మళ్లీ కేసీఆరే!

- వణుకుతున్న ‘హస్తం’
- పడిపోతున్న రేవంత్ సర్కార్ గ్రాఫ్
- పెరిగిన బీఆర్‌ఎస్ గ్రాఫ్
- కాంగ్రెస్ వైపు 37.1 శాతం(39,630 మంది)
- బీఆర్ ఎస్ వైపు 40.7 శాతం (43,530 మంది)
- బీజేపీ వైపు 14.1 శాతం (15,030 మంది)
- కాంగ్రెస్‌పై పెరుగుతున్న వ్యతిరేకత
- కాంగ్రెస్ పై జెన్ జీ అసంతృప్తి
- బీఆర్ ఎస్ సోషల్ మీడియా సక్సెస్
- కాంగ్రెస్ సోషల్ మీడియా ఫ్లాప్
- కేసీఆర్ పాలనపై 51 శాతం మంది మొగ్గు
- బీజేపీలో కనిపించని యూత్ లీడర్స్
- హామీల అమలే హస్తానికి శాపం
- గ్రేటర్ ఎన్నికల్లో ఒకటి కాంగ్రెస్, రెండు బీఆర్‌ఎస్‌కు
- హైదరాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్-మజ్లిస్ కూటమికే
- మల్కాజిగిరి, సైబరాబాద్ బీఆర్‌ఎస్‌కే
- సిట్టింగ్ స్థానాలు పోగొట్టుకోనున్న బీజేపీ
- బీఆర్ఎస్‌కే పట్టభద్రుల ఎమ్మెల్సీ
- చాణక్య స్ట్రాటెజీస్ సర్వే సంచలనం
(సుబ్బు)
అనుకున్నదే అవుతోంది. వెయ్యి రోజుల్లోనే ‘హస్తం’ పార్టీకి ‘నరాల బలహీనత’ మొదలయి.. అది శరీరమంతా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇక గులాబీ పార్టీ ‘కారు’ మళ్లీ జనక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. తమ మధ్యలో మళ్లీ షి‘కారు’ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాకపోతే కేసీఆర్ ఫాంహౌస్ విడిచిపెట్టి జనంలోకి రావాలంటున్నారు.
బీజేపీ పరిస్థితి.. ఎగిరెగిరి దంచినా అదే కూలీ. ఎగరకుండా దంచినా అదే కూలీ అన్నట్లు మారింది. గ్రేటర్‌లో ఉన్న కార్పొరేటర్ స్థానాలు కూడా పోగొట్టుకునేందుకు సిద్ధంగా ఉంది. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని వెయ్యిరోజుల పాలపై జెన్‌జీ ఏమాత్రం సంతృప్తి లేరట. బీఆర్‌ఎస్ వైపు జెన్‌జీ చూస్తున్నారంటూ చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్థ వెల్లడి ంచిన అంశాలు.. తెలంగాణ వాస్తవ రాజకీయ ముఖచిత్రానికి అద్దం పడుతోంది.
చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన సర్వేలో వెల్లడయిన అంశాలు వాస్తవాలేనని.. ఏ పార్టీకి చెందని తటస్ధులు సైతం అంగీకరిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం కావడం, నిరుద్యోగులకు ఉద్యోగ-ఉపాథి అవకాశాలు లేకపోవడం వంటి ప్రధాన అంశాలు కూడా.. కాంగ్రెస్ గ్రాఫ్ వేగంగా పడిపోవడానికి, కీలక పాత్ర పోషించాయని రాజకీయ విశ్లేషకుల ఉవాచ.
‘‘ 80 శాతం యువత కాంగ్రెస్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తికి ప్రత్యామ్నాయంగా బీఆర్ ఎస్ పార్టీ కనబడుతున్నప్పటికీ, క్యాడర్ పునర్ నిర్మాణంలో ఉన్న లోపాలు పెద్ద మైనస్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనకు వెయ్యి రోజులు పూర్తైన సందర్భంగా జరిగిన సర్వేలో క్షేత్రస్థాయిలో, 2023 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగిపోయింది. బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది.
