– దేవుడంటే లెక్కలేని నైజం!
– ఇకపై పోలీసులు కేసులను విచారించాల్సిన పని లేదు
– భూమన సర్టిఫికెట్ తీసుకుంటే సరిపోతుంది
– న్యాయం మొసళ్ళను లెక్కపెట్టదు
– అది కేవలం సాక్ష్యాలను మాత్రమే లెక్కపెడుతుంది
పరకామణి చోరీ కేసులో విచారణకు హాజరైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి , ఫిర్యాదుదారుడే దారుణంగా మరణించిన ఉపశమన సంతోషంతో తన సైకాలజీతో డిఫెన్స్ దాటి మీడియా ముందు వ్యంగ్యంగా మాట్లాడారు. ఆయన ప్రదర్శించిన హాస్యం, నిర్లక్ష్యం… ఇవన్నీ ఒక సాధారణ ప్రతిస్పందన కాదు, కేసు యొక్క తీవ్రత నుంచి తన మనస్సును, తన ప్రతిష్టను కాపాడుకోవడానికి ఆయన వాడిన మానసిక ఆయుధాలు. పసిఫిక్ మహా సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నాయి? నైలు నదిలో మొసళ్ల సంఖ్య ఎంత? 1500 ఏళ్లుగా వెంకన్నకు తలనీలాలు ఇచ్చిన వారు ఎంతమంది? నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని? అని అడిగితే ఏమి సమాధానం చెప్పగలనో… పరకామణి కేసులో అంతే సమాధానం చెప్పాను అని అన్నారు.
ఇది కేవలం వ్యంగ్యం మాత్రమే కాదు, ఇది సీఐడీ ప్రశ్నలను, విచారణ ప్రక్రియను పూర్తిగా విలువ లేనివిగా ప్రకటించడం. సైకాలజీ ప్రకారం, ఎవరైనా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా తమకు ఇబ్బంది కలిగించే ప్రశ్నలను ఎదుర్కొంటున్నప్పుడు, వాటికి సమాధానం ఇవ్వకుండా ఉండటానికి ‘నిర్లక్ష్యం’ అనే రక్షణ యంత్రాంగాన్ని వాడుతారు. “మీ ప్రశ్నలు ఇంత అసంబద్ధంగా ఉంటే, నేను జవాబు చెప్పాల్సిన అవసరం ఏముంది?” అని పరోక్షంగా చెప్పడం ద్వారా, బాధ్యతను ప్రశ్నించే వారిపైకి నెట్టివేస్తారు. ఆయన చూపించే ఈ నవ్వు, ఆందోళనను దాచుకోవడానికి వాడే ముసుగు లాంటిది. సీఐడీ అధికారులు ఆయనను విచారించడానికి కాకుండా, ఆయన ఏదో సివిల్స్ వ్రాసి కలెక్టర్ అవ్వడానికి వచ్చినట్లు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు ఉచిత సమాధానాలు పొందడానికి పిలిచారన్నట్లుగా ఢాంబికాలు పోతున్నారు! భూమన ఆఫీసులో కూర్చుని ‘నేను ఫైళ్ళపై సంతకాలు పెట్టలేదు, వాన చినుకులను లెక్కపెడుతున్నాను’ అని రాస్తే.. ఆ ఫైలు కూడా పాస్ అయిపోయేది!
‘ముమ్మాటికీ ఆత్మహత్యే’:
మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ మరణం విషయంలో “ముమ్మాటికీ ఆత్మహత్యే, ప్రభుత్వ ఒత్తిడితోనే చనిపోయాడు” అని పోస్టుమార్టం నివేదిక (రిపోర్ట్) రాక ముందే ఆయన చెప్పడం, కేసులో అత్యంత సున్నితమైన అంశంపై సొంత తీర్పు ఇవ్వడం ‘రియాలిటీ డిస్టార్షన్’ అనే రక్షణ పద్ధతికి ఉదాహరణ. తనకు అధికారం లేని విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పడం ద్వారా, ఆ సంఘటనపై తనకున్న అధికారాన్ని, నియంత్రణను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. రాజీ వ్యవహారంపై అనుమానాలు ఉన్నా, మరణం విషయంలో ఖచ్చితత్వం చూపడం ద్వారా, ప్రజల మనసులో సతీశ్ మరణానికి-రాజీకి మధ్య సంబంధం లేదు అనే భావనను బలంగా నాటడానికి ప్రయత్నించాడు.
