో లోకేష్‌ను చూసిన తర్వాతనే వెళ్లాలన్న పట్టుదల. ఎవరినీ సాయం కోరలేని పరిస్థితి. ఎవరూ తనను గుర్తుపట్టని దుస్థితి.అలా మూడు గంటలు లోకేష్ కోసం వేచిచూసింది.

ఈలోగా ఒక యువ టీడీపీ కార్యకర్త బామ్మగారి పరిస్థితి తెలుసుకున్నాడు. వెంటనే లోకేష్ దగ్గరకు తీసుకువెళ్లాడు. బామ్మగారు బోలెడంత సంబరపడింది. తాతను చూసిన కళ్లతో, మనుమడినీ చూసింది. లోకేష్‌ను చల్లగా ఉండు బిడ్డా అని ఆశీర్వదించింది.

ఇంతకూ నువ్వు ఎవరు? ఇక్కడికి దాకా ఎందుకు వచ్చావని ఆ యువకుడు బామ్మగారిని ఆరా తీశాడు. నా పేరు సరోజిని. మాది తిమ్మసముద్రం. కరణం బలరాం నాకు బంధువవుతాడని చెప్పేసరికి ఆ యువకుడు షాక్. మరి బలరాం పార్టీ మారారు కదా? నువ్వు మారలేదా? నువ్వు ఇక్కడకెందుకొచ్చావని ప్రశ్నించాడు. ‘‘బలరాం పార్టీ మారితే నేను మారతానా? నేను చచ్చే వరకూ టీడీపీనే’’ అని అంత వయసులోనూ, బామ్మ ఒకింత రోషంతో చెప్పింది. దీన్ని బట్టి బంధువులు తమ అవసరాలకు పార్టీలు మారినంత మాత్రాన, వారి బంధువులు కూడా జెండాలు మార్చరని ఆ బామ్మ సంకేతం ఇచ్చినట్లయింది. ఆ విచిత్రమే ఈ ‘చిత్రం’!

LEAVE A RESPONSE