బీజేపీ గ్రాఫ్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. బీఆర్ ఎస్ వచ్చేసారి ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ పార్టీ క్యాడర్ ను పునర్ నిర్మించుకోవాలి. ఇన్ చార్జిలను మార్చాలి. కేసీఆర్ జనంలోకి రావాలి. క్యాడర్ పునర్ నిర్మించుకోవాల్సిందే. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయం, 2014లో బీఆర్ ఎస్ విజయం వెనుక ఉన్నది ఈ యువతరమే. వాళ్లు ఎటువైపు ఓటేస్తే ఆ ప్రభుత్వాలే ఏర్పడ్డాయి.జెన్ జీ ఓటు వన్ సైడే ఉంటుంది. దాదాపు 23 శాతం ఉన్న కొత్త జెన్ జీ ఓటర్లు ..ఎవరికి ఓటేస్తామో ఇంకా నిర్ణయించుకోలేదు. ఎన్నికలకు ఇంకా రెండేండ్లు ఉంది కాబట్టి ఏదైనా జరగొచ్చు ’’
- ఇది తాజాగా చాణక్య స్ట్రాటెజీస్ సర్వే నిర్వహించిన సర్వేలో వెల్లడయిన అంశాలు.
అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ గ్రాఫ్ వేగంగా పడిపోతుండగా, అంతే వేగంగా బీఆర్‌ఎస్ గ్రాఫ్ పెరుగుతోందని స్పష్టమవుతుంది. ఇక బీజేపీ పరిస్థితి ఇంకా మెరుగవలేదన్న చాణక్య.. జెన్‌జీ ఎటు మొగ్గితే విజయలక్ష్మి వారినే వరిస్తుందని చెబుతోంది.
మొత్తానికి బీఆర్‌ఎస్ కారు మళ్లీ పరుగులు తీస్తుందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో హైదరాబాద్ ఒక్కటే కాంగ్రెస్‌కు, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లు బీఆర్‌ఎస్ ఖాతాలో కలుస్తాయని జోస్యం చెప్పింది. కాకపోతే.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తప్పనిసరిగా ఇక జనక్షేత్రంలోకి వచ్చి, పార్టీలో జోష్ తీసుకురాకతప్పదని కుండబద్దలు కొట్టింది. కాగా చాణక్య స్ట్రాటజీస్ దేశంలోని కొద్ది విశ్వసనీయ సర్వే సంస్థల్లో ఒకటి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తైన సందర్భంగా చాణక్య స్ట్రాటెజీస్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా జనం నాడీ పట్టుకునేందుకు సర్వే నిర్వహించింది.
ఈ సందర్భంగా జూలై నుంచి ఆగస్టు మధ్య ప్రతి నియోజకవర్గాల్లో 800 నుంచి 1000 మందితో మాట్లాడి మొత్తం 1,06, 820 శాంపుల్స్ సేకరించారు.ఒక్కో గ్రామ పంచాయితీలో 10 నుంచి 20 మందిని సంప్రదించారు. ఈ సర్వే నివేదిక ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
37.1 శాతం(39,630 మంది) కాంగ్రెస్ వైపు, 40.7 శాతం (43,530 మంది) బీఆర్ ఎస్ వైపు, 14.1 శాతం (15,030 మంది) బీజేపీ వైపు మొగ్గు చూపారు. మరో 8.1 శాతం(8620 మంది) ఎటూ మొగ్గు చూపలేదు.
కాంగ్రెస్ పై వ్యతిరేకత బాగా పెరిగింది. ఆ పార్టీ పై జెన్ జీ అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ ఎస్ గ్రాఫ్ పెరిగింది. బీజేపీ ఇంకా కోలుకోలేదు. బీఆర్ ఎస్ సోషల్ మీడియా సక్సెస్ అయ్యింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఫ్లాప్ అయ్యింది. 51 శాతం ప్రజలు కేసీఆర్ పాలనే బాగుందని చెప్పారు. ఈ సర్వే పూర్తి సమాచారం ఇలా ఉంది.
