Suryaa.co.in

Telangana

కేంద్ర ప్రభుత్వ క‌క్ష‌పూరిత వైఖ‌రిపై గ‌ళం వినిపించండి!

-టీఆర్ఎస్ ఎంపీల‌కు కేసీఆర్ దిశానిర్దేశం!

పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభ‌మ‌వుతున్న వేళ‌… తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ శ‌నివారం పార్ల‌మెంట‌రీ పార్టీ భేటీని నిర్వ‌హించింది. లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ‌లో ఎంపీలుగా కొన‌సాగుతున్న టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొన్న ఈ స‌మావేశంలో పార్ల‌మెంటులో పార్టీ అనుస‌రించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పాలని ఆయ‌న ఎంపీలను ఆదేశించారు.

ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ప్రోత్సహించడం మాని, తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం ద్వేషపూరితంగా వ్యవహరించడాన్ని ఎండగట్టాలన్నారు. తెలంగాణ ఏర్పడిన 8 ఏళ్ల‌లో రాష్ట్ర విభజన హామీలు సహా పలు హక్కులను తొక్కిపెడుతున్న బీజేపీ అసంబద్ధ వైఖరిని, కలిసొచ్చే విపక్ష ఎంపీలతో సమన్వయం చేసుకొని ఎండగట్టాల‌ని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి నిలిచిపోతున్న నేపథ్యంలో, సోయి ఉన్న తెలంగాణ బిడ్డలుగా, భారత పౌరులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉన్నదని, అందుకు పార్లమెంటు ఉభయ సభలనే సరైన వేదికలుగా మలుచుకోవాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.

ఆర్ధిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మోదీ ప్రభుత్వం ఏనాడూ ప్రోత్సహించకపోగా, అభివృద్ధిని అడ్డుకునే దిశ‌గా కుట్రలకు పాల్పడుతున్నదని కేసీఆర్ దుయ్యబట్టారు. దేశంలోని 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణకంటే ఎక్కువగా ఉన్నాయన్న కేసీఆర్‌.. పరిధికి లోబడే తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్నద‌ని తెలిపారు.

రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్ల కాలంలో ఒక్క రోజు కూడా, ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు తెలంగాణ సొంతమని ఆయ‌న తెలిపారు. ఆర్బీఐ వేసే బిడ్లలో తెలంగాణకే ఎక్కువ డిమాండ్ పలుకుతున్న విషయం వాస్తవం కాదా? అని కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. పాలనలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న తెలంగాణ మీద ప్రధాని మోదీకి కన్ను కుట్టిందని, నిబంధనల పేరుతో ఆర్ధికంగా తెలంగాణను అణచివేయాలని చూడటం అత్యంత శోచనీయమని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

LEAVE A RESPONSE