“చోరీ కేసు రాజీ గురించి నాకు ఏమీ తెలియదు, కానీ అధికారి మరణం గురించి మాత్రం లోతైన విశ్లేషణ తెలుసు!” అని తన క్రిమినల్ తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. . మాజీ చైర్మన్ పోలీసుల డ్యూటీని, పోస్ట్ మార్టం రిపోర్టును కూడా ఒకేసారి డీల్ చేయగలగడం… అదీ అసలైన మల్టీ-టాస్కింగ్! ఇకపై పోలీసులు కేసులను విచారించాల్సిన పని లేదు, భూమన సర్టిఫికెట్ తీసుకుంటే సరిపోతుంది.
“టేబుల్ అజెండాలో అందరూ పెట్టినట్టే నేను కూడా సంతకం పెట్టాను,” “ఈవోకు తెలియకుండా ఎలా జరుగుతుంది?” అంటూ భూమన తన బాధ్యతను వేరేవారిపైకి నెట్టే ప్రయత్నం చేశారు. ఇది బ్లేమ్ షిఫ్టింగ్- ప్రొజెక్షన్ అనే మానసిక రక్షణ. తన తప్పును అంగీకరించడానికి బదులుగా, సమష్టి బాధ్యత అనే మాటున ఇతరులందరినీ ఇరికించి, తాను కేవలం నామమాత్రుణ్ణి అని నిరూపించుకోవాలని చూస్తారు. అధికారం చలాయించేటప్పుడు ‘నేనే అంతా’ అంటారు, కానీ ఇబ్బందులు వస్తే ‘అందరూ ఉన్నారు, నేనేమీ చేయలేదు’ అంటారు.
చైర్మన్ ఉద్యోగం రబ్బరు స్టాంప్ వేయడం మాత్రమే అయితే, ఆ జీతం, ఆ పదవి దేనికోసం? ఇకపై టీటీడీకి చైర్మన్ అవసరం లేదు. కేవలం ఒక ల్యామినేటెడ్ సంతకం సరిపోతుంది. ఆ సంతకాన్ని పెట్టి, దానికి సంబంధించిన ఫైళ్ళను నేరుగా ఈవో చూసుకుంటారు! భూమన కరుణాకర్ రెడ్డి ప్రవర్తన కేవలం ఒక రాజకీయ నాటకం కాదు. ఇది అధికారం ఇచ్చిన అహంకారం మరియు తనను తాను చట్టానికి అతీతంగా భావించిన మానసిక వైఖరి.
విచారణను, న్యాయవ్యవస్థను, మరణించిన అధికారి విషయాన్ని కూడా ఆయన వ్యంగ్యంతో కొట్టిపారేయడం, ఆయన తనను తాను ఎంత అసాధారణమైన వ్యక్తిగా భావిస్తున్నారో తెలియజేస్తుంది.
కానీ, గుర్తుంచుకోవాల్సిన విషయం:
న్యాయం మొసళ్ళను లెక్కపెట్టదు, అది కేవలం సాక్ష్యాలను మాత్రమే లెక్కపెడుతుంది. తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్లు, ఇన్నిసార్లు తిరుమల ఆలయ పాలక అధ్యక్షుడిగా చేసి, “1500 ఏళ్లుగా వెంకన్నకు తలనీలాలు ఇచ్చిన వారు ఎంతమంది” అనే అంశంపై కూడా వ్యంగ్యం ప్రదర్శించడం తన పొగరుకు పరాకాష్ట. వ్యవస్థలను, ఆఖరికి దేవుడంటే లెక్కలేదు. వెంకన్న లెక్కలు వేరే.. దేవుడే లెక్క చూపుతాడు!!