చాణక్య సర్వే నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, 2023 శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 39.4 శాతం ఓట్లు పడ్డాయి ప్రస్తుత సర్వేలో ఆ గ్రాఫ్ -2.3% తేడాతో 37.1 శాతానికి పడిపోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రజలు భావిస్తున్నారు. రోజు రోజుకూ జాప్యం అవుతున్నది.
తమకు ఇస్తామన్న 2500 పెన్షన్ ఎన్నికల ముందు ఇచ్చినా సరే ఓటు వేయమని ప్రజలు కచ్చితంగా చెబుతున్నారు. మరోవైపు గ్రామ పంచాయితీల్లో, మున్సిపాలిటీల్లో పాలనకు సంబంధించి ఎటువంటి కొత్త మార్పూ చోటు చేసుకోలేదు. నెగెటివ్ వేవ్ ఏర్పడి ఉంది. మరో 800 రోజుల్లో సరిచేసుకోకపోతే కష్టమే.
2023 ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు 37.3 శాతం ఓట్లు పడ్డాయి. ఇప్పటి సర్వేలో ఆ పార్టీ గ్రాఫ్ పెరిగింది. 3.4 శాతం అదనపు ఓట్లతో ప్రజల్లో నమ్మకం పెంచుకోగలిగింది. అయితే కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను బీఆర్ ఎస్ ఇంకా అందిపుచ్చుకోవడం లేదు. కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్న జెన్ జీలు ప్రత్యామ్నాయంగా బీఆర్ ఎస్ వైపు చూస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో క్యాడర్ పునర్మిర్మాణం జరగకపోవడం వల్ల.. అది సాధ్యపడడం లేదు.
2023 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చి ఉంటే బీఆర్ ఎస్ ఓడిపోయి ఉండేది కాదు. ఓటమికి కారణం కేసీఆర్ కాదు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులే. అయితే ఇప్పటికీ బీఆర్ ఎస్ పుంజుకోకపోవడానికి కారణం, ప్రజల్లో వ్యతిరేకత మూట గట్టుకుని ఓడిపోయిన అభ్యర్థులేఇంకా ఇప్పటికీ ఇన్ చార్జులుగా కొనసాగుతున్నారు.
ప్రస్తుతానికైతే జెన్ జీలు ఇంకా బీఆర్ ఎస్ వైపు మొగ్గు చూపడం లేదు. అయితే కేసీఆర్ ప్రజల్లోకి వస్తే ..ఆయనకు మళ్లీ ఓటు వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పలు ప్రాంతాల్లో స్పందనలు వచ్చాయి.
రానున్న ఖమ్మం నల్లగొండ వరంగల్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో బీఆర్ ఎస్ బలంగా కనిపిస్తున్నది. 34 నియోజకవర్గాల్లో సర్వే జరిగింది. ఎవరికి ఓటేస్తారని అడిగిన ప్రశ్నకు బీఆర్ ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. వరంగల్ ఉమ్మడి జిల్లా అంతా రాకేశ్ రెడ్డి వైపు ఏక పక్షంగా ఉంది.
ఖమ్మంలో సత్తుపల్లి, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాలను మినహాయిస్తే.. మిగిలిన నియోజకవర్గాలన్నీ బీఆర్ ఎస్ కే అనుకూలంగా ఉన్నాయి. నల్లగొండలోని ఆలేరు, భువనగిరి, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నల్లగొండ పట్టణంలో బీఆర్ ఎస్ బలంగా ఉంటే.. మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. ఈ గణాంకాలను కలిపితే, వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏనుగుల రాకేశ్ రెడ్డి కే విజయ అవకాశాలు బలంగా ఉన్నాయి.
మేడ్చల్ మల్కాజిగిరి మున్సిపాలిటీ, సైబరాబాద్ మున్సిపాలిటీల్లో ని 74 డివిజన్లలో 48 నుంచి 50 సీట్లు బీఆర్ ఎస్. చివరి సారి ఎన్నికల్లో ఎల్బీనగర్ లో బీజేపీ కి అన్ని సీట్లు వచ్చాయి. ఈ సారి అక్కడ బీఆర్ ఎస్ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. అక్కడ 18 డివిజన్లలో 15 బీఆర్ ఎస్ కే వస్తున్నాయి.
మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో 16లో బీఆర్ ఎస్ కు 8 కాంగ్రెస్ కు 7 డివిజన్లు బీజేపీకి 1 డివిజన్ దక్కుతున్నాయి. ఉప్పల్ లో బీఆర్ ఎస్ ,బీజేపీల మధ్య పోటీ ఉంది. మల్కాజిగిరిలో బీజేపీ, బీఆర్ ఎస్, కాంగ్రెస్ ల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నది.
సైబరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో శేరిలింగంపల్లిలోని 15 డివిజన్లలో 10 చోట్ల బీఆర్ ఎస్, 4 చోట్ల కాంగ్రెస్, ఒక చోట బీజేపీ బలంగా ఉన్నాయి. పటాన్ చెరులో బీఆర్ ఎస్ పూర్తి బలంగా ఉంది. కాగా, హైదరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ.. ఎంఐఎంతో కలిసి పోటీ చేసే పరిస్థితి ఉన్నందున ఆ మున్సిపాలిటీ కాంగ్రెస్ కే దక్కొచ్చు.
బీజేపీ పరిస్థితి 2023 నుంచి ఇప్పటి వరకు ఓటింగ్ శాతంలో పెద్దగా మార్పు కనబడలేదు. గత శాసనసభ ఎన్నికల్లో 13.9గా ఉన్న ఓటింగ్ శాతం ఇప్పుడు అతి స్వల్పంగా పెరిగి 14.1 గా నమోదైంది. అయితే ఒకవేళ బీజేపీ బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటిస్తే, కొన్ని స్థానాల్లో స్వల్ప మెజారిటీతో మరిన్ని సీట్లు దక్కించుకొని కింగ్ మేకర్ గా మారి, ప్రభుత్వ ఏర్పాటు లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
అంతే తప్ప ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ప్రకారం మాత్రం ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపించడం లేదు. ఆశ్చర్యకరంగా జెన్ జీ వారివైపు పెద్దగా మొగ్గు చూపలేకపోవడం గమనార్హం. పైగా రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు తలా ఒక కుంపటి పెట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీలు, అయోధ్య విరాళాల చోరీ వంటి ఘటనలపై మౌనం దాల్చడం, రాష్ట్ర సమస్యలపై ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు.
అన్నింటికన్నా ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునే లీడర్ ఎవ్వరూ తెలంగాణ బీజేపీలో లేరు. 2020 లో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 కు 11 డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది. అయితే ఈ సర్వే ప్రకారం 11కు 11 మంది ఓడిపోతున్నారు. ఈ విధంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతూ వస్తున్నది.
ఇక సోషల్‌మీడియా వేదికగా ప్రజలను ఆకట్టుకోవటం.. ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడంలో బీఆర్‌ఎస్ సోషల్‌మీడియా వింగ్ సక్సెస్ కాగా, అధికార కాంగ్రెస్ సోషల్‌మీడియా చతికిలపడింది. బీఆరెస్ సంధించే అస్త్రాలు, చేసే ట్రోలింగ్, డిజిటల్ క్యాంపెయిన్‌తో పోలిస్తే.. కాంగ్రెస్ పార్టీ బీఆరెస్ దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. అయితే.. రేవంత్‌రెడ్డి వ్యక్తిగత సోషల్‌మీడియా మాత్రం, ఆయనను బాగానే ఎలివేట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎటొచ్చీ కాంగ్రెస్ సోషల్‌మీడియానే చతికిలపడగా.. బీఆర్‌ఎస్ సోషల్‌మీడియా జనాలకు చేరువయింది.
